ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రభంజనాలు కాని ప్రజాతీర్పులు

ABN, First Publish Date - 2023-11-15T01:45:57+05:30

మరో రెండు వారాల్లో ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాల భవిష్యత్ ఏమిటో తేలనున్నది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరం ఫలితాలకు జాతీయ రాజకీయాలతో అంత ప్రమేయం లేదు కనుక...

మరో రెండు వారాల్లో ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాల భవిష్యత్ ఏమిటో తేలనున్నది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరం ఫలితాలకు జాతీయ రాజకీయాలతో అంత ప్రమేయం లేదు కనుక మిగతా నాలుగు రాష్ట్రాల్లో ప్రజా తీర్పులు ఎలా ఉంటాయన్నదానిపైనే దేశ ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల పరిపాలన పట్ల ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో భారతీయ జనతా పార్టీ ముఖాముఖి పోరాడుతున్నది. అయినప్పటికీ ఇది, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, అనుకూలంగానో ఐదు రాష్ట్రాల ప్రజలు ఇచ్చే తీర్పు అని చెప్పడానికి వీలు లేదు. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నామని, రాష్ట్రాల్లో కూడా తమ పార్టీనే ఎన్నుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే ఓటర్లు లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకూ తేడా చూపలేనంత అమాయకులు కారు. అందువల్లే 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీగఢ్‌లలో బీజేపీ పరాజయం చెందినప్పటికీ ఆరునెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీనే గెలిపించారు. 2023లో ఐదు రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చే తీర్పు 2024 సార్వత్రక ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని చెప్పడానికి వీలులేదు. గత అనుభవాల రీత్యా ఒకటి రెండు రాష్ట్రాల్లో గెలిచినంత మాత్రాన లోక్‌సభలో మోదీని ఢీకొనడం అంత సులభం కాదని కాంగ్రెస్‌కు తెలుసు. ఈ ఎన్నికలు ఒక విధంగా జాతీయ స్థాయిలో తమ ఉనికి కోసం బీజేపీ, కాంగ్రెస్ చేస్తోన్న పోరాటమే అని చెప్పవచ్చు.

