ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RK Kothapaluku: జగన్‌పై కేసీఆర్‌ గుర్రు!

ABN, First Publish Date - 2023-11-05T00:24:01+05:30

జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి పిచ్చి ముదురుతున్నట్టు ఉంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై వరుసగా పెడుతున్న కేసుల తీరు తెన్నులను పరిశీలిస్తే ఈ అనుమానం కలుగుతోంది. పాలకుడు తీసుకునే నిర్ణయాలు...

జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి పిచ్చి ముదురుతున్నట్టు ఉంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై వరుసగా పెడుతున్న కేసుల తీరు తెన్నులను పరిశీలిస్తే ఈ అనుమానం కలుగుతోంది. పాలకుడు తీసుకునే నిర్ణయాలు అసంబద్ధంగా ఉన్నప్పుడు సదరు పాలకుడిని తుగ్లక్‌తో పోల్చడం పరిపాటే. పాలకుడితోపాటు అధికార యంత్రాంగంలోని కీలక వ్యక్తులు కూడా అపసవ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ప్రభుత్వానికి పిచ్చి పట్టిందన్న అనుమానం కలగకుండా ఎలా ఉంటుంది? చంద్రబాబుపై ఇప్పటికే ఆరు కేసులను సీఐడీ నమోదు చేసింది. ఇప్పుడు మరో నాలుగు కేసులు పెట్టబోతున్నారు. తనపై సీబీఐ ఎన్ని కేసులను నమోదు చేసిందో అన్ని కేసులను చంద్రబాబుపై నమోదు చేయిస్తేగానీ జగన్మోహన్‌ రెడ్డి అహం సంతృప్తిపడేలా లేదు. స్కిల్‌ కేసులో చంద్రబాబును 53 రోజులపాటు జైలులో నిర్బం ధించినప్పటికీ సీఐడీ అధికారులు మనీ ట్రైల్‌కు సంబంధించిన ఆధారాలు ఒక్కటి కూడా సేకరించలేకపోయారు. తాజాగా నమోదు చేసిన మద్యం, ఇసుక కేసులను పరిశీలిస్తే ఇలా కూడా కేసులు పెడతారా? అనే సందేహం కలుగుతుంది. ప్రభుత్వంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ కేసులు పెట్టుకుంటూపోతే ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు చేస్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్లు ఇకపై అధికారం కోల్పోయాక కనీసం మూడేళ్లు జైలు జీవితం గడపాల్సి వస్తుంది. కేసులో దమ్మున్నా, లేకపోయినా ముందుగా రిమాండ్‌కు తరలించవచ్చు. ఈ లెక్కన ఒక కేసులో 15 రోజులు జైలుకెళ్లి బయటకు వచ్చాక, మరో కేసులో మరో 15 రోజులు జైలుకెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వం అన్నాక ఎన్నో నిర్ణయాలు జరుగుతుంటాయి. ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ కేసులు పెట్టుకుంటూపోతే మాజీ ముఖ్యమంత్రులు ఎంతకాలం జైలులో ఉండాల్సి వస్తుందో లెక్కించడం కష్టం.

వరుస కేసులతో నవ్వులపాలు...

