అభివృద్ధి – సంక్షేమం సమతూకం ఎలా?
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:41 AM
మన ఉమ్మడి అవసరాల్ని తీర్చటానికి మానవ సమాజం ప్రభుత్వాలను సృష్టించింది. ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాలు మన ద్వారా ఎన్నికవుతాయి. అయితే మనం...
మన ఉమ్మడి అవసరాల్ని తీర్చటానికి మానవ సమాజం ప్రభుత్వాలను సృష్టించింది. ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాలు మన ద్వారా ఎన్నికవుతాయి. అయితే మనం ప్రభుత్వాన్ని ఎందుకు సృష్టించుకున్నామో ఆ లక్ష్యాన్ని పణంగా పెట్టి మనల్ని తాత్కాలికంగా సంతృప్తిపరచాలనే ఉబలాటం ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఎప్పుడూ ఉంటుంది. మన సమాజంలో పేదరికం, అసమానత పెద్దఎత్తున ఉన్నాయి. కానీ పేదరికం బాధని తాత్కాలికంగా తగ్గించటం, ఓటర్లని సంతృప్తిపరచటం కోసం ప్రభుత్వాలు కేవలం తాత్కాలిక వ్యక్తిగత సంక్షేమం మీదే దృష్టి పెడితే, మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం సమాజ ఉమ్మడి అవసరాలను నిర్లక్ష్యం చేస్తే, బాగా నష్టపోయేది, బాధలు పడేది పేదలే. వేగంగా ఆర్థికాభివృద్ధి జరగటమే పేదరికానికి అతి పెద్ద విరుగుడు. నాలుగు దశాబ్దాలపాటు ఆర్థిక రంగాన్ని నిరంతరాయంగా పరుగులెత్తించబట్టే చైనా పేదరికాన్ని నిర్మూలించగలిగింది. మన వనరులన్నీ రోజువారీ మనుగడకు, తాత్కాలిక సంక్షేమానికే పోతే ఆర్థిక రంగం నిలిచిపోతుంది, అభివృద్ధి ఉండదు. అభివృద్ధి లేకుండా, పెరుగుతున్న జనాభాతో, మనం మరింత పేదలమవుతాం. అభివృద్ధి ఉంటే సంక్షేమంపై ఖర్చుకి ప్రభుత్వానికి మరిన్ని పన్నుల ఆదాయాలుంటాయి. అభివృద్ధి, సంక్షేమం కలసికట్టుగా సాగాలనేది సుస్పష్టం.
సంక్షేమంతో కూడిన అభివృద్ధిని పెంచాలంటే, రెండు ప్రధాన ప్రశ్నలకు సమాధానం అవసరం. మొదటిది, సంక్షేమంపై మనం ఎంత ఖర్చు చేయగలం; రెండోది, పేదలకు సాయపడటానికి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి. ప్రభుత్వానికి ఆదాయం మూడు వనరుల నుంచి వస్తుంది: మొదటిది, పన్ను ఆదాయాలు, సెస్సులు, ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేసే ఫీజులు; రెండు, పెట్టుబడుల నుండి వచ్చే డివిడెండ్లు, ఆదాయం, ఆస్తుల అమ్మకం; మూడోది, అప్పులు. అప్పు తెచ్చిన డబ్బుని, పెట్టుబడి లాభాల్ని, ఆస్తుల అమ్మకాల్ని మనం రోజువారీ ఖర్చులకే వినియోగిస్తే, అప్పుల ఊబిలో కూరుకుపోతాం. ప్రభుత్వాలు దివాలా తీస్తాయి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. విజ్ఞత గల కుటుంబాలు, కంపెనీలు, రోజువారీ ఖర్చును ప్రస్తుత ఆదాయాల నుంచే నిర్వహిస్తాయి. వీలైనంత ఎక్కువ డబ్బును పొదుపు చేస్తాయి. కానీ ప్రభుత్వంలో మాత్రం అప్పు తెచ్చిన డబ్బు సంపదను సృష్టించే పెట్టుబడులకు కాకుండా రోజువారీ వినియోగానికి వెళ్తోంది. దీనివల్ల ఎటువంటి అదనపు అభివృద్ధి, ఆదాయం లేకుండా భవిష్యత్తు మీద అప్పుల భారం పెరుగుతోంది.
చాలా రాష్ట్రాల్లో, జీతాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపులు ఇప్పటికే సొంత ఆదాయాలను మించి ఉన్నాయి. దీంతోపాటు, రోజువారీ పరిపాలనా ఖర్చు. ఈ మొత్తం వ్యయాలను ఎవరూ ఆపలేరు. ఆ తర్వాత మనకు తాత్కాలిక సంక్షేమ వ్యయం ఉంటుంది. ఈ వ్యయాన్ని కూడా ఒక పరిధిలోకి తేవటం అవసరం. కానీ ప్రతి ఎన్నికలో కొత్త తాత్కాలిక సంక్షేమ పథకాలు, వేగంగా పెరిగే జీతాలు, నిరంతరం పెరుగుతూ భవిష్యత్తుపై విపరీత భారం వేసే పెన్షన్లు, వెరసి యూనియన్ ప్రభుత్వం నుంచి బదిలీ అయ్యే నిధులతో కలిపినా ఖర్చు చాలా రాష్ట్రాల్లో ఆదాయాల్ని మించి పోయింది. జాతీయ స్థాయి ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి. జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, రాష్ట్రాలకు చేసే అన్ని రకాల బదిలీలు, సంక్షేమ పథకాలు పోగా 2022–23లో (సవరించిన అంచనాలు) రూ.11,10,546కోట్లు, 2023–24లో (బడ్జెట్ అంచనాలు) రూ.8,69,855 కోట్లు భారీ రెవెన్యూ లోటు ఉంది. మన ప్రభుత్వాలు నేల విడిచి సాము చేస్తున్నాయి. ఉద్యోగి సర్వీసులో రూపాయి జమ చేయకుండా నిరంతరం భారీగా పెరుగుతుండే పెన్షన్ పథకాల(ఓపీఎస్)తో వచ్చే ప్రమాదాన్ని గుర్తించటం వల్లే 2004 నుంచి కొత్త జాతీయ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఉద్యోగులు, ప్రభుత్వం సర్వీసులో ఉన్నప్పుడే నెలనెలా కొంతమొత్తం తమ వంతు వాటాగా చెల్లిస్తారు. అయితే అంతకు ముందున్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది కాబట్టి 2035–40 వరకు ఓపీఎస్ భారం భారీగా పెరుగుతూనే ఉంటుంది; ఆ తర్వాత కూడా మళ్లీ ఓపీఎస్ అమలు చేస్తామనే ప్రభుత్వాలున్న రాష్ట్రాలు 2035 తర్వాత దారుణంగా పతనమవటం ఖాయం.
కాబట్టి, భవిష్యత్తులో చెల్లించే పెన్షన్లు, సంక్షేమ పథకాలు సహా రోజువారీగా ప్రభుత్వం చేసే ఖర్చు మొత్తం ఈవేళ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల నుంచే తప్ప అప్పులు, ఆస్తుల అమ్మకం నుంచి చేయకూడదనేది నిబంధన కావాలి. సంక్షేమ పథకాలకు ఈవేళ్టి ఆదాయం నుంచి ఖర్చు చేస్తూ, అప్పు తెచ్చిన డబ్బు భవిష్యత్తు అవసరాల పెట్టుబడులకు వినియోగిస్తుంటే, అప్పుడు భవిష్యత్తు అభివృద్ధి, రోజువారీ సంక్షేమం మధ్య సమతూకం నెలకొంటుంది.
ఇక రెండో ప్రశ్న: ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రయోజనకరం? ఉత్పాదకతను, సంపాదించే శక్తిని పెంచే ఏ రకమైన సంక్షేమ కార్యక్రమమైనా సరైనదే. నైపుణ్యాల పెంపు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రోత్సాహకాలు ఇవ్వటం ఇందుకు మంచి ఉదాహరణలు. ఆ తర్వాతి అత్యుత్తమ కార్యక్రమం పేదల ఆదాయాలకు అదనపు తోడ్పాటు ఇవ్వటం. లక్ష్యానికి కచ్చితంగా విరుద్ధ ఫలితాలనిచ్చే సంక్షేమ పథకాలు వ్యక్తులకు తాత్కాలిక లబ్ధి కలిగిస్తాయి గానీ, ఆర్థిక వ్యవస్థకు, ఉత్పాదకతకు దీర్ఘకాలంలో నష్టాన్ని కలిగిస్తాయి. ఫలితంగా, పేదలకు ఉద్దేశించిన లాభం కంటే సమాజం భరించే నష్టం, మూల్యం ఎక్కువగా ఉంటాయి.
ఉదాహరణకు, సంక్షేమం ఏ రకంగా ఉండకూడదో ఆ రకంగా అమలు చేసే రుణమాఫీల కార్యక్రమం. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతులు, సూక్ష్మ తరహా సంస్థలు కేవలం 30–40శాతం; మిగిలినవాళ్లు అనధికార వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పు తెచ్చుకుంటారు. కాబట్టి, ఏ రకమైన రుణ మాఫీ అయినా 60శాతం రైతులు, చేతివృత్తులవారికి వర్తించదు. నిజాయితీగా సకాలంలో రుణం చెల్లించినవారికి రుణమాఫీ లాభం వర్తించదు. మోసపోయామన్న భావం వారికి కలుగుతుంది. అంతిమంగా అప్పులు ఎగ్గొట్టే సంస్కృతిని మనం సృష్టిస్తున్నాం. చివరికి మొత్తం పరపతి నాశనమై, రైతులు, చేతివృత్తులవారి పరిస్థితి మరింత దిగజారుతుంది. అందువల్లే ప్రజల పన్నుల డబ్బుతో ఎన్ని రుణమాఫీలు చేసినా పేదలు, అట్టడుగు వర్గాలు పేదరికంలో మగ్గుతూ ఉంటారు. రుణమాఫీలకు బదులుగా, సకాలంలో, అవసరమైన మొత్తంలో రుణాల్ని అందుబాటులోకి తేవటం, గడువులోగా చెల్లించినవారికి వడ్డీ రాయితీలు, ఉత్పాదకతను పెంచటానికి సాంకేతికత, మెరుగైన ధర లభించటానికి మంచి మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు ఆదాయాల్ని పెంచుతాయి, ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తాయి.
మీటర్లు లేకుండా రైతులకు ఉచిత విద్యుత్తు, పౌష్టికాహార సమతుల్యత లేకుండా ఉచిత బియ్యం, మొక్కల పోషకాలతో సమతౌల్యం లేకుండా యూరియా సబ్సిడీ పేదరిక నిర్మూలనకు దోహదం చేయవు. మన విధానాలు, సంక్షేమ చర్యలు పేదరికాన్ని అంతం చేసి, ప్రజలందరినీ మధ్యతరగతి పరిధిలోకి తీసుకురావాలి. వారి ఉత్పాదకతను పెంచాలి. వారికి అవకాశాల్ని కల్పించి, మెరుగైన ఆదాయాలు సంపాదించుకునేలా చేయాలి. ఆ పని చేయకుండా మనం చాలా సందర్భాల్లో ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నాం. ఉత్పాదకత, ఆత్మగౌరవం, ఆదాయాలు భవిష్యత్తు ప్రగతికి కీలకాలు.
డాక్టర్ జయప్రకాష్ నారాయణ్
లోక్‌సత్తా వ్యవస్థాపకులు
Updated Date - Dec 17 , 2023 | 12:41 AM