తెలుగు వాకిట హైదరాబాద్ ఉర్దూ ఫిక్షన్!
ABN, First Publish Date - 2023-11-06T00:22:31+05:30
ఐదేళ్ళ క్రితం జీలానీబానూ గారి రెండో కథా సంకలనం ‘అంతా నిజమే చెప్తా...’ పుస్తకావిష్కరణ తర్వాత ఈ ఆలోచనకు బీజం పడింది. హైదరాబాద్‌లో లబ్ధప్రతిష్ఠులైన ఉర్దూ రచయితలు చాలామంది ఉన్నారు...
మెహక్ హైదరాబాదీ : పలకరింపు
హైదరాబాద్‌కు చెందిన ముస్లిం రచయితలు హిందూ జీవితాలను నేపథ్యంగా తీసుకొని ఉర్దూలో రాసిన కథలను ‘గుల్‌దస్త’ పేరిట ఇలా అనువదించి, సంకలించాలన్న ఆలోచన, స్ఫూర్తి మీకు ఎలా కలిగాయి?
ఐదేళ్ళ క్రితం జీలానీబానూ గారి రెండో కథా సంకలనం ‘అంతా నిజమే చెప్తా...’ పుస్తకావిష్కరణ తర్వాత ఈ ఆలోచనకు బీజం పడింది. హైదరాబాద్‌లో లబ్ధప్రతిష్ఠులైన ఉర్దూ రచయితలు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక సంపుటాలు తీసుకురాలేము కాబట్టి హైదరాబాద్‌కు ఎంతో పేరుప్రతిష్ఠలు తెచ్చిన రచయితల కథలతో మూడు సంకలనాలను తీసుకురావాలని అనుకున్నాను. ‘వందేళ్ళ హైదరాబాద్ ఉర్దూ కథాసాహిత్య ప్రాజెక్టు’ కింద 1925- 2025 మధ్యకాలంలో అచ్చయిన ప్రముఖ ఉర్దూ రచయి తలకు చెందిన కనీసం ఒక ఉత్తమ కథ అనువదిం చాలన్నది ఉద్దేశం. ఈ ప్రాజెక్టు నా మానస పుత్రిక. కథల సేకరణ క్రమంలో హిందువుల జీవితాలకు సంబంధించిన పది కథలు దొరకడంతో, మరో డజను వెలికితీసి ‘గుల్‌దస్త’ పేరుతో మొదటగా ఈ సంకలనం తీసుకువచ్చాను. ఇది హిందువుల ఇతివృత్తాలపై హైదరాబాద్ ముస్లిం రచయితల కథలను ఏరికూర్చిన ప్రత్యేక ఖీజ్ఛిఝ్ఛఛీ అుఽ్టజిౌజూౌజడ అని చెప్పొచ్చు.
హిందువులు, ముస్లింలు మతపరంగా నిట్టనిలువుగా చీలి శత్రుభావనలు వేళ్ళూనుకుంటున్న ప్రస్తుత వాతావరణంలో వారి మధ్య అనుమానాలు, అపోహలను పోగొట్టేందుకు ఇలాంటి ప్రయత్నం అవసరమనిపించింది. ఒకప్పుడు హిందువులపై హైదరాబాద్ ముస్లిం రచయితలు ఎలాంటి కథలు రాశారో తెలుసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. అంతేకాదు వారి మధ్య అంతరాలు, దురభిప్రాయాలు కొంతమేర తొలగిపోయేందుకు దోహదపడుతుంది.
ఈ కథల సేకరణ ఎలా జరిగింది. ఈ సేకరణలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన, లేదా మీకు ప్రత్యేకంగా తోచిన అంశాలేమైనా ఉన్నాయా?
ఈ మొత్తం ప్రాజెక్టులో చాలా కష్టమైన అంశం కథల సేకరణే. ‘గుల్‌దస్త’లో గత 85ఏళ్ళ కాలంలో 20 మంది రచయితలు రాసిన 22 కథలు తీసుకున్నాను. ఇందులో 17మంది రచయితలు కాలం చేశారు. చాలామంది రచయితల పిల్లలకు తమవారి రచనలను తెలుగులోకి తీసుకురావాలన్న ఆసక్తి లేదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే...హైదరాబాద్ ఉర్దూ కథల ప్రత్యేక సంపుటి ఒక్కటీ ఆ భాషలో ఇప్పటిదాకా వెలువడలేదు. అంచేత కష్టసాధ్యమైన ఈ పని నత్తనడకన మూడేళ్ళపాటు సాగింది. కొన్ని కథల పుస్తకాలు దిల్లీ నుంచి తెప్పించుకున్నాను. హైదరాబాద్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ, ఇదారే అదబి యాతే ఉర్దూ సంస్థ, ఉర్దూ హాలు, ఇతర గ్రంథాలయాలను ఆశ్రయించాను. దాదాపు 500 కథలను చదివాక ఈ 22 కథలను ఎంపిక చేశాను.
ఈ కథలలో ప్రముఖంగా వ్యక్తమైన దృక్కోణాలను, దృక్పథాలను చెప్పగలరా?
మొత్తం 20మంది కథకులలో ఒకరిద్దరు మినహా అంతా అభ్యుదయ రచయితలే. వీరంతా ఉర్దూకు సంబంధించిన ‘అంజుమన్ తరక్కీ పసంద్ ముసన్నఫీన్’ (అభ్యుదయ రచయితల సంఘం) భావజాలంతో కథలు రాసినవారే. హిందూ సమాజంలోని సంప్రదాయాలు, ఆచారాలు, కట్టు బాట్లు, భక్తి విశ్వాసాలు, పురాణాలపై ముస్లిం రచయితల దృక్పథాలను ఈ రచనలు తేటతెల్లం చేస్తాయి. అణగారిన, బలహీన, పేద, కార్మిక వర్గాల కడగండ్లు, అస్పృశ్యత, స్త్రీవాద, జెండర్ సమస్యలను స్పృశిస్తూ రాసిన ఎక్కువ కథలను తీసుకున్నాను.
మీరు ఈ పుస్తకాన్ని సంకలించిన స్ఫూర్తికి అద్దం పట్టిన ఇందులోని కొన్ని కథల గురించి క్లుప్తంగా వివరించండి?
హిందూ సమాజం, దాని చుట్టూ అల్లుకున్న సమస్యలపై లోతైన అవగాహన కలిగిన ముస్లిం రచయితలు, వాటిని సన్నిహితంగా గమనించినట్లుగా చాలా కథలలో స్పష్టమవు తుంది. కృష్ణభక్తిపై రెండు కథలు, అంటరానితనం కార ణంగా వివక్షకు గురైన ఒక మాదిగ డాక్టర్ వ్యథలు, స్త్రీని ఆటబొమ్మను చేసే పురుషాధిక్య సమాజం, స్త్రీ పురుషులకు అమలయ్యే ద్వంద్వ ప్రమాణాలు, నక్సలైట్లు, బీదలపాట్లు, బడుగువర్గాల మహిళలు, కార్మికుల కష్టాలకు సంబం ధించిన ఇతివృత్తాలతో కథలు ఇందులో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పీడితులకు గొంతునిచ్చి, వారి పక్షాన రాసిన కథలకే ‘గుల్‌దస్త’లో ప్రాధాన్యమిచ్చాను.
భవిష్యత్తులో మీ నుంచి ఏమేం పుస్తకాలు రానున్నాయి?
‘వందేళ్ళ హైదరాబాద్ ఉర్దూ కథా సాహిత్య సిరీస్’ కింద మరో రెండు సంపుటాలు తీసుకువచ్చే ఆలోచన ఉంది. ప్రస్తుతం సంఘసంస్కర్త, మరాఠీ దళిత రచయిత అణ్ణా భావూ సాఠే కథలను అనువదిస్తున్నాను. కేంద్ర సాహిత్య అకాడెమీ ఇచ్చిన రెండు ప్రాజెక్టులు కూడా చేపట్టాను. హైదరాబాద్ ఉర్దూ కాల్పనిక సాహిత్యం, చరిత్ర, నాన్ ఫిక్షన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి తెలుగువారికి మంచి రచనలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాను.
ఫోన్: 70361 75175
Updated Date - 2023-11-06T00:22:34+05:30 IST