మద్యం, ఇసుక వ్యవహారంలో దోపిడీ జరిగిందని జగన్‌ అండ్‌ కో చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుందని తెలంగాణకు చెందిన ఒక సీనియర్‌ మంత్రి సైతం వ్యాఖ్యానించారు. తెలుగునాట మద్యం, ఇసుక వ్యవహారంలో మొదటిసారిగా వ్యవస్థీకృత అవినీతిని ప్రవేశపెట్టిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు హయాంలో ఏదో జరిగి పోయిందంటూ కేసులు పెట్టించడం కక్ష సాధింపుకు పరాకాష్ఠ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుపై రోజుకో కేసు పెట్టడంతో జగన్‌ ప్రభుత్వమే నవ్వుల పాలవుతోంది. జగన్‌ అండ్‌ కోకు కూడా ఈ విషయం బోధపడినట్టు ఉంది. అందుకే కాబోలు సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు ‘ప్లీజ్‌ మమ్మల్ని నమ్మండి’ అని ప్రజల్ని కోరుకుంటున్నారు. ‘ఆధారాలు ఉన్నందునే చంద్రబాబుపై కేసులు పెడుతున్నాం. ప్రజలు నమ్మాలి’ అని దీనంగా అడుక్కున్నారంటేనే ప్రజల్లో తాము పలుచన అవుతున్నామన్న విషయం సజ్జలకు బోధపడినట్టుంది. ఇసుక, మద్యం వ్యవహారంలో జగన్మోహన్‌ రెడ్డికి నెలనెలా కమీషన్లు అందుతున్నాయన్నది బహిరంగ రహస్యం. అలాంటి వ్యక్తి తనకంటిన మకిలిని ఇప్పుడు చంద్రబాబుకు కూడా పులమాలనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు మద్యం, ఇసుకకు సంబంధించి చంద్రబాబుపై కేసులు పెట్టడం అనేక ప్రశ్నలను మన ముందు ఉంచుతోంది. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగి ఉంటే ఆ విషయం తెలుసుకోవడానికి సంబంధిత అధికారులకు ఇంతకాలం ఎందుకు పట్టింది? అన్నది మొదటి ప్రశ్న. అజ్ఞాత వ్యక్తుల ద్వారా అవినీతికి సంబంధించిన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటే అర్థం ఉంది. ఇక్కడ మద్యం వ్యవహారంలో ఫిర్యాదు చేసిన వాసుదేవరెడ్డి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా నాలుగున్నరేళ్లుగా ఉన్నారు. ఇసుకపై ఫిర్యాదు చేసిన వెంకటరెడ్డి చాలా కాలం నుంచి గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ అధికారులు ఇంత కాలం ఏం చేశారు? ఇప్పుడే ఎందుకు ఫిర్యాదు చేశారు? అంటే సమాధానం ఉండదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది నుంచి ఇసుకను ఎవరు తవ్వుకుంటున్నారో తెలియదు. టర్న్‌ కీ కాంట్రాక్ట్‌ కాలపరిమితి ఎప్పుడో ముగిసింది. అయినా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మారితే గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి పరిస్థితి ఏమిటి? ఉచిత ఇసుక విధానం అమలు చేసిన చంద్రబాబుపైనే కేసులు పెట్టగలిగినప్పుడు జగన్‌రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టవచ్చు? ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అమ్ముతున్న నాసిరకం మద్యం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. మద్యం వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్‌కు ప్రతి నెలా ముడుపులు అందుతున్నాయని ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అలాంటిది ఎనిమిదేళ్ల క్రితం ఏదో జరిగిందని వాసుదేవరెడ్డి ఇప్పుడు ఫిర్యాదు చేయడాన్నిబట్టి ప్రభుత్వ దుర్బుద్ధి అర్థంకావడం లేదా? పేదల ప్రాణాలకు ముప్పుగా మారిన మద్యాన్ని అమ్ముతున్న వాసుదేవరెడ్డిగానీ, జగన్మోహన్‌ రెడ్డిగానీ ప్రభుత్వం మారితే బోనులో నిలబడకుండా తప్పించుకోగలరా? ఇప్పుడు స్కిల్‌ కేసు విషయానికి వద్దాం! కంప్యూటర్లు, ఇతర పరికరాలకోసం చంద్రబాబు ప్రభుత్వం 379 కోట్లను డిజైన్‌టెక్‌ సంస్థకు విడుదల చేయగా, ఆ సొమ్ము తినేశారన్నది ప్రధాన ఆరోపణ. అదే నిజమైతే స్కిల్‌ సెంటర్లు మూతపడాలి కదా? కంప్యూటర్లు, ఇతర పరికరాల సరఫరా జరిగి ఉండకపోతే విద్యార్థులకు శిక్షణ ఎలా సాధ్యం? నైపుణ్యాభివృద్ధి సంస్థను కూడా మూసివేయవచ్చు కదా? జగన్‌ ప్రభుత్వం వచ్చాక కొత్త కంప్యూటర్లు, పరికరాలు కొన్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటితోనే ఇప్పటికీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. నైపుణ్యాభివృద్థి సంస్థ చైర్మన్‌గా అజయ్‌ రెడ్డి రెండేళ్లుగా ఉన్నారు. అంతకు ముందున్న కంప్యూటర్లు, ఇతర పరికరాలను వాడకుండానే స్కిల్‌ సెంటర్లు నడుస్తున్నాయా? అన్న ప్రశ్నకు అజయ్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ మౌలిక ప్రశ్నలకు కేసు పెట్టి ఇన్ని రోజులవుతున్నా సమాధానం చెప్పకుండా సీఐడీ అధికారులు తగదునమ్మా అంటూ కొత్త కేసులు పెడుతున్నారు. న్యాయస్థానాలు కూడా ఈ మౌలిక ప్రశ్నలపై దృష్టి సారించాలి. లేనిపక్షంలో తప్పు జరగకపోయినా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.


కేసులు సరే.. చార్జిషీట్లు ఏవీ?

జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఐడీ అధికారులు తెలుగుదేశం పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర ప్రభృతులు ఫలానా అవినీతికి పాల్పడ్డారంటూ కేసులు పెట్టి వారిని జైలుకు పంపారు. మూడేళ్లుగా ఈ తంతు జరుగుతోంది. కానీ, సీఐడీ అధికారులు ఇంతవరకు ఒక్క కేసులో కూడా చార్జిషీటు దాఖలు చేయలేదు. వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపించే విషయంలో చూపుతున్న ఆసక్తిని ఆ తర్వాత దర్యాప్తు విషయంలో మాత్రం చూపడంలేదు. తాము టార్గెట్‌గా చేసుకున్న వ్యక్తులు జైలుకు వెళ్లడమే వారి లక్ష్యం. కనుక ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు విచారణలో ఎందుకింత జాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టు శుక్రవారం నాడే సీబీఐకి నోటీసు కూడా జారీ చేయడం గమనార్హం. సకాలంలో చార్జిషీటు దాఖలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు కొత్త కేసులు వేయడం ఏమిటి అని ఇప్పటికైనా న్యాయస్థానాలు ప్రశ్నించాలని కోరుకోవడంలో తప్పులేదు కదా? ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఉద్దేశం ఏదైనా కావచ్చునుగానీ వ్యవస్థలైనా బాధ్యతగా వ్యవహరించాలి కదా? దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా సీఐడీ కేసులు పెట్టగానే నిందితులను యథాలాపంగా రిమాండ్‌కు పంపడం సమర్థనీయం కాదు. ఇటువంటి సందర్భాలలో న్యాయాధికారులు విచక్షణతో వ్యవహరించాలని హైకోర్టులు పలు సందర్భాలలో వ్యాఖ్యానించాయి. తాను పదహారు నెలల పాటు జైల్లో ఉన్నందున చంద్రబాబు కూడా అంతకాలం లేదా ఇంకా ఎక్కువ రోజులు జైల్లో ఉండాలని జగన్మోహన్‌ రెడ్డి కోరుకుంటూ ఉండవచ్చునుగానీ న్యాయ వ్యవస్థ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలి కదా! చంద్రబాబు నిజంగా తప్పు చేసి ఉంటే ఎంతకాలమైనా జైలుకే పరిమితం చేయవచ్చు. తప్పు జరిగిందనడానికి కనీసం ఆధారాలు లేకుండా శిక్ష అనుభవించాల్సి రావడం వల్ల ప్రజల్లో చంద్రబాబు పట్ల సానుభూతి ఏర్పడుతోంది. తాము పెడుతున్న కేసులను ప్రజలు నమ్మడం లేదన్న అనుమానం సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారికి వచ్చిందంటేనే పరిస్థితి అర్థం కావడంలేదా?

ముందుంది....