కాంగ్రెస్ మొత్తంగా పుంజుకునే అవకాశం లభించేందుకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రాతిపదిక అవుతాయని, తత్ఫలితంగా ‘ఇండియా కూటమి’ బలపడుతుందేమోనన్న భయం బీజేపీ నేతలకు లేకపోలేదు. అందువల్ల లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాన్ని తాజాగా మార్చుకున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లతో పాటు బీజేపీ మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో కూడా నరేంద్రమోదీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా కుల సభల్లోనూ, రోడ్ షోలలో పాల్గొంటున్నారంటే ఆయనకు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం ఉన్నట్లు కాదు. నిజానికి తెలంగాణలో బీజేపీ కార్యకర్తల్లో ఉన్నంత ఉత్సాహం నాయకుల్లో లేదని, కార్యకర్తల ఆశలు ఆడియాశలు చేసే విధంగా నేతలు వ్యవహరించారని, తమను తప్పుదోవ పట్టించారని మోదీకి తెలియని విషయం కాదేమో?! గత ఏడాది వరకూ జీహెచ్ఎంసీ పరిధిలోనూ, ఇతర జిల్లాల్లోనూ బీజేపీ పుంజుకున్న దాఖలాలు కనపడ్డాయి. అయితే ఇప్పుడు రెండు అంకెల స్థానాల నయినా సాధిస్తుందా అన్న ప్రచారం మొదలైంది. అయినప్పటికీ నరేంద్ర మోదీ తెలంగాణలో ప్రచారానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే అర్జునుడి చూపు పక్షి కన్నువైపే ఉన్నట్లు ఆయన చూపు లోక్‌సభ ఎన్నికలవైపే ఉన్నదని భావించాలి. లేకపోతే ఎన్నికలకు ఎంతో ముందు నిర్వహించాల్సిన మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి విశ్వరూప సభ, ఓబీసీల సభల్లో ఆయన మరో రెండు వారాల్లో ఎన్నికలుండగా ఎందుకు పాల్గొంటారు? జనసేనతో బీజేపీ పొత్తుకు ఎందుకు అనుమతిస్తారు? మాదిగ రిజర్వేషన్ అంశం ఆయనకు ఇప్పుడు కాకపోయినా లోక్‌సభలో ఎన్నికల్లో ఉపయోగపడే అవకాశం ఉన్నది. అదే విధంగా తెలంగాణ పొత్తులు భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపవచ్చని పలువురి అభిప్రాయం. అందువల్ల తెలంగాణలో ఇప్పుడు మోదీ పాల్గొంటున్న సభలు, ప్రకటిస్తున్న విధాన నిర్ణయాలు, ఏర్పర్చుకుంటున్న పొత్తులు 2024లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి ఉపయోగపడే రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లలో సాధ్యమైనన్ని సీట్లు సాధించేందుకే ఆయన ఈ ఎన్నికల ప్రచారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆయా అసెంబ్లీలలో సీట్లు ఎన్ని వస్తాయన్న లెక్కలు లేకుండానే ఆయన తన వ్యక్తిగత ఆకర్షణతో బలమైన ముద్ర వేయాలనుకుంటున్నారు. అదే సమయంలో తన పార్టీకి చెందిన స్థానిక నేతలను విస్మరిస్తే మొదటికే మోసం వస్తుందని మోదీ ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా తానే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్న స్థాయిలో మోదీ ప్రచారం చేస్తున్నారు. తద్వారా శివరాజ్ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేశారు. తాను ఎంత ఉధృతంగా ప్రచారం చేసినా, స్థానికంగా శివరాజ్ సింగ్ చౌహన్ వ్యూహరచన చేయనిదే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కే పరిస్థితి లేదని మోదీ గ్రహించారు. ఈ దృష్ట్యా ఎన్నికల తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రాధాన్యత తగ్గిపోతుందని ఏ మాత్రం చెప్పలేము. ఎవరు కాదన్నా చౌహాన్‌ను మించిన నేత బీజేపీకి ఇప్పట్లో లభించడం కష్టం.

రాజస్థాన్‌లో కూడా వసుంధరా రాజే సింధియాకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని నిన్నమొన్నటి వరకూ పలువురు పరిశీలకులు భావించారు. అభ్యర్థుల మొదటి జాబితాలో ఆమె వర్గీయులకు చోటు లేకుండా చేశారు. ఆశ్చర్యకరంగా తదుపరి జాబితాల్లో అత్యధిక సీట్లు ఆమె సూచించిన వారికే ఇచ్చారని తేలింది. దీనితో రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ప్రచారం చేసినవారు ఇప్పుడు వెనక్కి తగ్గారు. లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సాధ్యమైనన్ని సీట్లు సాధించేందుకు తనకు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే అండదండలు అవసరమని మోదీ అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.


స్థానిక నాయకుల మద్దతు లేకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో 2019లో లభించిన ఫలితాలు పునరావృతం కావని మోదీ గ్రహించారు. ఈ కారణంగానే కర్ణాటక రాజకీయాల విషయంలో కూడా ఆయన తన వైఖరి మార్చుకున్నారు. యడ్యూరప్ప మద్దతు లేకుండా కన్నడ నాట బీజేపీ బలోపేతం కాదని తెలిసినప్పటికీ మోదీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీనియర్ నేత ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మోదీకి మళ్లీ యడ్యూరప్ప మద్దతు అవసరం కనిపించింది. అందుకే ఆయన కుమారుడు విజయేంద్రకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయగలిగేవారెవరూ ఇంకా బీజేపీకి లభించలేదు. యోగి మద్దతు లేకుండా గతంలో లాగా బీజేపీ లోక్‌సభలో అత్యధిక సీట్లు సాధించలేమని మోదీ, అమిత్ షాలకు తెలియనిది కాదు. ఇప్పటికే జాతీయ స్థాయిలో మోదీ, షా, నడ్డాలతో పాటు నాలుగో స్థానంలో ఆదిత్యనాథ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ నలుగురే ప్రధానంగా జాతీయ స్థాయి నేతలుగా ప్రచారం చేస్తున్నారు.

ఒకరకంగా నిన్నమొన్నటి వరకూ తాను తప్ప బీజేపీకి మరో దిక్కు లేదని పెట్రేగిపోయిన నరేంద్రమోదీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారు. స్థానిక నేతలకు ప్రాధాన్యమిచ్చి తీరాల్సిన పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. లేకపోతే హైదరాబాద్ సభలో నాటకీయంగా మందకృష్ణ మాదిగను హత్తుకోవడం, కన్నీరు కారుస్తున్న కృష్ణను ఓదార్చడం మోదీ బలమా, బలహీనతా అన్నది చర్చనీయాంశం. అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మోదీ ఇలాంటి ఎన్నో నాటకీయ సన్నివేశాల్లో పాత్ర పోషించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపించడమే అందుకు కారణం సుమా!

మోదీ ప్రచారం చేసినా, చేయకపోయినా, విస్పష్టంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్, తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వాల పనితీరు పట్ల ప్రజలు ఇచ్చే తీర్పుగానే భావించాల్సి ఉంటుంది. నాలుగు రాష్ట్రాల్లోనూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభంజనం వీచే అవకాశాలు లేవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నలుగురి ప్రభుత్వాల పట్ల ప్రజా వ్యతిరేకత ఎంత మేరకు ఉన్నది? అది ఈ ఎన్నికల్లో ఎంతవరకు ప్రతిఫలిస్తుంది అని చెప్పేందుకు సర్వేలు, రెండు వర్గాలుగా చీలిపోయిన మేధావుల అంచనాలు, అయిష్టతలు మాత్రం కొలమానాలు కాదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ జనాకర్షక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి కనుక వాటి ఆధారంగా గెలుపు లభిస్తుందని చెప్పలేము. ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్ అయిదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేకతను అధిగమించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అయితే గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బీజేపీ, కాంగ్రెస్ సాధించే సీట్ల మధ్య పెద్ద తేడా ఉండే అవకాశాలు లేవు. రాజస్థాన్‌లో అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందనే ప్రచారం ఉన్నప్పటికీ ఆశ్చర్యకరంగా కాంగ్రెస్– బీజేపీ మధ్య గట్టి పోటీ ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి కేవలం నాలుగు సీట్ల ఆధిక్యత ఉంటుందని ఒక సర్వే తేల్చితే కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని మరో సర్వే ప్రకటించింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. శివరాజ్ సింగ్ హయాంలో జీఎస్టీ వసూళ్లలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం సంపాదించగా, మోదీ సారథ్యంలోని గుజరాత్ చివరి స్థానంలో ఉండడం గమనార్హం. ద్రవ్యలోటు, జీఎస్డీపీ, పెట్టుబడి వ్యయంలోనూ మధ్యప్రదేశ్ అనేక రాష్ట్రాలకంటే మెరుగైన స్థానంలో ఉన్నది. అయినప్పటికీ 18 ఏళ్ల సుదీర్ఘపాలన, అవినీతి పాలన ఆయనకు వ్యతిరేకంగా మారింది. అందువల్ల మళ్లీ 2018 నాటి ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదని స్థానికులు భావిస్తున్నారు. అప్పుడు బీజేపీ కంటే కాంగ్రెస్ కేవలం అయిదు సీట్ల ఆధిక్యతే సాధించింది. తెలంగాణలో కేసీఆర్ గతంలో కనపరిచిన ఉధృతిని కనపరచడం లేదని, కాంగ్రెస్ సమీపంలోకి దూసుకువస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకు కారణాలు ఏమిటి? అవేమిటో, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలకు తెలియనివి కావు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-11-15T01:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising