ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RK Kothapaluku : తెలంగాణాలో నువ్వా–నేనా!

ABN, First Publish Date - 2023-11-12T01:25:20+05:30

ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి 15 రోజుల కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వంద రోజుల తర్వాత ఎన్నికలు జరగనున్నందున తన నాయకత్వం గొప్ప...

‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి 15 రోజుల కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వంద రోజుల తర్వాత ఎన్నికలు జరగనున్నందున తన నాయకత్వం గొప్పదనం గురించి చెప్పుకొని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేయడం ఏ రాజకీయ పార్టీ నాయకుడు అయినా చేస్తారు. ఇంతవరకు జగన్మోహన్‌ రెడ్డిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామిని చేసే ప్రయత్నం చేయడంతోనే తంటా అంతా. ‘జగనే ఎందుకు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి మరీ ముఖ్యమంత్రి కోరడం విడ్డూరంగా ఉంది. రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగం దూరంగా ఉండాలి. రూల్‌ ఆఫ్‌ లా అమలు చేయడానికి మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ప్రభుత్వ సిబ్బందిని వినియోగించడం నేరం అవుతుంది. రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిపై గతంలో చర్యలు తీసుకొనేవారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజకీయ కార్యక్రమాలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఉండాల్సిన లక్ష్మణ రేఖ చెరిగిపోయింది. ‘జగనే ఎందుకు’ కార్యక్రమం వైసీపీ చేపట్టిన రాజకీయ ప్రోగ్రాం మాత్రమే. అలాంటప్పుడు ఆ కార్యక్రమంతో అధికారులకు ఏమి పని? ఈ ప్రశ్నకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. అందరూ సూటూ బూటూ వేసుకున్నారు. అధికారికంగా నిర్వహించే ఇలాంటి సమావేశాలకు డ్రెస్‌ కోడ్‌ పాటించడం ఆనవాయితీగా ఉంటోంది. ఒక రకంగా ఇది అధికార దర్పానికి నిదర్శనం కూడా. ఇప్పుడు జగన్‌ పాలనలో ఏం జరుగుతోందో చూద్దాం. ‘దేవుడు శాసిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు’ అన్న రజనీకాంత్‌ డైలాగ్‌ను గుర్తుచేస్తున్నట్టుగా కోట్లు వేసుకున్న అధికారులు జగన్మోహన్‌ రెడ్డి ఏది శాసిస్తే అది పాటించడానికి సిద్ధపడిపోతున్నారు. డూడూ బసవన్నలుగా అడ్డమైన ఆదేశాల అమలుకు తలలు ఊపుతున్నారు. అఖిల భారత సర్వీసుకు చెందిన బ్యూరోక్రాట్లు ఇంతగా దిగజారిపోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం.