ప్రతిపక్షాన్ని ఎన్ని విధాలుగా వేధించవచ్చునో జగన్మోహన్‌ రెడ్డి ప్రపంచానికి చాటి చెబుతున్నారు. 2024లో అధికారం కోల్పోతే తనపై ఎన్ని కేసులు ఎలా పెట్టవచ్చునో కూడా జగన్‌ చెప్పకనే చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ భవనాలకు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసి హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని తొలగించిన విషయమే తీసుకుందాం! ఈ వ్యవహారంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది. ఇందుకు జగన్మోహన్‌ రెడ్డితో పాటు సంబంధిత అధికారులపై కేసులు కట్టవచ్చు కదా? అసలైన నిధుల దుర్వినియోగం అంటే ఇదే కదా? ముఖ్యమంత్రి సతీమణి భారతి రెడ్డి పర్యవేక్షణలో వెలువడుతున్న రోత పత్రికను నెలకు దాదాపు ఐదు కోట్లు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసి వలంటీర్లకు సరఫరా చేయడం అధికార దుర్వినియోగం కాదా? దేశంలో ప్రతికా రంగంలో ఇలా ఎక్కడైనా ఎవరైనా చేశారా? ఈ వ్యవహారంపై ప్రభుత్వం మారి భారతి రెడ్డిపై కేసు పెడితే ఎవరు మాత్రం తప్పు పట్టగలరు? పేదలకు ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన అవినీతిపై ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులపై ఎన్ని కేసులు పెట్టవచ్చో లెక్కలేదు. ఇక మద్యం, ఇసుక విషయం చెప్పే పనే లేదు. గనులు, పోర్టులను బలవంతంగా గుంజుకున్న విషయంలో జగన్‌ అండ్‌ కో పై ఎన్ని కేసులైనా పెట్టవచ్చును. రాజధాని అమరావతిలో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలను నిరుపయోగంగా మార్చినందుకు జగన్‌పై కేసు పెట్టవచ్చు కదా? ప్రభుత్వం మారితే తనపై ఎన్నో కేసులు పెట్టే అవకాశం ఉందని తెలిసి కూడా జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తుతానికి తన రాజకీయ ప్రత్యర్థులపైనే గురిపెట్టడం ఆయన నైజానికి అద్దంపడుతోంది. మోసపూరిత రాజకీయానికి అలవాటుపడిన జగన్‌ ఇప్పుడు చంద్రబాబుపై కేసులుపెట్టుకుంటూ పోవడంద్వారా ఆయన తన పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించకుండా చూడాలనుకుంటున్నారు. మద్యం ధరలు, ఇసుక రేట్లు, కరెంటు చార్జీలు వగైరా పెంచి దోచుకున్నారని తనను నిందించకుండా ఉండటానికి... చంద్రబాబు రేట్లు పెంచకుండా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారని ఎదురు కేసులు పెట్టాలనుకొనే స్ర్టాటజీ ఉంది చూశారా? ఇలాంటి ఆలోచనే న భూతో న భవిష్యతి! ‘నెవర్‌ బిఫోర్‌... ఎవర్‌ ఆఫ్టర్‌’! తన పరిపాలనా సామర్థ్యాన్ని ఎవరూ ప్రశ్నించకుండా క్రిమినాలజీలో ఆరితేరిన జగన్మోహన్‌ రెడ్డి ఈ మార్గాన్ని ఎంచుకొని ఉండవచ్చునుగానీ ప్రజలు అమాయకులు కారు. అందుకే చంద్రబాబుపై పెడుతున్న కేసులను ఎవరూ నమ్మడం లేదు. ఒకటీ అరా సందర్భాలలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఉంటే ప్రజలు అంతో ఇంతో నమ్మి ఉండేవారు. స్కిల్‌ కేసులో కూడా చంద్రబాబును అన్ని రోజుల పాటు జైల్లో నిర్బంధించకపోయి ఉంటే ఆయనపై ఇంత సానుభూతి ఏర్పడేది కాదు. అరెస్టయిన నాలుగైదు రోజులకే విడుదలై ఉంటే చంద్రబాబు తప్పు చేశారేమోనని కొంతమందైనా నమ్మి ఉండేవారు. అయితే జగన్‌ అండ్‌ కో అత్యుత్సాహం వల్ల ప్రతిదీ బూమరాంగ్‌ అవుతోంది. చంద్రబాబుపై తాజాగా నమోదు చేసిన ఇసుక కేసులో పదివేల కోట్లు దోపిడీ జరిగిపోయిందని జగన్‌ రోత పత్రిక అచ్చేసింది. రెండు నెలల్లోనే అంత దోపిడీ జరిగే అవకాశం ఉంటే ఏడాది నుంచి టెండర్‌ కూడా లేకుండా ఇసుక తవ్వకాలకు అనుమతిస్తున్న జగన్‌రెడ్డి ఇంకెంత దోపిడీకి పాల్పడి ఉంటారో అన్న అనుమానం రాకుండా ఉంటుందా? దోపిడీకి అలవాటు పడిన వారికి అన్నింటిలో దోపిడీనే జరిగి ఉంటుందని అనుమానం రావడం సహజం.

