జాగా
ABN, First Publish Date - 2023-12-11T00:30:47+05:30
భూమ్మీద ఎవరికైనా కొంచెం జాగా వుంటుంది పక్షులకి పక్షులు వాలే పచ్చని చెట్లకి చెట్లపై గూళ్ళు కట్టుకునే పిట్టలకి...
భూమ్మీదఎవరికైనా కొంచెం జాగా వుంటుంది
పక్షులకి పక్షులు వాలే పచ్చని చెట్లకి
చెట్లపై గూళ్ళు కట్టుకునే పిట్టలకి
కొమ్మల నీడలో నెమరేసే పశువులకి
కొంచెం జాగా ఉండనే వుంటుంది
గరికపోచలకి గరికపోచల గెనాలమీద
వానపాట పాడుతూ ఎరిగే తూనీగలకి
నిశ్శబ్దంగా గురిచూపులతో పరిగెత్తే
పసిడివన్నెచేతుల పసిపిల్లలకి
పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులకి
భూమ్మీద జాగా ఉండనే వుంటుంది
ఇంటిల్లిపాది తలదాచుకోడానికో చలికాచుకోడానికో తలా ఇంత జాగా ఉండనే ఉంటుంది
అమ్మమ్మచంకలో మునగదీసుకున్న
రాగెంట్రుకలపిల్ల తలనిమురుతూ
చెలిమిగాలి తిరుగాడే వీధులతో
అమ్మవొడి వంటి జాగా ఉండనే వుంటుంది
ఏ జాగా అయినా
ఎంత ప్రేమపూరితమైనదీ!
మట్టిని పాదులుకట్టి మొక్కలు నాటితే
పూలనిస్తూ పళ్లనిస్తూ
ఖాళీ స్థలానికి చేనని పేరుబెట్టి
దోసెడు గోధుమల్ని చల్లితే
కాలే కడుపుల్లో రొట్టెగా ఆకలి తీరుస్తూ
దేవుడుకోరగా మారక ముందు
జాగా ఎంత పవిత్రమైనది!?
గోధుమరంగుబుగ్గలపై
గాయపు రక్తపుచారికల్ని చూస్తూ
నెత్తుటిపాలు చేసిన డేగలను వెతుకుతూ
పిడికెళ్లను బిగించిన వొక జాగా
భూమ్మీద ఉండనే వుంటుంది!
వొక అమ్మ మనసు జాగా
వొక నాన్న గుండె జాగా
మనముండే భూమ్మీద ఉండనే వుంటుంది!
పల్లిపట్టు నాగరాజు
99894 00881
Updated Date - 2023-12-11T00:32:25+05:30 IST