విడిగా, కలివిడిగా
ABN, First Publish Date - 2023-11-15T01:28:07+05:30
ఐదవవిడత సమావేశమే కావచ్చును కానీ, ఇటీవలి భారత్–అమెరికా టూప్లస్‌టూ మంత్రుల స్థాయి భేటీ అత్యంత కీలకమైన, సంక్షుభిత కాలంలో జరిగింది...
ఐదవవిడత సమావేశమే కావచ్చును కానీ, ఇటీవలి భారత్–అమెరికా టూప్లస్‌టూ మంత్రుల స్థాయి భేటీ అత్యంత కీలకమైన, సంక్షుభిత కాలంలో జరిగింది. గతంలో మాదిరిగా స్వేచ్ఛగా సంకల్పాలు చెప్పుకోగలిగినా, కొన్ని అంశాలమీద ఒక్కమాటగా నిలబడే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒకపక్కన అనాదిగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం కాస్తంత హెచ్చుతగ్గులతో అలాగే నడుస్తుండగా, పశ్చిమాసియాలో మరో కొత్త చిచ్చు మొదలైంది. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడితో ఆరంభమైన యుద్ధం నానాటికీ మరింత ఘోరమైన, అమానవీయమైన పరిస్థితులను సృష్టిస్తున్నది. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక అవసరాల రీత్యా భారత్–అమెరికా మరింత సన్నిహితమవుతూనే, అమెరికా భాషలో చెప్పాలంటే, నిర్దిష్టమైన అంశాలపై భారత్ తన స్వతంత్ర వైఖరితో వ్యవహరించడం సహజం.
పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ, ఈ టూప్లస్‌టూ సమావేశం వాయిదాపడకుండా అమెరికా విదేశాంగ, రక్షణమంత్రులు హాజరుకావడం విశేషం. ఇప్పుడు ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో భారతదేశం ప్రభావం, ప్రయోజనాలు విశేషమైనవి. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత, అమెరికాతో బంధం ఆలింగనాలస్థాయి వరకూ హెచ్చినా, రష్యాతో మనమైత్రి చెడలేదు. ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిన సమస్యలు, అమెరికా అలకలూ ఆగ్రహాలు ఉన్నప్పటికీ, భారతదేశం వాటిని అధిగమించగలిగింది. పశ్చిమాసియాలోనూ మనదేశానికి ఆర్థికం, ఇంధనం, వాణిజ్యంతో ముడిపడిన బలమైన బంధమే ఉన్నది. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని కలుపుకొనిపోకుండా తన భౌగోళిక రాజకీయాల, ఆధిపత్యాల పరిరక్షణ అమెరికాకు కష్టం.
ఇక, చైనాకు వ్యతిరేకంగా భారతదేశాన్ని నిలబెట్టడమన్న బృహత్‌కార్యం ఎలాగూ ఉండనే ఉంది. అమెరికాతో మన సాన్నిహిత్యం హెచ్చుతున్నకొద్దీ చైనా మరిన్ని వీరంగాలు వేస్తున్నది, సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తున్నది. అన్నిరంగాల్లో అమెరికాకు బలమైన ప్రత్యర్థిగా అవతరిస్తున్న చైనాను నియంత్రించడానికి భారతదేశాన్ని రక్షణపరంగా మరింత బలోపేతం చేసే ప్రక్రియ అతివేగంగా సాగుతోంది. వివిధ కూటముల్లో చేర్చుకోవడం ద్వారా, ప్రత్యేక హోదాలు కట్టబెట్టడం ద్వారా అమెరికా తరఫున ఈ ప్రాంతంలో చైనా దూకుడును, విస్తరణవాదాన్ని దీటుగా నిలువరించేందుకు భారతదేశం ఉపకరిస్తున్నది.
ఒకపక్క అమెరికా–చైనా అధ్యక్షుల మధ్య భేటీకి రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఈ టూప్లస్‌టూ సమావేశం జరిగింది. ఉభయదేశాలూ తమ సంయుక్త ప్రకటనలో చైనా విస్తరణవాదాన్ని తప్పుబట్టాయి, దాని కారణంగా ఈ ప్రాంతంలో భద్రతకు ఏర్పడిన ముప్పుగురించి ఏకమాటగా విమర్శచేసి, చైనాను కలసికట్టుగా ఎదుర్కోవాలని సంకల్పం చెప్పుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాత్రం, భారతదేశ ప్రయోజనాలు, వైఖరి భిన్నం కనుక, సంయుక్త ప్రకటనలో అమెరికా రాజీపడక తప్పలేదు. ఈ యుద్ధంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థకు, మరీ ముఖ్యంగా దక్షిణాది దేశాలకు వచ్చిన ఆర్థిక ముప్పు, మానవసంక్షోభం గురించి మాత్రమే అది ప్రస్తావించింది. ఇంకా యుద్ధం ముగియకుండానే ఉక్రెయిన్ పునర్నిర్మాణం గురించి ఓ ప్రస్తావన కూడా చేసింది.
హమాస్‌తో యుద్ధంలో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అమెరికా కూడా అదేమాటమీదే ఉన్నది కనుక, ఈ సంయుక్త ప్రకటనలో ఆ ఊసులేకపోవడం ఆశ్చర్యం కలిగించదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పక్షాన నిలబడుతూనే, మానవతాసహాయం గురించి మాత్రం ఉభయదేశాలూ ప్రస్తావించాయి. మిగతా బందీలను హమాస్ విడిచిపెట్టాలన్న డిమాండ్ మంచిదే కానీ, గాజా పూర్తిగా ధ్వంసమైపోయి, వేలాదిమరణాలతో, ఆకలిచావులతో సతమతవుతున్న స్థితిలో మానవత్వం గురించి నాలుగుముక్కలు చెప్పడం వల్ల ప్రయోజనమేమీ లేదు. యుద్ధానికి వ్యతిరేకంగా చాలా దేశాల్లో నిప్పురాజుకుంటూ, కాల్పుల విరమణ డిమాండ్ బలపడుతున్న స్థితిలో అమెరికా–భారత్ ఈ సంయుక్త ప్రకటనలో కాస్తంత ఇచ్చిపుచ్చుకొనే వైఖరి ప్రదర్శించినట్టు కనిపిస్తున్నది. ఇక, రక్షణ విషయంలో ఈ ఏడాది జూన్‌లో నిర్ణయించుకున్న రోడ్‌మ్యాప్‌ను వేగంగా ముందుకు తీసుకుపోవడం, అంతరిక్షం నుంచి వాణిజ్యం వరకూ సమస్త రంగాల్లో మరింత సహకారంలోనూ ఈ టూప్లస్‌టూ సమావేశం మరో అడుగుముందుకు వేసింది. భారతదేశం తన ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూనే, అమెరికాతో కలిసినడిచేందుకు దోహదం చేసింది.
Updated Date - 2023-11-15T01:28:09+05:30 IST