ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హామీలు అమోఘం, పాలన అధ్వాన్నం

ABN, First Publish Date - 2023-11-28T01:43:22+05:30

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎడా పెడా ప్రజలకు హామీలు, ఉచితాల వర్షం కురిపిస్తోంది. ఆకాశాన్ని నేలకు తీసుకువస్తామన్నట్లుగా...

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎడా పెడా ప్రజలకు హామీలు, ఉచితాల వర్షం కురిపిస్తోంది. ఆకాశాన్ని నేలకు తీసుకువస్తామన్నట్లుగా వాగ్దానాలు చేస్తోంది. దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా దేశంలోను, ఇతర రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన పరిపాలనలో పేదరికాన్ని ఏ మాత్రం తగ్గించకపోగా, ఇప్పుడు తమను తృణీకరించిన ప్రజల మెప్పు పొందడానికి నానా అగచాట్లు పడుతోంది. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఓటర్లను మభ్యపెడుతోంది. కేవలం ఉచితాలను వాగ్దానం చేసినందువల్లే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పుడు ఆ హామీలు నిలబెట్టుకోలేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. కర్ణాటక అనుభవాలు స్పష్టంగా కనపడుతున్నప్పటికీ కాంగ్రెస్ ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవపట్టిస్తోంది.

దేశంలో అతి వేగంగా అభివృద్ది చెందుతున్న ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకపోయినప్పటికీ ఆ పార్టీ దుష్పరిపాలనా ఫలితాలు ప్రజల అనుభవంలోకి వచ్చాయి. అధికారంకోసం ఇలా ఎడా పెడా వాగ్దానాలు చేస్తే వాటిని నిలబెట్టుకోవడానికి రూ. 50 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని, మొత్తం ఆదాయంలో 22 శాతం ఉచితాలకే వ్యయం అవుతుందని, ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని పలువురు ఆర్థికవేత్తలు ప్రశ్నించినప్పటికీ కాంగ్రెస్ పెడచెవిన పెట్టింది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఈ ఉచితాలను అమలుపరచడానికి ఖజానాను ఖాళీ చేయడం మొదలు పెట్టింది. అయినప్పటికీ సరైన ప్రణాళికలు లేనందువల్ల తాను ప్రకటించిన వాగ్దానాలనే నిలబెట్టుకోలేని దుస్థితిలో పడింది. ఉదాహరణకు కర్ణాటక ప్రజలందరికీ అన్నభాగ్య పథకం క్రింద ఒక్కొక్కరికీ 10 కిలోల బియ్యం ఇస్తామని వాగ్దానం చేసింది. నిజానికి కేంద్రం ఇప్పటికే ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యం సరఫరా చేస్తోంది. అంటే మరో 5 కిలోల బియ్యమే రాష్ట్రం అదనంగా ఇవ్వాలి. కాని బియ్యం ఎక్కడనుంచి తెస్తామన్న ఆలోచన లేకుండా వాగ్దానం చేయడంతో ఈ పథకం సరిగ్గా, సకాలంలో అమలు కావడం లేదు. రేషన్ షాప్ డీలర్లు కూడా ఈ పథకాన్ని అమలు చేయలేక తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బియ్యం కావాలని అనేక రాష్ట్రాలను కర్ణాటక ప్రభుత్వం ప్రాధేయపడుతోంది. గత రెండు నెలలుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బు ప్రజలకు అందడం లేదు.

గృహ జ్యోతి క్రింద కర్ణాటకలో ప్రజలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. అధికారంలోకి రాగానే గత ఏడాది 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికే ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించింది. పైగా ఈ వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం విద్యుత్ టారిఫ్‌ను యూనిటట్‌కు రూ. 2.89 చొప్పున పెంచింది. దీనివల్ల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లపై భారం పెరిగి రోజుకు కొద్ది గంటల పాటే విద్యుత్ లభించే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. ఇతర రాష్ట్రాలను విద్యుత్ సరఫరా చేయమని యాచిస్తోంది. ఆయా రాష్ట్రాల నుంచి అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన దుస్థితిలో పడింది. రాష్ట్రంలోని 13 థర్మల్ యూనిట్లలో ఆరు యూనిట్లు బొగ్గు సరఫరా కొరవడి, నిర్వహణ సరిగా లేక మూతపడ్డాయి. చివరకు ప్రభుత్వ అధికారిక సమావేశాలు, కోర్టు విచారణలు కూడా చీకట్లో నిర్వహించాల్సిన పరిస్థితి కర్ణాటకలో కనపడుతోంది. తమకు టారిఫ్ తగ్గించాలని, నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని చిన్న తరహా పరిశ్రమలు మొరపెట్టుకుంటున్నాయి.

కరువు పరిస్థితులు తీవ్రమై కరువు పీడిత తాలూకాలు 62 నుంచి 216కు పెరిగాయి. ఇప్పటికే 250 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సకాలంలో కరువు జిల్లాలుగా ప్రకటించడంతో రైతులకు సహాయక చర్యలు అందడం లేదు. రిజర్వాయర్‌ల నుంచి పంటలకు విడుదలచేయకపోవడంతో రైతులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పంటలు పండించడం మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ రైతులకు ఉచిత సలహాలనిస్తున్నారు. ఇక నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లకు, డిప్లొమా హోల్డర్లకూ నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న వాగ్దానాన్ని కర్ణాటక ప్రభుత్వం ఇంతవరకూ నిలబెట్టుకోలేదు. దీనితో తమను కాంగ్రెస్ వంచించిందని యువత భావిస్తోంది. ఒకప్పుడు ఐటీ హబ్‌గా, గ్లోబల్ ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా గుర్తింపు పొందిన కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే దుర్భర ఆర్థిక పరిస్థితులు కనపడుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పది గ్యారంటీల పేరుతో గత ఏడాది అధికారంలోకి వచ్చింది. 5 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు, 300 యూనిట్ల విద్యుత్ ఉచితం, 600 కోట్ల స్టార్టప్ ఫండ్, ఆపిల్ పళ్లకు కనీస మద్దతు ధర, ప్రతి గ్రామంలోనూ సంచార వైద్యశాలల ద్వారా ఉచిత వైద్యం వంటి హామీలు ఇంతవరకూ అమలు కాలేదు. కొన్ని పథకాలు సగం సగం అమలు చేస్తున్నారు. రాజస్థాన్‌లో ఇప్పటికే చేసిన వాగ్దానాలు అమలు చేయలేక గెహ్లోత్ ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతుంటే. కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక కొత్త కొత్త వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. రాజస్థాన్‌లో గత ఏడాది అప్పుల భారం రూ 4,58,089 కోట్లు కాగా, 2022–23లో ఈ భారం రూ. 5,57,013 కోట్లకు పెరిగిందని రిజర్వు బ్యాంకు నివేదిక ప్రకటించింది. కొత్త వాగ్దానాలు అమలు చేసేందుకు ఎక్కడ నుంచి డబ్బులు తెస్తారో కాంగ్రెస్ ప్రజలకు చెప్పలేదు.

కర్ణాటక, హిమాచల్, రాజస్థాన్‌లలో పరిస్థితులు ఇతర రాష్ట్రాలకు తెలియవని కాంగ్రెస్ అనుకున్నట్లు కనపడుతోంది. దీనితో కర్ణాటక బ్లూ ప్రింట్‌ను అమలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. విచిత్రమేమంటే తెలంగాణలో ప్రజలపై రూ. ఆరు లక్షల కోట్ల అప్పుల బారం ఉన్నదని, ప్రతి ఒక్క వ్యక్తిపై రూ.1.40 లక్షల అప్పు ఉన్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా హైదరాబాద్‌లో ప్రకటించారు. కాని అదే కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ ఎడాపెడా వాగ్దానాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 2.77 లక్షల కోట్లు అయితే కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీల విలువే రూ. 3.50 లక్షల కోట్లకు చేరుకుంది. తెలంగాణలో కూడా కర్ణాటకలో మాదిరే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెలా మహిళలకు రూ. 2వేల చొప్పున నగదు, రూ. 500కే గ్యాస్ సిలిండర్, రైతులకు ఎకరానికి రూ. 15000, వృద్ధులకు రూ. 4వేల చొప్పున పింఛను వంటి వాగ్దానాల వర్షం కురిపించారు. కేసీఆర్ ఇప్పటికే ఉచితాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్లకు పైగా వృధా చేసి రాష్ట్ర ప్రజలకు తన దుష్పరిపాలన ప్రభావాన్ని చవి చూపించారు. 50 వేల కోట్ల ఆర్థిక లోటుకు చేరుకున్న తెలంగాణలో కాంగ్రెస్ తన వాగ్దానాలు అమలు చేయడం ఎలా సాధ్యం చేయగలదు? ప్రజలను ఇలాంటి బూటకపు వాగ్దానాలతో మభ్యపెట్టడం న్యాయమా? చిదంబరం వంటి ఆర్థిక నిపుణులైనా ప్రజలకు లెక్కలు వివరిస్తే బాగుంటుంది.

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2023-11-28T01:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising