రాజభక్తుల వీరంగం
ABN, First Publish Date - 2023-11-25T02:42:11+05:30
నేపాల్ రాజధాని ఖాట్మండూలో రెండురోజులుగా వేలాదిమంది రోడ్లమీదకు వచ్చి నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
నేపాల్ రాజధాని ఖాట్మండూలో రెండురోజులుగా వేలాదిమంది రోడ్లమీదకు వచ్చి నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రాజధాని నడిబొడ్డువరకూ దూసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న వీరిపై ప్రభుత్వ బలగాలు లాఠీలు, టియర్‌గ్యాస్‌తో తీవ్రంగా విరుచుకుపడ్డాయని వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యమేమంటే, వీరంతా డిమాండ్ చేస్తున్నది నేపాల్‌లో తిరిగి రాజరికపాలన కావాలని. 2008లో రద్దయిన రాజరికం రావాలని, నేపాల్ మళ్ళీ హిందూ దేశం కావాలని డిమాండ్ చేస్తూ వారు జాతీయజెండాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. వారంతా రాజభక్తులని, మరీముఖ్యంగా రాజు జ్ఞానేంద్ర వీరాభిమానులని, అడపాదడపా ఇటువంటి ప్రదర్శనలు జరగడం ఉన్నదేనని కొందరు తీసిపారేస్తున్నప్పటికీ, రెండుమూడేళ్ళుగా ఈ రకమైన ప్రదర్శనలు జరగడం, ఇప్పుడు జరుగుతున్నది మరింత పెద్దదికావడం విశేషం. ఏరికోరి గణతంత్రరాజ్యాన్ని తెచ్చుకుంటే, అన్ని పార్టీలూ నైతికంగా పతనమైనాయని, ప్రభుత్వమూ సమస్తవ్యవస్థలూ అవినీతిమయమైనాయని, ఈ విఫలమైన పాలనావ్యవస్థను నిర్మూలించడానికి రాజరికాన్ని పునఃప్రతిష్ఠించడం ఒక్కటే మార్గమని వీరి వాదన.
ఈ ప్రదర్శనలు విస్తృత ప్రజాభిప్రాయానికి అద్దంపట్టకపోవచ్చు. కానీ, ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రస్తుత వ్యవస్థలు తమ జీవితాలను మెరుగుపరచడం లేదన్న భావన బలపడుతున్నప్పుడు గతమే ఉత్తమమన్న భావన వారిలో క్రమంగా హెచ్చడం మొదలవుతుంది. ఇటువంటి చిన్నాచితకా నిరసనలు క్రమంగా బలపడి విస్తరించే ప్రమాదమూ ఉంటుంది. 2006లో రాజరికానికి వ్యతిరేకంగా నేపాలీలు ఏ స్థాయిలో ఉద్యమించారో తెలియనిదేమీ కాదు. అనేకవారాల పాటు జనం రోడ్లమీద అలుపెరగని పోరాటం చేయడంతో చిట్టచివరి రాజు జ్ఞానేంద్ర ప్రజాగ్రహానికి తలొంచక తప్పలేదు. ఆయన పదవీచ్యుతుడైన తరువాత, నేపాల్ గణతంత్ర రాజ్యమైంది, రాజు స్థానంలో దేశాధ్యక్షుడు వచ్చారు, ప్రజాస్వామ్యం వెల్లివిరిసింది. అప్పటివరకూ ప్రపంచంలో మిగిలిన ఏకైక హిందూరాజ్యంగా ఉన్న నేపాల్ లౌకికరాజ్యంగా మారింది. ఒక సామాన్యుడిలాగా జీవిస్తున్న రాజుమీద ఇప్పటికీ ప్రేమాభిమానాలు, మూఢభక్తీ ఉన్నవారి సంఖ్య దేశంలో బాగానే ఉన్నా, ఆయన తిరిగి రావాలని కోరుతున్నవారి సంఖ్య క్రమంగా హెచ్చుతూండటం ప్రమాదకరమైన సంకేతమే.
దుర్గాకుమార్ ప్రసాయ్ అనే ఓ బడాపారిశ్రామికవేత్త ఆధ్వర్యంలో ఈ ‘పౌర ఉద్యమం’ జరుగుతోంది. గతంలో సీపీఎన్ (యుఎంఎల్) సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న ఈ పారిశ్రామికవేత్త దేశంలో సమూల మార్పుకోసం ఈ ఉద్యమాన్ని ఆరంభించినట్టు చెబుతున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రధానంగా యువతని బాగా ప్రభావితం చేయగలుగుతున్నాడు. గతంలో ఇటువంటి రాజరిక అనుకూల ర్యాలీలను తేలికగా తీసుకున్న అధికార, విపక్షాలు ఇప్పుడు పోటీ ప్రదర్శనలకు సిద్ధపడటాన్ని బట్టి అవి బాగా ఆందోళన చెందుతున్నట్టు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ బడాపారిశ్రామివేత్త తనకున్న రాజకీయపరపతితో భారీగా రుణాలు తీసుకున్నాడని, వాటిని ఎగవేయడానికే ఈ ఉద్యమం ఆరంభించాడని గిట్టనివారి వాదన.
ప్రస్తుత రాజకీయవ్యవస్థని ఇప్పటికిప్పుడు ప్రభావితం చేయలేకపోయినా, దాని వైఫల్యాలను విస్తృతంగా చర్చలోకి తెచ్చి ప్రజల్లో వ్యతిరేకతను పెంచడానికి ఇటువంటివి కచ్చితంగా తోడ్పడతాయి. నేపాల్‌లో దశాబ్దాలుగా సాగిన మావోయిస్టు ఉద్యమం రాజరికాన్ని కూల్చి ప్రజాస్వామ్యానికి పునాదులు వేసింది తప్ప ప్రజలకు సంతృప్తిని కలిగించలేకపోయింది. ఈ దశాబ్దంన్నరకాలంలో అక్కడ పదకొండు ప్రభుత్వాలు మారాయి. ప్రచండ, కేపీ ఓలీ తమ వైరంతో పాలనను అప్రదిష్టపాల్జేశారు. అధికారం పంచుకుందామని హామీ ఇచ్చిన ఓలీ ఆ తరువాత ప్రచండను ప్రధాని కాకుండా చేయడానికి ముందుగానే పార్లమెంటును రద్దుచేసిన విన్యాసాలు కూడా చూశాం. ఒక దశలో రాజకీయ అవసరం కోసం వారి మధ్య ఏర్పడిన సయోధ్య అనతికాలంలోనే ఆవిరైపోతుంది. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలో ప్రచండ కుట్రచేసినందుకు ఓలీ దూరంకావడం, నేపాలీ కాంగ్రెస్, ఇతర చిన్నాచితకా గ్రూపుల మద్దతుతో ప్రచండ బయటపడటం చూశాం. పేదరికం, ప్రకృతి బీభత్సాలకు తోడు ఇటువంటి తీవ్ర రాజకీయ అనిశ్చితి ప్రజలను నిరాశానిస్పృహల్లోకి నెట్టడం సహజం. ఇటీవలి ఉప ఎన్నికల్లో కొత్తమొఖాలను ప్రజలు స్వాగతించడాన్ని బట్టి, నిత్యం కయ్యమాడుకుంటున్న పాత పార్టీలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నది స్పష్టం. దశాబ్దాల పోరాటంతో దేశాన్ని రాజరికం నుంచి విముక్తం చేసిన పక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజానుకూలంగా నడుచుకున్నప్పుడు ప్రజల్లో తప్పుడు ఆలోచనలు పుట్టవు.
Updated Date - 2023-11-25T02:42:12+05:30 IST