సుఖాంతం...
ABN, First Publish Date - 2023-11-29T02:12:31+05:30
ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు భద్రంగా బయటకు వచ్చారు. పదిహేడురోజులపాటు వారిని రక్షించేందుకు
ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు భద్రంగా బయటకు వచ్చారు. పదిహేడురోజులపాటు వారిని రక్షించేందుకు జరిగిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దేశచరిత్రలోనే కాదు, ప్రపంచస్థాయిలో నిలిచిపోయే అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ ఇది. ఏ రోజుకారోజు కార్మికులు బయటకు వచ్చేస్తారని అనుకోవడం, అనుకోని అవాంతరాలతో అది వాయిదాపడుతూండటం కాస్తంత నిరాశకలిగించినా, సిబ్బందికానీ, కార్మికులు కానీ, ఈ కార్యక్రమాన్ని ఉత్కంఠభరితంగా గమనిస్తున్న దేశప్రజలు కానీ ఎన్నడూ నమ్మకాన్ని కోల్పోలేదు. బాధ్యతనీ ఆశయాన్నీ నీరుగారనివ్వకుండా కార్మికులను కాపాడిన భద్రతా సిబ్బందినీ, ప్రాణాలు ఉగ్గబట్టుకున్న స్థితిలో కూడా ఆశనూ, మానసిక స్థైర్యాన్నీ కోల్పోని కార్మికులను అభినందించాల్సిందే.
సొరంగంలో యాభైఏడుమీటర్ల మేరకు కుప్పకూలిపోయిన శిథిలాలకు ఆవల, ఈవల ఉన్నవారి పోరాటం ఇది. లోపలున్నవారు ప్రాణాలతో ఉండవచ్చుకానీ, ఈ సుదీర్ఘనిరీక్షణ, వేదన వారి మానసికస్థితిపై చూపే ప్రభావం కాదనలేనిది. అందుకే, ఆపద దృష్ట్యానే కాక, వారికి తక్షణపరీక్షలు జరిపేందుకు, చక్కని చికిత్స నిమిత్తం తరలించేందుకు నలభై అంబులెన్సులు సిద్ధం చేశారు. భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ఒక ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్‌లాగా సమీపంలోనే అందుబాటులో ఉంచారు. కాస్తంత షాక్‌లో ఉన్నప్పటికీ, బయటి ప్రపంచాన్ని చూడగానే, తమకు నోరుతీపిచేస్తూ స్వాగతం పలుకుతున్న అధికారులను చూడగానే కార్మికులకు ఎక్కడలేని శక్తీ వచ్చినట్టుంది. వారు మాట్లాడింది నాలుగుముక్కలే అయినా, చెదరని ఆత్మవిశ్వాసం కనిపిస్తూనే ఉంది.
నాలుగువందల గంటల ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్ని మలుపులో, ఎన్ని అవాంతరాలో. ఆదిలోనే ఆక్సిజన్‌ను, పరిమితస్థాయిలోనైనా ఆహారాన్ని లోపలకు అందించి, ఆ తరువాత మరిన్ని ఏర్పాట్లతో పాటు మాట్లాడటమూ మొదలైంది కనుక, చిక్కుబడినవారిలోనూ, వారి కుటుంబీకుల్లోనూ నమ్మకం బలపడింది. కానీ, వారిని భద్రంగా బయటకు తీసుకురావడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్తగా దాదాపు ఆరురకాల ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతూండటం ఎంతటివారినైనా నిరుత్సాహపరచక తప్పదు. తొలినాళ్ళలో నాలుగైదురోజులే అనుకున్నది కాస్తా క్రమంగా చెదిరిపోవడం ఆరంభించింది. ఉన్న కష్టానికి తోడు కొండచరియలు విరిగిపడి పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. పనిచక్కబెడతాయనుకున్న దేశీయ డ్రిల్లింగ్ మిషన్లు వరుసపెట్టి మధ్యలోనే మొరాయించాయి. దీనితో, భారత వైమానికదళానికి చెందిన మూడు యుద్ధవిమానాలు మోసుకొచ్చిన పాతిక టన్నుల అమెరికా డాగర్ మిషన్‌తో అద్భుతాలు చేయగలమని అధికారులు ఒకదశలో నమ్మారు. అది కాస్తా 20 మీటర్లు తవ్వగానే, శిథిలాల్లోని ఇనుపపట్టీలకు చిక్కుబడి దాని బ్లేడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సొరంగంలో ఇరుక్కుపోయి, మార్గాన్ని మూసేసిన ఆగర్ మిషన్ బ్లేడ్‌లను కట్ చేసి, దానిని బయటకులాగడానికి హైదరాబాద్ నుంచి ప్లాస్మాకట్టర్లు విమానంలో తరలాయి. కొండపైనుంచి తవ్వే యత్నాలు, దేశీయంత్రాలతో చేసిన మరికొన్ని ప్రయత్నాలు జరిగినా, చివరి అంకంలో విజయాన్ని చేకూర్చింది నిషేధిత ‘ర్యాట్ హోల్ మైనింగ్’ విధానమే.
ఏడేళ్ళక్రితం అన్నికాలాలను తట్టుకొనే నిలిచే భారీ రహదారుల చార్‌ధామ్ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రకటించినప్పుడు పర్యావరణ విధ్వసంతో పాటు, అత్యంత సున్నితమైన, భౌగోళికంగా ప్రమాదకరమైన ఈ ప్రాంతంలో దాదాపు వెయ్యికిలోమీటర్ల రహదారి విస్తరణ, అందులో భాగంగా బైపాస్‌లు, కల్వర్టులు, సొరంగాలు, బ్రిడ్జీల నిమిత్తం భారీ తవ్వకాలు చేపట్టడం అత్యంత ప్రమాదకరమన్న వాదనలు బలంగా వినిపించాయి. అశాస్త్రీయంగా, బాధ్యతారహితంగా సాగుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపడుతున్న భారీ తవ్వకాలతో పర్వతపునాదులు బలహీనపడి కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడా అమితంగా హెచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ సొరంగ నిర్మాణంలోనూ ఒకటిన్నర కిలోమీటర్లకు ఒక ఎమర్జన్సీ ఎగ్జిట్ ఉండాలన్న కనీస నిబంధన కూడా ఇక్కడ అమలు జరగలేదని ఈ ఘటన చెబుతున్నది. దీపావళినాడు దేశమంతా ఆనందోత్సాహాలతో ఉండగా, ఈ ప్రమాదం సంభవించి పండుగ జరుపుకోలేని ఎనిమిది రాష్ట్రాలకు చెందిన నలభైమంది కార్మికులు, వారి కుటుంబీకులు, సహాయకచర్యల్లో నిమగ్నమైన సిబ్బంది ఇప్పుడు ఆనందోత్సాహాలతో ఘనంగా వేడుకలు చేసుకోవచ్చు.
Updated Date - 2023-11-29T02:13:12+05:30 IST