ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ ‘కాప్‌’ కాస్తుందా?

ABN, First Publish Date - 2023-11-30T01:10:25+05:30

వాతావరణ మార్పుపై మనిషి జవాబుదారీతనానికి ఉద్దేశించిన సభ్యదేశాల మహాసదస్సు (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌–కాప్‌) నేడు దుబాయ్‌లో ఆరంభమవుతోంది...

వాతావరణ మార్పుపై మనిషి జవాబుదారీతనానికి ఉద్దేశించిన సభ్యదేశాల మహాసదస్సు (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌–కాప్‌) నేడు దుబాయ్‌లో ఆరంభమవుతోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు ముందు ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆశలు. ప్రతీ సదస్సుకు ముందు చావోరేవో తేలిపోతుందనట్టుగా మాటలుంటాయి. అగ్రరాజ్యాలు హామీల వర్షం కురిపిస్తాయి. అతిథ్యమిచ్చిన దేశం సదస్సు విజయాన్ని ఘనంగా కీర్తిస్తుంది. ప్రపంచనాయకులు, పారిశ్రామికవేత్తలు, పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు పాల్గొనే ఈ సదస్సుతో మరోపక్షంరోజులు పాటు అరబ్‌ ఎమిరేట్స్‌ కళకళలాడబోతున్న నేపథ్యంలో, ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా వేడెక్కిపోతున్న ధరిత్రిని ఈ సదస్సు ఎంతో కొంత చల్లార్చకపోదా అని ఆశగా ఎదురుచూడటం సహజం. గతకాలంనాటి సమావేశాలకు ఇది పూర్తిభిన్నమైనదని, కొత్తగా కొన్ని హామీలు వినబడినా, గతాన్ని సమీక్షించుకోవడం మీద ఇది మరింత శ్రద్ధపెట్టబోతున్నదని అంటున్నారు. అప్పట్లో చేసిన ప్రమాణాల మాటేమిటి, వాటిని ఏ మేరకు నిలబెట్టుకోగలిగామన్న చర్చ ఈ సదస్సులో జరిగినపక్షంలో వాతావరణ మార్పును నిరోధించడంలో అడుగుకాకున్నా, అంగుళమైనా మనిషి సమష్టిగా ముందుకు కదిలేందుకు అవకాశం ఉంటుంది.

సభ్య దేశాలు తమ హామీలు ఏ మేరకు నిలబెట్టుకున్నాయి, లేనిపక్షంలో ఏం చేయాలన్నది ఈ దుబాయ్‌ కాప్‌ సదస్సు అసలు లక్ష్యం కనుక, చమురు, సహజవాయు పరిశ్రమ ఇప్పటివరకూ సాగించిన అపారనష్టంతో పాటు, తమ పాపం వల్ల ప్రకృతివిపత్తులను చవిచూస్తున్న పేదదేశాలను ఆర్థికంగా ఆదుకుంటామన్న ధనికదేశాల ప్రమాణాలు ఎంతవరకూ ఆచరణలోకి వచ్చాయో కూడా తేలిపోతుంది. ఈ సదస్సుకు దుబాయ్‌ సరైనవేదిక. పదిరోజుల క్రితమే అరబ్‌ ఏమిరేట్స్‌ ఉరుములు, మెరుపులతో కూడిన అకాలవర్షంతో అల్లాడిపోయింది. ముంచెత్తిన వానతో రోడ్లన్నీ జలమయమై, భారీ వాహనాలు సైతం కొట్టుకుపోయి, జనజీవితం స్తంభించిపోయింది. వానచినుకుకోసం అల్లాడిపోయే ఈ దేశం ఇలా భారీ వర్షబీభత్సంతో అతలాకుతలమైపోవడం విచిత్రమో, విశేషమో కాదనీ, వాతావరణ మార్పు తమను కూడా వెంటాడుతున్నదని ఆ దేశపాలకులకూ తెలుసు.

అరబ్‌ ఎమిరేట్స్‌లాగానే, నిజానికి దానికంటే అధికంగా ధనికదేశాలన్నీ ఇప్పుడు వాతావరణ మార్పు ప్రభావాన్ని తీవ్రంగానే చవిచూస్తున్నాయి. కానీ, ఇప్పటి ఆర్థికం కంటే రేపటి మానవ మనుగడ వాటికి ముఖ్యంకాదు. చిన్నదేశాలు మునిగిపోతున్నా, పేదదేశాలు ప్రకృతి విలయాలతో నష్టపోతున్నా వాటికి పట్టదు. రెండేళ్ళ నాటి గ్లాస్గో సదస్సు సందర్భంలో బ్రిటన్‌ ఎన్నో హామీలు ఇచ్చింది. అదొక్కటే కాదు, పారిశ్రామికంగా ఎదిగిన జి–7దేశాలన్నీ ఇలాగే చెబుతాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాతావరణ మార్పు అన్న మాటంటేనే మండిపడేవాడు. అమెరికాను అనేక అంతర్జాతీయ ఒప్పందాలనుంచి బయటకు లాగేసిన ఘనుడాయన. మళ్ళీ ఆయనే అధ్యక్షుడైతే అమెరికా సహా అన్ని అగ్రరాజ్యాలపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. 2015నాటి చరిత్రాత్మకమైన పారిస్‌ ఒప్పందానికే తూట్లు పొడిచిన ఘనులు వీరు.

శీతోష్ణస్థితి, నెట్‌జీరో లక్ష్యాలకు సంబంధించి పారిస్ ఒప్పందంలో చెప్పుకున్న సంకల్పాలు, హామీలు అనంతరకాలంలో వీగిపోవడంతోపాటు, కరోనాకాలపు నష్టాలను భర్తీచేసుకొనే ప్రయత్నంలో ఉద్గారాలు మునుపటికంటే హెచ్చాయని చాలా నివేదికలు అంటున్నాయి. శీతోష్ణస్థితి పారిశ్రామికీకరణ ముందుస్థాయికంటే ఒకటిన్నర డిగ్రీలుదాటితే, పునరుద్ధరణకు వీలుగాని దశకు చేరుకుంటామని అవి హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు కనీసం 88సార్లు ఈ గీతదాటాయి. శీతోష్ణస్థితిలోనే కాదు, వరదబీభత్సాలు, వడగాడ్పులు, కరువుకటకాల్లోనూ ధరిత్రి రికార్డులు సృష్టిస్తోంది.

పారిశ్రామికంగా ఎదిగిన దేశాలు తమ వాటాకంటే అధికంగా హరితగృహ వాయువులను విడుదల చేస్తున్నాయి. శిలాజ ఇంధనాలమీద ఆధారపడి సాగుతున్న ఆ అభివృద్ధి వాతావరణ విధ్వంసానికి కారణమవుతూ, అభివృద్ధి చెందుతున్న దేశాలను దెబ్బతీస్తున్నది. పేదదేశాలకు ధనికదేశాలు చేస్తున్న ఈ నష్టాన్ని పూడ్చేందుకు గత ఏడాది ఈజిప్ట్‌లో జరిగిన కాప్‌ సదస్సులో నష్టపరిహార నిధి ఏర్పాటుకు అంగీకారం కుదిరినా అడుగుముందుకు పడలేదు. మూడు దశాబ్దాల కాప్‌ సదస్సులు పెద్దగా సాధించిందేమీ లేకపోయినా, వాతావరణం చుట్టూ సాగుతున్న రాజకీయాన్ని, ధనికదేశాల స్వార్థపూరిత కుట్రలను జనసామాన్యానికి సైతం అర్థమయ్యేట్టు చేశాయి. ఇప్పటి కాప్‌ సదస్సులో పారిస్‌ ఒప్పందం అమలు తీరుతెన్నులపై మళ్ళీ చర్చ జరుగుతున్నది కనుక, మానవాళి మనుగడ ప్రమాదంలోకి మరింత జారుకోకుండా ఏవో కొన్ని నిర్దిష్టమైన చర్యలకు పూనిక దక్కుతుందని ఆశించాలి.

Updated Date - 2023-11-30T01:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising