పర్యావరణ స్పృహ లేకపోతే మనుగడే ప్రమాదం
ABN, First Publish Date - 2023-11-29T02:18:55+05:30
ప్రపంచం కోలుకోలేని సంక్షోభపు ఊబిలోకి క్రమంగా కూరుకుపోతోంది. పర్యావరణ విధ్వసం వల్ల ఆర్థిక సమస్యలు, కరవు, యుద్ధాలు, దేశాంతర ఖండాంతర వలస సమస్యలు...
ప్రపంచం కోలుకోలేని సంక్షోభపు ఊబిలోకి క్రమంగా కూరుకుపోతోంది. పర్యావరణ విధ్వసం వల్ల ఆర్థిక సమస్యలు, కరవు, యుద్ధాలు, దేశాంతర ఖండాంతర వలస సమస్యలు, ఆకలి మారణహోమం, రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయిల్–పాలస్తీనా యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా ఫాసిజం, ఫాసిస్టు ధోరణలతో కూడిన నియంతృత్వ రాజకీయ పరిణామాలు పెచ్చరిల్లిపోవడం వంటి సార్వత్రిక సంక్షోభాలతో ప్రపంచం అతలాకుతలమవుతున్నది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుపై సభ్య దేశాల మహాసభ (కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) ఈ ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 దాకా దుబాయ్‌లో జరగనున్నది. ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‍వర్క్ ఒప్పందం కోసం ఈ సమావేశం (కాప్–28) జరుగుతున్నది. సామాజికార్థిక–పర్యావరణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచాన్ని పరిరక్షించేందుకు వాతావరణ మార్పును కర్తగా చేసి ప్రతి ఏడూ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పరిష్కారాలు వెతుకుతున్న తంతు ఇది. వాతావారణ మార్పును నివారించడంలో ఈ తంతు వల్ల ఒరిగిందేమీ లేదన్న పచ్చి నిజాన్ని గత కొంతకాలంగా పరంపరగా వెలువడుతున్న నివేదికలు, అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ధనిక దేశాల స్వార్థపూరిత కుట్రలు, పేద దేశాల నిస్సహాయత, కొత్త సామ్రాజ్యవాద దేశమైన చైనా తదితర వర్ధమాన దేశాల పాలకవర్గాల వికలబుద్ధి కారణంగా కాప్ సదస్సు లక్ష్యాలు కుదేలవుతున్నాయి. అయినప్పటికీ, అంతర్జాతీయ సమాజంలో పర్యావరణ పరిష్కారాల తక్షణ అవసరంపై అవగాహన పెరిగేందుకు ఈ సమావేశాలు దోహదం చేశాయి. పర్యవసానంగా ఆయా దేశాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం స్థానిక, అంతర్జాతీయ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు తలెత్తాయి.
పాడిందే పాటలా యూఎన్ తాజా నివేదిక సైతం హరిత వాయువుల వెలువరింపుల (జీహెచ్‌జీ) పర్యవసానాల గురించిన హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవటం లేదని, ఆ వెలువరింపులపై విధించిన నిషేధాలను ప్రపంచం విస్మరించిందని ఆక్షేపించింది. అందువల్ల వాతావరణ మార్పు మరింత దిగజారిందని ఆ నివేదిక వెల్లడించింది. శీతోష్ణ స్థితి పారిశ్రామికీకరణకు ముందు స్థాయి కన్నా 2 డిగ్రీలు, సాధ్యమైతే 1.5 డిగ్రీలకు మించి పెరగకూడదని 2015 పారిస్ ఒప్పందంలో ఆయా దేశాలు ఇచ్చిన హామీలు, వాగ్దానాలన్నీ వీగిపోయాయని నివేదిక తేల్చిచెప్పింది. 1.5 డిగ్రీల కంటే పెరిగినట్లయితే భూగోళంలో పునరుద్ధరణకు వీలుకాని ఆకస్మిక వాతావరణ మార్పుల కారణంగా మానవ నివాసయోగ్యంకాని పరిస్థితులు నెలకొంటాయని అనేక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్, చైనాలలో విపత్కర వరద బీభత్సాలు; అమెరికా, యూరప్‌లలో ఎన్నడూ లేనంత వడగాల్పులు; ఆఫ్రికాలో అత్యంత దారుణమైన కరువు పరిస్థితులు; ధ్రువాల వద్ద రికార్డు స్థాయిలో మంచు కరగడం; భారత్‌లో సగటు వేసవి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల మలేరియా, డెంగ్యూ, సముద్ర తీరాల్లో గ్యాస్ట్రో ఎంటరైటిస్, పుండ్లు, కలరా, జింకావైరస్, టీబీ వంటి వ్యాధులు పెరగడం వంటి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ దిగుబడులు తీవ్రంగా తగ్గటమేగాక, జీవజాలపు మెటాబాలిజం (జీవప్రక్రియ) బాగా దెబ్బతిని జీవుల అంతర్ధానం వేగవంతమయింది. ప్రజారోగ్యం, ఆరోగ్య రక్షణ వ్యవస్థలు వాతావరణ మార్పుల కారణంగా కుదేలయ్యాయని ‘కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ అనే లాన్సెట్ 8వ వార్షిక నివేదిక పేర్కొన్నది. పారిస్ ఒప్పందాన్ని కాలదన్ని పర్యావరణ మార్పుకు ప్రధాన కారణాలైన శిలాజ ఇంధనాల వినియోగాన్ని అభివృద్ధి చెందిన దేశాలు కట్టడి చేయకపోవడం వల్లనే ఇలా జరిగిందని, అది మరింత తీవ్ర పరిణామాలకు దారితీయగలదని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. భూ తాపం కారణంగా మహాసముద్రాలు వేడెక్కి, ప్రపంచ శీతోష్ణస్థితులను క్రమబద్ధం చేసే థర్మోహాలైన్ సర్క్యులేషన్ (టీహెచ్‌సీ)/ అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్‌టర్నింగ్ సర్క్యులేషన్ (ఏఎమ్ఓసీ) ప్రసరణం స్తంభించిపోయే పరిస్థితులు ఏర్పడడంతో తీవ్ర వాతావరణ పరిస్థితులు తలెత్తుతున్నాయి. పర్యవసానంగా రుతువుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో వ్యవసాయం దెబ్బతిని, జీవజాలం అంతరించే ముప్పు ఏర్పడింది.
2022 కాప్ తర్వాత వాతావరణ మార్పు వ్యతిరేక పోరాటంలో భాగంగా ‘ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం’ ద్వారా 369 బిలియన్ డాలర్ల నిధులను శుభ్రమైన శక్తి, మౌలిక సదుపాయాలు, వాతావరణ స్థితిస్థాపక కార్యక్రమానికి కేటాయించారు, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌లో అనుకూల వాతావరణ మార్పు కార్యక్రమాలను చేపట్టే లక్ష్యాలున్న ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత ఏడాది ఈజిప్ట్‌లో జరిగిన కాప్ 27 సదస్సులో ‘నష్ట పరిహార నిధి’ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. పారిశ్రామిక ధనిక దేశాల ఉద్గారాల వల్ల ఏర్పడ్డ విధ్వంసకర వాతావరణ మార్పు నష్టాన్ని పూడ్చడంలో భాగంగా వెనుకబడిన వ్యవసాయక దేశాలకు హరిత సాంకేతిక పరిజ్ఞానం, నిధులను అందజేయాలని ప్రతిపాదించారు. వ్యవసాయం నుంచి కూడా హరిత వాయువుల వెలువరింపు పరిమాణం తక్కువేమీ లేదని, అందుకు వ్యవసాయ ప్రధాన దేశాలు కూడా తమ వంతు బాధ్యత వహించాల్సి ఉంటుందన్న పారిశ్రామిక దేశాల వాదనతో ఒప్పందం గతంలో అనేకసార్లు వాయిదా పడింది. ఈ సాకుతో హరిత నిధులను సమకూర్చే బాధ్యత నుంచి అమెరికా తప్పుకుంది. దాంతో నిధుల సమకూర్చే కార్యక్రమం కుంటుపడింది.
వాతావరణ మార్పు సంక్షోభమనేది దానికదే శాస్త్ర సాంకేతిక కారణాల రీత్యా అవతరించలేదు. అది ఇతరత్రా మహా సంక్షోభాలతో ముడిపడి ఉనికిలోకి వచ్చింది. 2008 నుంచి కొనసాగుతున్న ప్రపంచ సామాజికార్థిక–పర్యావరణ సంక్షోభం పర్యవసానంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఫాసిస్టు, అర్ధ ఫాసిస్టు, ఫాసిస్టు ధోరణిగల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. జాత్యహంకారం, సామాజిక వైషమ్యాలు, వ్యవస్థీకృత మత విద్వేషాలు పెచ్చరిల్లిపోయాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్–పాలస్తీనా యుద్ధం ముందుకొచ్చాయి. రష్యా, ఉక్రెయిన్‌ల ఆహార సరఫరాకు అంతరాయం కలగడంతో పర్యవసానంగా పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ప్రపంచం ఆహార భద్రత సంక్షోభంలోకి జారిపోయింది. పర్యావరణ సంక్షోభం, సామాజికార్థిక సంక్షోభాలు రెండూ విడివిడిగా చూసే దృక్పథాన్ని విడనాడాలి. ప్రకృతీ సమాజాల మధ్య సాగే ఆదానప్రదాన ప్రక్రియల్లో లోపభూయిష్టతవల్లనే వివిధ బానిస, ఫ్యూడల్ యుగాల్లో యుగ సంక్షోభాలు తలెత్తి ఆయా వ్యవస్థల మార్పుకు దారితీసాయి.
సంపద కాంక్షతో, లాభాపేక్షతో, ‘నా తర్వాత ప్రళయం రానీ...’ అనే ధోరణితో విచక్షణారహితంగా దోపిడీ, విధ్వంసాలకు పాల్పడుతున్న రాజకీయార్థిక పర్యావరణ విధానాలు కొనసాగుతున్నంత వరకు ఇప్పుడు కొనసాగుతున్న సామాజిక పర్యావరణ సంక్షోభానికి పరిష్కారం ఉండదు. ‘ప్రకృతి మానవుని అవసరాలను మాత్రమే తీరుస్తుంది కానీ, అతని దురాశను కాదు’ అన్న అవగాహనతో ప్రస్తుతం కొనసాగుతున్న యుగసంక్షోభానికి కారణమైన రాజకీయార్థిక–పర్యావరణ విధానానికి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించాలి. రానున్న దుబాయ్ కాప్ సదస్సు 2015నాటి పారిస్ ఒప్పందం అమలు తీరుతెన్నులపై మళ్లీ చర్చ జరుగుతుంది. కరోనా, యుద్ధాలు, వలస సమస్య, ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఫాసిస్ట్, ఫాసిస్ట్ తరహా మితవాద, మతవాద ప్రభుత్వాల కారణంగా పారిస్ ఒప్పందం అటకెక్కింది. హరిత వాయువుల వెలువరింపుల కోటాలను సైతం ‘కార్బన్ క్రెడిట్’ వ్యాపారంగా ధనిక దేశాలు, ప్రపంచ కార్పొరేట్ శక్తులు మార్చి వేసిన తరుణంలో ఒప్పందం దృక్పథంలోనే లోపం ఉందని గ్రహించాలి. మాటలు, ఒప్పందాలు కాదు, చేతలు కావాలి అని అందరూ విమర్శించడంలో తప్పులేదు. అంతకంటే కూడా ప్రకృతి–సమాజాల ఆదానప్రదానాలకు గండి కొట్టే విధంగా సంపద కేంద్రీకరణ దిశగా సాగుతున్న ఉత్పత్తి విధానంలో పరిష్కారం కోసం కృషి చేయాలి. ఈ యుగ సంక్షోభం మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేయకముందే సరైన దృక్పథంతో ఈ సమస్యకు పరిష్కారం వెతికే కార్యాచరణకు ప్రపంచ ప్రగతిశీల శక్తులు సంఘటితం కావాలి.
వెన్నెలకంటి రామారావు
(రేపటి నుంచి డిసెంబర్ 12 వరకు వాతావరణ మార్పుపై దుబాయ్‌లో ‘కాప్ 28’ అంతర్జాతీయ సదస్సు)
Updated Date - 2023-11-29T02:18:56+05:30 IST