నిబంధనలు, కట్టుబాట్లు అంటూ ఏవీ లేనట్టుగా బరితెగిస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఇప్పుడు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కట్టు బానిసలుగా మారిపోయారు. నిబంధనలను కనీసం గుర్తుచేయలేని వ్యక్తి ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగడంలో ఔచిత్యం ఏమిటి? అధికార దర్పానికి చిహ్నంగా ఉండాల్సిన అధికారులు ఒక రాజకీయ పార్టీకి బానిసలుగా వ్యవహరించడం ఏమిటి? గ్రామ సచివాలయాలు, మండల స్థాయి కార్యాలయాల వద్ద వైసీపీ జెండాలను ప్రభుత్వ సిబ్బందితో ఆవిష్కరింపజేయడం ఏమిటి? ఇలా చేయడం చట్ట సమ్మతమేనా? ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలలో జాతీయ పతాకాన్ని మాత్రమే ఎగురవేయాలి అన్న ఇంగితం అధికారులకు తెలియదా? ప్రభుత్వ సిబ్బందితో వైసీపీ జెండాలను ఎగురవేయించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, జిల్లా కలెక్టర్లను ఏమి చేయాలి? జగన్‌రెడ్డి పాలనలో కొంత మంది అధికారుల ప్రవర్తన గంగిరెద్దులను ఆడించే వారిని గుర్తుకు తెస్తున్నది. గంగిరెద్దులను ఆడించేవాళ్లు కూడా కోటు వేసుకుంటారండోయ్‌! సందర్భం కోసమే పోలిక తప్ప, గంగిరెద్దులవారు జీవనోపాధి కోసం చేసుకునే గౌరవప్రదమైన వృత్తి అది. ఇక్కడ ఒక తేడా కూడా ఉంది. ఇక్కడ అధికారులే గంగిరెద్దులుగా మారిపోగా, వారిని ఆడించే వారి పాత్రను జగన్మోహన్‌ రెడ్డి పోషిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో చోటుచేసుకుంటున్న ఈ మహా పతనం ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేస్తుందా? ప్రభుత్వ వ్యవస్థలను గంగిరెద్దులకంటే హీనంగా చెప్పినట్టు వినేలా చేసుకున్న జగన్మోహన్‌ రెడ్డిని మెచ్చుకోవాలా? ఈ మహా పతనాన్ని చూసి చింతించాలా? పోలీసు శాఖలో కొంత మంది ఐపీఎస్‌ అధికారుల ధోరణి మరీ రోతగా ఉంటోంది. ముఖ్యమంత్రికీ, ఆయన కుటుంబానికీ వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే అరెస్టు చేయడమే కాకుండా వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ హెచ్చరించడం ఏమిటి? పోస్టులు పెట్టే వారి ఆస్తులను జప్తు చేసే అధికారం సీఐడీకి ఉంటుందా? అలాంటప్పుడు అప్పులకు కూడా బాధ్యత తీసుకోండి. ఆస్తులు జప్తు చేస్తే అప్పులు ఎలా తీరుస్తారు? ఆంధ్రప్రదేశ్‌లో భారత రాజ్యాంగం అమలు జరుగుతున్నట్టు లేదు. ముఖ్యమంత్రి గొప్ప కోసం గంగిరెద్దులుగా మారుతున్న అధికారులు చట్టాలు, కట్టుబాట్లతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయగలమని నమ్ముతున్నట్టుగా ఉంది. సీఐడీ విభాగం ఉన్నది ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని రక్షించడానికి మాత్రమే కాదు కదా? ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. జగన్‌ విపక్షంలో ఉండగా ఆయనకు ఎదురు నిలిచిన నేతల్ని వేధించడం ద్వారా ఆయన జగన్‌ మెప్పు కోసం పాకులాడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకల వ్యవహారం మరో ముఖ్యాంశం. ఈ అవకతవకలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు హెచ్చరికలు వెళ్లాయని వార్తలొచ్చాయి. ప్రతిపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటే ఇప్పటికే సీఐడీ నమోదు చేసిన మద్యం కేసులో మీ పేరు కూడా ఉంటుందని ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దలతోపాటు, సీఎంవోలోని అధికారులూ ఈ మేరకు హెచ్చరికలు చేసినట్టు తెలుస్తుండడం మహా పతనానికి మరో ఉదాహరణ. బరి తెగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొనే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది కదా? ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరిస్తున్న విషయమై విచారణ జరిపి నిజమని తేలితే సదరు బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై చర్యలకు ఎన్నికల కమిషన్‌ తక్షణం ఉపక్రమించాలి. ఎన్నికల వేళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడానికి కేసుల మీద కేసులు పెడుతూ ఉండటం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులలో మిమ్మల్ని కూడా ఇరికిస్తామని ఐఏఎస్‌ అధికారులను బెదిరించడం దారుణం కాదా? ఒకవైపు అధికార యంత్రాంగాన్ని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించడం, మరోవైపు తమ దారిలోకి రాని అధికారులను కేసులలో ఇరికిస్తామని బెదిరించడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంతలా దిగజార్చిన తర్వాత ప్రజలకు ఇక రక్షణ ఏముంటుంది? రూల్‌ ఆఫ్‌ లా ఎలా అమలవుతుంది? ఈ పరిస్థితులలో న్యాయస్థానాలు కూడా నిస్సహాయంగా ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

సీఎస్‌ జవాబివ్వాలి?