జన చేతనకు జేజేలు...

వైద్యం కోసం చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వడంపై కూడా జగన్‌ అండ్‌ కో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. జగన్‌కు మాత్రం దేశాన్ని ఉద్ధరించమని బెయిల్‌ ఇవ్వలేదు కదా! రాజమండ్రి నుంచి విజయవాడలోని తన నివాస గృహానికి చేరుకోవడానికి చంద్రబాబుకు పన్నెండు గంటలకుపైగా సమయం పట్టడానికి ఆయన ఏమైనా యుద్ధంలో గెలిచి వస్తున్న యోధుడా అని సజ్జల వ్యాఖ్యానించారు. ఇప్పుడు పదేళ్లు వెనక్కి వెళదాం. అప్పుడు చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన జగన్‌రెడ్డిని సమరయోధుడని ఊరేగించారా? దీనికి సజ్జల సమాధానం చెప్పాలి. సజ్జల వంటి వారు ఇలాంటి చిల్లర విషయాలపై మాట్లాడకుండా తెలంగాణ పాలకులు తమను వెక్కిరిస్తున్న విషయంపై దృష్టి పెట్టడం మంచిది. సింగిల్‌ రోడ్‌ ఉందంటే అది ఆంధ్రప్రదేశ్‌– డబుల్‌ రోడ్‌ ఉందంటే అది తెలంగాణ అని, చీకట్లు ముసిరితే అది ఆంధ్రప్రదేశ్‌– వెలుగులు విరజిమ్మితే అది తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హేళన చేసినందుకు జగన్‌ అండ్‌ కో సిగ్గు పడాలి కదా? ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలో ఎన్నికలు జరుగుతాయి కదా? అప్పుడు కేసీఆర్‌ వలె తెలంగాణకంటే ఆంధ్రప్రదేశ్‌ ఏ విషయంలో మెరుగ్గా ఉందో చెప్పుకోగల దమ్ము, ధైర్యం జగన్‌ అండ్‌ కోకు ఉందా? ఇంతకూ చంద్రబాబుపై ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెట్టడం ద్వారా జగన్మోహన్‌ రెడ్డి ఆయనకు మేలు చేస్తున్నారా? లేక కీడు చేస్తున్నారా? అంటే మేలే చేస్తున్నారని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు.

చంద్రబాబును జైలుకు పంపినా ప్రజల్లో కనీస స్పందన లేదని ఆత్మవంచన చేసుకుంటే అది వారిష్టం. ఒకటి మాత్రం నిజం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి, ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఈ అరెస్టు పుణ్యమా అని ఇప్పటి తరానికి తెలిసి వచ్చాయి. దేశంలో ఏ నాయకుడికీ దక్కనంత గౌరవం ఇప్పుడు చంద్రబాబుకు దక్కింది. ప్రజల్లో మంచి పేరున్న రాజకీయ నాయకుడు చనిపోతే జనాలు బాధతో బైటకు రావడం సహజం. కానీ ఒక నాయకుడు బెయిల్‌పై బయటకు వస్తే ఆయనను చూసి నైతిక మద్దతు ఇవ్వడానికి వేలాది మంది జనం తెల్లవార్లూ రోడ్లపైనే జాగారం చేయడాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చూశామా? చంద్రబాబుపై పెట్టిన, పెడుతున్న కేసులు కక్షపూరితమైనవి అని ప్రజలు నమ్మడం వల్లనే ఆయనకు ఇంతటి ఆదరణ లభించింది. ఈ స్పందన చూశాక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా చనిపోలేదని, ప్రజల్లో చేవ ఇంకా మిగిలే ఉందన్న నమ్మకం కలుగుతోంది. మంచీ చెడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోలేనంత నిస్తేజంలో జనం లేరన్న విశ్వాసం ఏర్పడింది. ప్రజల్లో ఇంతటి చైతన్యం రావడానికి కారణం అయిన జగన్మోహన్‌ రెడ్డికి కృతజతలు చెప్పకపోతే ఎలా? రావణుడి పాత్ర ఉన్నందుకే రాముడికి గుర్తింపు వచ్చింది! ఆయనను పూజిస్తున్నాం! మహాభారతంలో కౌరవులు లేకపోతే పాండవుల ఔన్నత్యం తెలిసేది కాదు కదా! ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసినప్పుడు వ్యవస్థలు కూడా అన్యాయం వైపు నిలబడ్డానికి భయపడతాయి. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం పరిపాటిగా మారిన ఈ దశలో ప్రజలే చొరవ తీసుకొని బయటకువస్తే వ్యవస్థలన్నీ బాధ్యతతో వ్యవహరిస్తాయి. హద్దుల్లో ఉంటాయి.


కేసీఆర్‌కు ఇరకాటం...

కాగా, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు చంద్రబాబు విషయంలో జగన్‌రెడ్డి నడుపుతున్న వికృత రాజకీయ క్రీడ తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారింది. చంద్రబాబు అరెస్టు ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా పడుతోంది. సెటిలర్లు మాత్రమే కాకుండా తెలంగాణలో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు సైతం జగన్‌ను అసహ్యించుకుంటున్నారు. ఈ పరిస్థితికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కారణమన్న భావన వారిలో ఏర్పడింది. ఈ పరిణామం అధికార బీఆర్‌ఎస్‌కు నష్టం చేయవచ్చునన్న ఆందోళన ఆ పార్టీ ముఖ్యులలో ఏర్పడింది. అందుకే చంద్రబాబు అరెస్టును పోటీ పడి మరీ ఖండిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సమావేశం అనూహ్యంగా సక్సెస్‌ కావడంతో దానికి విరుగుడుగా అదే స్టేడియంలో జగన్‌ మద్దతుదారులు కూడా సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు తనకు మద్దతుగా ఉన్న సెటిలర్లు చంద్రబాబు అరెస్టు తర్వాత దూరం కావడాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితికి కారణమైన జగన్మోహన్‌ రెడ్డిపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. బుద్ధి ఉన్నవారెవరైనా ఎన్నికలు పెట్టుకొని చంద్రబాబును అరెస్టు చేయిస్తారా? అని మంత్రి కేటీఆర్‌ బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ల ప్రభావం ఏ మేరకు ఉండబోతుందన్నది డిసెంబరు 3వ తేదీన వెల్లడవుతుంది. సెటిలర్ల వల్ల భారత రాష్ట్ర సమితికి నష్టం జరిగిందా? లేదా? అన్నది స్పష్టమవుతుంది. ప్రభావం కనిపిస్తే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకొనే ప్రతి యాక్షన్‌కూ తెలంగాణలో రియాక్షన్‌ ఉంటుందని నిర్ధారణ అవుతుంది. తనకు అండా దండగా ఉంటున్న కేసీఆర్‌కు జగన్‌ తన చర్యల వల్ల నష్టం చేశారా? లేదా? అన్నది స్పష్టం కావడానికి మరో నెల రోజులు వేచి చూడాల్సిందే!

ఆర్కే

Updated Date - 2023-11-05T07:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising