ఉచితం–సముచితం
ABN, First Publish Date - 2023-11-10T01:22:21+05:30
ఎనభైకోట్లమంది పేదలకు మరో ఐదేళ్ళపాటు అన్నంపెడతామని ప్రధాని అంటే, కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత కోపమో అర్థంకాదు. కాంగ్రెస్ హయాంలో లక్షలకోట్ల కుంభకోణాలు జరిగాయనీ...
ఎనభైకోట్లమంది పేదలకు మరో ఐదేళ్ళపాటు అన్నంపెడతామని ప్రధాని అంటే, కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత కోపమో అర్థంకాదు. కాంగ్రెస్ హయాంలో లక్షలకోట్ల కుంభకోణాలు జరిగాయనీ, తాను అధికారంలోకి వచ్చిన తరువాత స్కాములు జరగకుండా చూసి, అలా ఆదాచేసిన సొమ్ముతోనే దేశంలోని 80కోట్లమంది పేదలకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ ద్వారా ఉచిత రేషన్ ఇస్తున్నానని ప్రధాని అన్నందుకు కాంగ్రెస్ విమర్శించివుంటే అర్థం ఉండేది. అయ్యా, ఇప్పుడు మీరు ఇస్తున్న హామీకి యూపీఏ హయాంలో మేము తెచ్చిన ఆహారభద్రతా చట్టమే పునాది అని కాంగ్రెస్ గుర్తుచేసినా బాగుండేది. కానీ, ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఈ పథకాన్ని మరో ఐదేళ్ళపాటు పొడిగించబోతున్నామని నరేంద్రమోదీ ప్రకటించినందుకు మాత్రమే కాంగ్రెస్‌కు కోపం వచ్చింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలసభలో ఈ పథకం కొనసాగింపు గురించి ప్రధాని హామీ ఇచ్చినందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఎప్పట్లానే ఏ ఫలితమూ లేని విమర్శలు చేస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న ఈ పథకాన్ని, డిసెంబరు మాసాంతం వరకూ సమయం ఉన్నప్పటికీ, మరో ఐదేళ్ళు పొడిగించదల్చుకున్నామని మోదీ మాత్రం ఇప్పుడే ఎందుకు ప్రకటించాలి? గతంలో కూడా ఈ పథకం కొనసాగింపు నిర్ణయం ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల సందర్భంలోనే జరిగింది కనుక, ఎన్నికలకూ అన్నయోజనకు మధ్య ఏదో ఆత్మీయ బంధం ఉన్నట్టుంది.
మీలో ఒక్కడిని, మీ కుమారుడిని, నేనూ పేదకుటుంబం నుంచే వచ్చాను వంటి వ్యాఖ్యలను, కాంగ్రెస్ మీద విమర్శలను అటుంచితే, అన్నయోజనను మరో ఐదేళ్ళు పొడిగించాలన్నది మంచి నిర్ణయమే. 80కోట్లమంది పేదలకు ఉచితంగా బియ్యమో, గోధుమలో, చిరుధాన్యాలో ఇవ్వడం వారి ఆహారభద్రతకు ఉపకరిస్తుంది. దీనికి ముందు యూపీఏ హయాంలో వచ్చిన జాతీయ ఆహారభద్రతాచట్టం కింద భారీ సబ్సిడీతో నామమాత్రపు ధరలకు పేదలకు ఆహారధాన్యాలు రేషన్ దుకాణాల ద్వారా అందేవి. ఆ తరువాత, కరోనా కష్టకాలంలో గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో రేషన్ పూర్తి ఉచితంగా ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. పేరు మార్పుతో పాటు లబ్ధిదారుల సంఖ్య కూడా రెట్టింపై ఆ సంక్షోభ సమయంలో పేదలను ఎంతగానో ఆదుకుంది. గత ఏడాది కొన్ని రాష్ట్రాల ఎన్నికలున్న సందర్భంలో, ఈ పథకాన్ని జాతీయ అహారభద్రతాచట్టంతో కలిపివేస్తూ కేంద్రప్రభుత్వం దానిని మరో ఏడాది పొడిగించింది. డిసెంబరు మాసాంతానికి గడువుముగుస్తున్న తరుణంలో, ఇంకా మంత్రివర్గ నిర్ణయం జరగాల్సి ఉన్నప్పటికీ, దానిని ఏకంగా మరో ఐదేళ్ళు పెంచబోతున్నట్టు ప్రధాని చేసిన ఈ ప్రకటన పేదల ఆహారభద్రత విషయంలో మన కట్టుబాటును తెలియచెబుతోంది.
పథకాన్ని పొడిగించాలన్న ఆలోచనో, అవసరమో ఉన్నప్పుడు, ఒక ఎన్నికల సభలో హామీగా దానిని ప్రకటించకుండా ఉంటే హుందాగా ఉండేది. కోట్లాదిమంది పేదల అన్నంతో ముడిపడి, దేశం మొత్తానికి వర్తించే మహత్తరమైన విధానం కనుక, రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక, నిర్ణయం అధికారంగా జరిగిన తరువాత, రాజకీయంగా తమకు నచ్చినదేదో జోడించి చెప్పుకుంటే సరిపోయేది.
ఆహారధాన్యాలను ఉచితంగా ఆందించే ఈ పథకం ఆర్థికంగా పెనుభారం కాబోతున్నదనీ, పైగా మహమ్మారుల కాలం దాటిన తరువాత దీనిని అదేరీతిలో కొనసాగించాల్సిన అవసరం లేదని గత ఏడాది జూన్‌లోనే ఆర్థికమంత్రిత్వశాఖ ఒక హెచ్చరిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ పథకం ఆర్థిక భారం కాబోదని, చిన్నచిన్న సర్దుబాట్లతో దీనిని కొనసాగించవచ్చునని ప్రభుత్వం ఇప్పుడు వివరణలు కూడా ఇస్తున్నది. ఇక, దేశంలో కోట్లాదిమంది నిరుపేదలున్నారని, ఆకలి, ఆహారలేమి ఉన్నాయని ప్రభుత్వం ఆమోదించిందని చెప్పడానికి ఈ పథకం కొనసాగింపే నిదర్శనమని కొందరివాదన. ఇటీవలి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో 125దేశాల్లో మన స్థానం 111లో ఉన్నందుకు ప్రభుత్వం ఆ లెక్కల విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అదేకాదు, చాలా స్వదేశీ విదేశీ సంస్థల నివేదికలు దేశంలో పోషకాహారలేమి ఏ స్థాయిలో ఉన్నదో తెలియచెప్పాయి. ముఖ్యంగా, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ఇది హెచ్చుగా ఉన్నందువల్లనే ప్రధాని ఈ ప్రకటన చేసివుండవచ్చు కూడా. ఉపరితలంలో ఆకలిసూచీల లెక్కలను తిప్పికొట్టినప్పటికీ, వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగానే పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారని, దేశం ఎదుర్కొంటున్న పోషకాహార సంక్షోభం వారికి తెలుసునని కొందరు అంటున్నారు. నిజం ఏమైనప్పటికీ, ఆకలిని రూపుమాపడం మన విధి.
Updated Date - 2023-11-10T01:22:22+05:30 IST