రాష్ర్టాన్ని పాలిస్తున్న జగన్మోహన్‌ రెడ్డిపై తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించి సీబీఐ 11 కేసులను, ఈడీ 9 కేసులను నమోదు చేశాయి. ఇన్ని అవినీతి కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డికి అఖిల భారత స్థాయి అధికారులు సాగిలపడటం కంపరం పుట్టిస్తోంది. ఏమి ఆశించి అధికారులు ఇలా పతనమవుతున్నారో తెలియదు. ఏదైనా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయాలని అధికారులపై ఒత్తిడి వస్తే ఐఏఎస్‌ అధికారుల సంఘం అండగా నిలిచేది. చంద్రబాబు హయాంలో అడ్డమైన దానికీ కస్సు బుస్సుమంటూ, మేమున్నామంటూ స్పందించిన ఈ సంఘం.. గత నాలుగున్నరేళ్లుగా మన్ను తిన్న పాములా పడి ఉంటోంది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులంటే ఇప్పటివరకు భయం, గౌరవం ఉండేవి. ఇప్పుడు అఖిల భారత సర్వీసు అధికారులు కనీసం చీమూ నెత్తురూ లేకుండా చిల్లరగా వ్యవహరిస్తున్నారన్న ఏహ్య భావం కలుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా ఎందరో పనిచేశారు. వారిలో కొందరే ప్రాతఃస్మరణీయులుగా ఉన్నారు. మిగతావారు ఎవరో కూడా చాలా మందికి గుర్తులేదు. కోటు వేసుకొని అధికారిక సమావేశాలకు హాజరైనంత మాత్రాన దర్పం రాదు. నిబంధనలను కచ్చితంగా అమలు చేసిన అధికారులకే గౌరవం ఉంటుంది. రాష్ట్రంలో రేపు ప్రభుత్వం మారినా ఇదే అధికారులు ఉంటారు. ఇంతలా పతనమైన అధికారులతో పరిపాలన చేయడం ఎలా? అన్న సందేహం ఇటీవల ఒక ముఖ్యుడికి వచ్చింది. నిజమే, పూర్తిస్థాయిలో చెడిపోయిన అధికారులతో రాష్ర్టాన్ని ఎవరు మాత్రం బాగు చేయగలరు? కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డీవోపీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా అఖిల భారత సర్వీసు అధికారులు పనిచేయాలి. దీన్నిబట్టి రాష్ట్రంలో కట్టు తప్పిన అధికారులను దారిలో పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంటుంది కదా? అలా జరగని పక్షంలో ఈ పతనం ఇతర రాష్ర్టాలకు కూడా విస్తరిస్తుంది.

‘జగనే ఎందుకు’ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడానికి ఎలా అనుమతిస్తున్నారు? అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డిని కేంద్రం సంజాయిషీ కోరాలని ఆశించడం అత్యాశ కాబోదు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుందాం. అప్పట్లో విజయవాడలో అల్లర్లు జరుగుతున్నాయి. ఆ దశలో విజయవాడ వెళ్లడానికి ముఖ్యమంత్రి పీవీ ఉద్యుక్తులయ్యారు. వెంటనే ఆయన కిందకు వచ్చి కారెక్కారు. ఇంతలో నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కామేశ్వర రావు అక్కడకు వచ్చి ‘‘విజయవాడలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మీరు వెళ్లడానికి వీలు లేదు’’ అని పీవీని కోరారు. అయినా పీవీ ఆ మాట పట్టించుకోకుండా విజయవాడ వెళ్లడానికి సిద్ధపడ్డారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కామేశ్వర రావు కల్పించుకొని ముఖ్యమంత్రి కారు డ్రైవర్‌ను కారు దిగాల్సిందిగా ఆదేశించారు. దీనిపై పీవీ ఆగ్రహం వ్యక్తంచేయగా, ‘నేను మీ కింద పనిచేస్తున్నాను. కారు డ్రైవర్‌ మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కింద పనిచేస్తున్నాడు. అతను నా ఆదేశాలను పాటిస్తాడు’ అని వినయంగానే స్పష్టంచేశారు. దీంతో చేసిది ఏమీ లేక పీవీ తన చాంబర్‌కు వెళ్లిపోయి, కొంతసేపటి తర్వాత కామేశ్వర రావును పిలిపించుకొని ‘మీలాంటి అధికారి ఉండాలయ్యా’ అని అభినందించారు. అలాంటి అధికారిని ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ మనం చూడగలమా?


రాష్ట్రం గెలవాలి!

ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’ అనే కార్యక్రమం విషయానికి వద్దాం. ఈ ప్రశ్న వేయాల్సింది జగన్‌ కాదు.. ప్రజలు. ఇంత అనర్థం జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ అవసరం ఉందా? ప్రజలు ఇంకా అలా ఉందని భావిస్తే మనం చేయగలిగింది ఏమీ లేదనుకోండి. రాష్ట్ర పరువు ప్రతిష్ఠలు ఇప్పటికే మంటగలిసి పోయాయి. రాష్ట్ర విభజన సమయంలో తాము విడిపోతే తెలంగాణ నష్టపోతుందని ఆంధ్ర నాయకులు ప్రగల్భాలు పలికారు. రాష్ట్రం విడిపోయి తొమ్మిదిన్నరేళ్లు అయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ అధోగతి పాలైంది. ఆంధ్రప్రదేశ్‌ను ఇంటా బయటా అవహేళన చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి సొంత చెల్లి కూడా రాష్ట్రంలో పరిస్థితులను వెక్కిరిస్తున్నారు. ఇంతకంటే ఒక ముఖ్యమంత్రికి అవమానం ఏముంటుంది? అయినా తన అవసరం ఉందని ప్రజలు భావించాలని జగన్‌ కోరుకోవడమే వింత అనుకుంటే.. దానికి అధికార యంత్రాంగం వంత పాడటం ఎబ్బెట్టుగా ఉంది. సంక్షేమం పేరిట దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను పేదలకు పంచానని జగన్‌ చెప్పుకొంటున్నారు. ఇందులో నిజం ఉండవచ్చు.

అదే సమయంలో జగన్‌ చేసిన అప్పు దాదాపు ఏడు లక్షల కోట్లు. ఇందులో ప్రజలకు పంచిన రెండు లక్షల కోట్లు మినహాయిస్తే మిగిలిన ఐదు లక్షల కోట్లు ఏమి చేసినట్టు? రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మితం కాలేదు. అదివరకే ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయలేకపోతున్నారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించడం ద్వారా పేదల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు కొల్లగొట్టిన విషయం వాస్తవం కాదా? చెప్పుకోదగిన పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు. నిర్మాణ రంగం కుదేలై భవన నిర్మాణ కార్మికులు రోడ్డుపాలయ్యారు. రైతుల దుస్థితి చెప్పే పనిలేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఊసే లేదు. ఒకే ఒక విషయంలో మాత్రం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. అదేనండీ.. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించడంలో. తన తండ్రి రాజశేఖర రెడ్డి కంటే మంచి పాలన అందిస్తానని జగన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో నమ్మబలికారు కదా? రాజశేఖర రెడ్డిని అభిమానించే వారిలో ఒక్కరైనా ఇప్పుడు జగన్‌ పాలన ఆయన తండ్రి పాలనకంటే భేషుగ్గా ఉందని చెప్పగలరా? ఈ విషయంలో జగన్‌ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ఇంటా బయటా అవమాన భారంతో తల దించుకొని బతుకుతోంది. ఈ పరిస్థితులలో జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలా? చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా? లేక పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలా? అన్నది ప్రధానం కాదు. రాష్ట్రం గెలవాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ తలెత్తుకొని బతికింది. మళ్లీ రాష్ర్టానికి పూర్వవైభవం రావాలంటే వ్యక్తులు కాదు.. రాష్ట్రం గెలవాలి. అధికారం ఎవరికి అప్పగిస్తే తాము తలెత్తుకొని సగర్వంగా బతకగలమో ప్రజలు ఆలోచించుకోవాలి. జగన్‌, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లలో ఎవరు గెలవాలన్నది కాదు.. రాష్ట్రం మాత్రమే గెలవాలన్నది రానున్న ఎన్నికల్లో నినాదం కావాలి. జగన్‌ పాలనలో వ్యవస్థలు ఎంత వేగంగా పతనమయ్యాయో చూశాం. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే పరిస్థితి ఎంతగా వికటిస్తుందో ప్రజలు ఆలోచించుకోవాలి.


ఏపీ పొత్తులకు దిక్సూచి!

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల గురించి చర్చించుకుందాం. నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 30న పోలింగ్‌ జరగనుండగా, డిసెంబరు 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. హ్యాట్రిక్‌ సాధించడం కోసం అధికార బీఆర్‌ఎస్‌ చతురంగ బలాలను రంగంలోకి దించి పోరాడుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జోరందుకున్న కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా గాలి వీస్తోందన్న ప్రచారం తోడవడంతో గెలుపుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంటోంది. పదేళ్లు అధికారంలో ఉన్నందున భారత రాష్ట్ర సమితిపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం. దీనికితోడు దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ కేసీఆర్‌ మళ్లీ టికెట్లు ఇవ్వడం ఆ పార్టీకి ఎక్కువ నష్టంచేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న పాతిక, ముప్పై మంది ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి టికెట్‌ ఇచ్చి ఉంటే విజయం కోసం బీఆర్‌ఎస్‌ ఇంతగా చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయం ఉంది. దీనికితోడు జగన్‌ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపడం కూడా తెలంగాణ రాజకీయాలపై కొంత మేరకు ప్రభావం చూపుతోంది. బీఆర్‌ఎస్‌ను విజయ తీరాలకు చేర్చడం కోసం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు రాష్ట్రమంతటా సుడిగాలిలా తిరుగుతున్నారు. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంపై ఆశలు పెంచుకుంది. కాంగ్రెస్‌ నాయకులు ఎవరికి వారు గెలుపు కోసం శ్రమిస్తుండగా, రేవంత్‌ రెడ్డి మాత్రం పార్టీ అభ్యర్థుల కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి కేంద్రీకరించబోతున్నారు. ప్రస్తుతానికి బీఆర్‌ఎస్‌– కాంగ్రెస్‌ పార్టీల పరిస్థితి నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. మరో రెండు వారాలు గడిస్తే ఎవరిది పైచేయి అవుతుందో స్పష్టమవుతుంది. ఈ దశలో భారతీయ జనతా పార్టీ పెద్దలు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొనే వ్యూహాలకు పదును పెట్టారు. బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం బీజేపీ పుంజుకున్నట్టు అందరూ భావించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు బీజేపీలో చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యర్థి బీజేపీనే అనే భావన ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాల వల్ల బీజేపీ ప్రభ మసకబారడం మొదలైంది. పార్టీలో చేరిన కొందరు ముఖ్యులు తిరిగి సొంత గూటికి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో పోరు బీఆర్‌ఎస్‌– కాంగ్రెస్‌ మధ్యనే కేంద్రీకృతమైందన్న అభిప్రాయం బలపడింది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. బీజేపీని గెలిపిస్తే బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా బీసీలను పార్టీ వైపు ఆకర్షించవచ్చునన్నది ప్రధానమంత్రి వ్యూహంగా కనిపిస్తున్నది. బీజేపీకి మెజారిటీ లభిస్తే తనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధాని మోదీ ఒక సందర్భంలో అన్నారని ఈటల రాజేందర్‌ కూడా చెప్పారు. ఇప్పుడు బీసీ కార్డుతో పాటు ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ కమిటీ వేస్తానని ప్రధాని సభాముఖంగా ప్రకటన కూడా చేశారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి పేరిట మందకృష్ణ మాదిగ దాదాపు రెండు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. తెలంగాణలో మాదిగలు అధిక సంఖ్యలో ఉంటారు. వర్గీకరణకు శ్రీకారం చుడితే ఎస్సీలలో అత్యధికులు బీజేపీ వైపు చూస్తారన్నది ప్రధాని మోదీ ఎత్తుగడ కావొచ్చు. అందుకే మందకృష్ణతో కలసి ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. బీసీలు, దళితులు, ముఖ్యంగా మాదిగలు అండగా నిలబడితే తెలంగాణలో అధికారంలోకి రావొచ్చునని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణ ఎన్నికల్లో జట్టు కట్టారు. పవన్‌ కల్యాణ్‌తో చేతులు కలపడంలో బహుముఖ వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు. తెలంగాణలో సెటిలర్లు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ఈ దశలో పవన్‌ కల్యాణ్‌ వల్ల సెటిలర్లలో ఒక వర్గం తమకు మద్దతు ఇస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ఇంతకంటే ముఖ్యమైనది మరొకటి ఉందని అంటున్నారు.

మరో నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహానికి తెలంగాణలో పవన్‌ కల్యాణ్‌తో పొత్తు తొలి మెట్టు అని చెబుతున్నారు. తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కల్యాణ్‌ తమను వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీతో మాత్రమే వెళ్లిపోకుండా కట్టడి చేయడమే ఈ వ్యూహం అని అంటున్నారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి సుముఖంగా కానీ, విముఖంగా కానీ లేదు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేసి సజావుగా ఎన్నికలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అన్న భావన మాత్రం తెలుగుదేశం నాయకుల్లో ఉంది. కేంద్ర సహకారం లేకపోతే ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ పోలింగ్‌ సందర్భంగా అది ప్రతిబింబించకుండా జగన్‌ కుయుక్తులకు పాల్పడే ప్రమాదం ఉందని, ఈ కారణంగా బీజేపీ సహకారం అవసరం అని పవన్‌ కల్యాణ్‌ కూడా తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఈ కారణంగానే తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపినట్టు ఆయన వివరించారట. దీన్నిబట్టి తెలంగాణలో కలిసిన చేతులు ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల మధ్య పొత్తుకు దారి తీయవచ్చునని చెబుతున్నారు. డిసెంబరు 3వ తేదీన ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ర్టాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ ఒక అడుగు వెనక్కు తగ్గి తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం చాచవచ్చు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులకు దిక్సూచిగా మారవచ్చు కూడా. చూద్దాం ఏమి జరుగుతుందో!

ఆర్కే

Updated Date - 2023-11-12T09:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising