ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గాజాలో ‘ఆటవిడుపు’

ABN, First Publish Date - 2023-11-24T00:37:45+05:30

ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య కుదిరిన స్వల్పకాలిక కాల్పుల విరమణ ఒప్పందం కాస్తంత జాప్యం జరిగినా అమల్లోకి రావడమైతే ఖాయంగానే కనిపిస్తోంది. ఖతార్‌, అమెరికా, ఈజిప్ట్‌ చొరవతో...

ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య కుదిరిన స్వల్పకాలిక కాల్పుల విరమణ ఒప్పందం కాస్తంత జాప్యం జరిగినా అమల్లోకి రావడమైతే ఖాయంగానే కనిపిస్తోంది. ఖతార్‌, అమెరికా, ఈజిప్ట్‌ చొరవతో ఉభయపక్షాల మధ్యా కుదిరిన ఈ ఒప్పందం నలభైఐదురోజులుగా సాగుతున్న అతి భయానక, అమానవీయమైన యుద్ధానికి ఓ నాలుగురోజుల విరామం ఇవ్వబోతున్నది. గత నెల ఇజ్రాయెల్‌పై దాడి సందర్భంలో హమాస్‌ బందీలుగా అపహరించుకుపోయినవారిలో ఓ యాభైమందిని విడుదల చేయడం, అందుకు ప్రతిగా ఇజ్రాయెల్‌ జైళ్ళలో మగ్గుతున్న నూటయాభైమంది పాలస్తీనా ఖైదీలను అప్పగించడం ఈ స్వల్పకాలిక విరామం ప్రధాన లక్ష్యం. ఈ మార్పిడి కార్యక్రమంతో పాటు తిండికీ, నీటికీ, మందులకు వాచిపోయివున్న గాజా సామాన్యజనానికి కాస్తంత మానవతాసాయం లభించబోతుండటం మరింత సంతోషించాల్సిన అంశం. బందీల మార్పిడి సజావుగా సాగడానికి వీలుగా, ఈ నాలుగురోజుల పాటు అటు ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు గాజామీద బాంబులువేయవు, ఇటు హమాస్‌ రాకెట్‌ దాడులూ చేయబోదట. మరికొంతమంది బందీలను విడుదలచేయడానికి హమాస్‌ అంగీకరించిన పక్షంలో ఈ ఉపశమన కాలం నిడివి ఇంకొంత పెరగవచ్చునని అంటున్నప్పటికీ, ఈ కాలాన్ని ఆ సంస్థ తనను తాను కూడదీసుకోవడానికి, యుద్ధవ్యూహాలను తిరగరాసుకోవడానికి ఉపయోగించుకుంటుందని ఇజ్రాయెల్‌ అనుమానిస్తున్న నేపథ్యంలో, ఈ నాలుగురోజుల అనంతరం తిరిగి యుద్ధం ఆరంభమయ్యే అవకాశాలే అధికం. అంతలోగానే, ఈ విరామాన్ని పూర్తిస్థాయి కాల్పుల విరమణకు, శాశ్వత శాంతికి మార్గం సుగమం చేసే రీతిలో మిగతా ప్రపంచం వ్యవహరించాలన్నది చాలామంది ఆకాంక్ష.

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ పరిభాషలో చెప్పాలంటే, ఈ ఆటవిడుపు అమల్లోకి వచ్చే ఆఖరుక్షణం వరకూ అది బాంబులు వేస్తూనే ఉంటుంది, గాజావిధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఒప్పందం గురించి ఇజ్రాయెల్‌ మంత్రివర్గం చర్చిస్తున్నప్పుడూ, దానిని ప్రకటిస్తున్నకాలంలో కూడా గాజాలో మృత్యుఘోష ఆగలేదు. విరామం అమల్లోకి వచ్చే ఆఖరుక్షణం వరకే కాదు, అది ముగిసిన మరుక్షణంలోనూ మళ్ళీ యుద్ధమే అని నెతన్యాహూ హూంకరిస్తున్నారు. ఈ కొద్దిగడువును హమాస్‌ తనశక్తిని కూడదీసుకోవడానికి వాడుకుంటుందన్న వాదనలు ఉన్నట్టే, అది ముగిసిన తరువాత ఇజ్రాయెల్‌ సైతం గాజాలో మరింత విజృంభించడానికి, సిరియా, లెబనాన్‌ వంటిదేశాల్లో శత్రుసంహారానికి సిద్ధపడుతోందన్న అనుమానాలూ లేకపోలేదు.

అనేకవారాలపాటు రాకెట్లు, బాంబులతో నివాసాలు, ఆలయాలు ఆస్పత్రులు అన్నింటినీ నేలమట్టం చేసి, పదమూడువేలమందిని హతమార్చి గాజాను ఇజ్రాయెల్‌ ఒక వల్లకాడులాగా తయారుచేసిన స్థితిలో ఈ నాలుగువారాల గడువు మానవతాసాయానికి ఏ మాత్రం సరిపోదు. హమాస్‌ని సమూలంగా నాశనం చేయడం పేరిట అది సాగిస్తున్న విధ్వంసం, దాని ఆంక్షలూ నిర్బంధాలు ఆకలిచావులకూ దారితీస్తున్నాయి. ఆస్పత్రులను కూడా హమాస్‌ ఆయుధకేంద్రాలుగా మార్చేసిందన్న వాదనతో వాటినీ ధ్వంసం చేస్తూ సకాలంలో వైద్యం అందక బాధితులు తమకు తాముగా చనిపోయేట్టు చేస్తున్నది. హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ అంటూ ఒక అతిపెద్ద ఆసుపత్రిని నేలమట్టం చేసిన ఇజ్రాయెల్‌, తన ఆరోపణకు ఇప్పటివరకూ నిర్దిష్టమైన ఆధారాలేవీ చూపలేదు. తీవ్రవాదులను అంతం చేయడమన్న లక్ష్యంతో ఆరంభమైన ఈ యుద్ధం వారిని ఎంతమేరకు దెబ్బతీయగలిగిందో తెలియదు కానీ, పాలస్తీనియన్ల నరమేధానికి మాత్రం కారణమవుతున్నది.

ఈ పరిస్థితుల్లో, పరస్పర హననమే లక్ష్యంగా సాగుతున్న ఒక అమానవీయమైన, భారీ యుద్ధానికి ఇంతకాలం తరువాత ఒక చిన్న విరామం దక్కింది. ఇజ్రాయెల్‌ కోరుతున్నట్టుగా తిరిగి యుద్ధం మొదలైతే ఇంతకు మించిన దారుణమైన పరిస్థితులు ప్రపంచం చూడాల్సి వస్తుంది. అది హమాస్‌ నిర్మూలనకంటే ఇజ్రాయెల్‌ అంతర్లీనంగా ఆకాంక్షిస్తున్న జాతిహననానికే ఉపకరిస్తుంది. ఒక ఉగ్రవాదదాడి, అందుకు ప్రతిగా ఒక దేశం ఆరంభించిన యుద్ధం సరిహద్దులను దాటి, ప్రాంతీయ స్థాయికీ, ప్రపంచస్థాయికీ విస్తరించే ప్రమాదాన్ని నిలువరించగలిగే అవకాశం ఇప్పుడు మాత్రమే ఉంది. ఈ ఆటవిడుపును ఒక పూర్తిస్థాయి కాల్పులవిరమణ దిశగా మార్చగలిగినపక్షంలో మిగతా బందీలందరి విడుదల సాధ్యపడుతుంది, పాలస్తీనియన్లందరికీ ఉపశమనం దక్కుతుంది. ఉద్రిక్తతలు చల్లారి, చర్చలకు, ఇచ్చిపుచ్చుకొనేందుకు అవకాశం ఏర్పడుతుంది. అసాధ్యం అనుకున్న విరామాన్ని సుసాధ్యం చేసిన దేశాలతో పాటు మిగతా అగ్రదేశాలు కూడా రంగంలోకి దిగాల్సిన తరుణం ఇది.

Updated Date - 2023-11-24T00:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising