ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘సొరంగం’ ఆవల కారుచీకటి!

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:45 AM

దేశపాలనలో రాజ్యాంగస్ఫూర్తిని నిలబెట్టడంలో సర్వోన్నతన్యాయస్థానం పౌరసమాజం విశ్వాసాన్ని కోల్పోతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ దాడుల నుంచి లౌకికవాద...

దేశపాలనలో రాజ్యాంగస్ఫూర్తిని నిలబెట్టడంలో సర్వోన్నతన్యాయస్థానం పౌరసమాజం విశ్వాసాన్ని కోల్పోతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ దాడుల నుంచి లౌకికవాద విలువలను, సమాఖ్య విధానాన్ని సంరక్షించడంలో సుప్రీంకోర్టు ప్రభావశీలంగా వ్యవహరించడం లేదు. దశాబ్దకాలంగా సుప్రీంకోర్టు వెలువరించిన వివిధ తీర్పులు ఈ అభిప్రాయానికి కారణం. ఆ వరుసలో మరింత ఆమోదయోగ్యం కానటువంటి తీర్పు ఇటీవల వెలువడింది. జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చిన రాజ్యాంగ అధికరణ 370 రద్దును అది సమర్థించింది. మోదీ ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని ధ్రువీకరించడం ద్వారా పార్లమెంటు ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీ మద్దతు లేకుండానే రాజ్యాంగాన్ని సవరించేందుకు సుప్రీంకోర్టు మార్గాన్ని సుగమం చేసింది. రాజ్యాంగ సవరణల్లో ప్రభుత్వం యధేచ్ఛగా వ్యవహరించడానికి బాటలు వేసింది.

ఇదీ ఆ మార్గం: ఒక రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితిని ఉపయోగించుకోవడం లేదా అటువంటి పరిస్థితిని సృష్టించడం ద్వారా తొలుత అధికరణ 356 కింద ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రకటిస్తారు; తద్వారా రాష్ట్రపతికి ఆ రాష్ట్ర శాసనసభాధికారాలన్నీ దఖలవుతాయి; ఆ అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వం విముఖత చూపిన చట్టాలను తీసుకువస్తారు. రాజ్యాంగానికి న్యాయస్థానం ఇచ్చిన ఈ సరికొత్త భాష్యాన్ని మోదీ ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందో సులువుగా ఊహించవచ్చు. మూడు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు శాసనసభ తమకు పంపించిన బిల్లులను ఆమోదించలేదు. తమిళనాడులో అయితే, రెండోసారి పంపిన బిల్లులను సైతం ఆమోదించేందుకు గవర్నర్ రాజ్యాంగ నిర్దేశాలకు విరుద్ధంగా ససేమిరా అంటున్నారు. అంతకు ముందు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను అరెస్ట్ చేసి, విచారణకు ఢిల్లీకి తీసుకువచ్చేందుకై 40 మంది సీబీఐ అధికారులను పంపారు. ఢిల్లీలో సైతం కేంద్రం ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి, చార్జిషీటు కూడా దాఖలు చేయకుండా పది నెలలుగా నిర్బంధించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌నే అరెస్ట్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇవన్నీ భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, ఆయన సహచర న్యాయమూర్తుల కళ్ల ముందే జరుగుతున్నాయి. ఇప్పుడు, అధికరణ 370 రద్దుపై వెలువడిన తీర్పు అందించిన స్వేచ్ఛతో ప్రతిపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మోదీ మరింత దూకుడుతో వ్యవహరించకుండా ఉంటారా?

చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు రెండు ఇతర సహాయక వాదనలను ముందుకు తెచ్చింది. అధికరణ 370ని ‘తాత్కాలిక, పరివర్తనీయ, ప్రత్యేక అంశాలు’ అన్న శీర్షికన గల రాజ్యాంగ 21వ భాగంలో ఉంచారన్నది మొదటి వాదన. కనుక ఆ అధికరణ శాశ్వతంగా ఉంచేందుకు ఉద్దేశించింది కాదు, మోదీ ప్రభుత్వం చేసిందల్లా కశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక ప్రతిపత్తి అధ్యాయానికి ముగింపు పలకడమే అని. ఇక రెండోవాదన: భారత్‌లో జమ్మూ–కశ్మీర్ విలీనమయిన తరువాత ఈ దశాబ్దాల కాలంలో ఆ రాష్ట్ర చట్టాలను విశాల భారతదేశ చట్టాల సరళిలోకి తీసుకువచ్చారు. ఈ దృష్ట్యా కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తికి అధికరణ 370 కల్పించిన రక్షణ ‘క్రమంగా హరించిపోయింద’ని. ‘తాత్కాలిక’ అనే పదాన్ని దానికాలం, రాజకీయ సందర్భంలో అర్థం చేసుకోవాలని గౌరవనీయ న్యాయమూర్తులకు తెలియదా?

భారత రాజ్యాంగాన్ని 1948–49లో రూపొందించారు. రాజ్యాంగసభ దాన్ని నవంబర్ 26, 1949న ఆమోదించింది. ఆ కాలంలో భారత్ ఇంకా బ్రిటిష్ కామన్వెల్త్‌లో అధినివేశ రాజ్యం. రాచరికపాలనలో ఉన్న జమ్మూ–కశ్మీర్ దీనిలో విలీనమయింది. అయితే ఆ సంస్థానంలోని ఐదింట రెండు వంతుల భూభాగాన్ని పాకిస్థాన్‌ ఆక్రమించుకుంది. ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ)కు సహకరిస్తామనే షరతుతో భారత్‌లో కశ్మీర్ విలీనాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ధ్రువీకరించింది. ప్లెబిసైట్ నిర్వహిస్తే కశ్మీరీల తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందనే భయంతోనే ఆక్రమిత ప్రాంతాలను వదులుకోవడానికి పాకిస్థాన్ ససేమిరా అంటున్నది. అప్పట్లో పాకిస్థాన్‌కు బ్రిటిష్ హై కమిషనర్‌గా ఉన్న సర్ పాట్రిక్ గ్రాఫ్టీ –స్మిత్ సైతం ఇదే విషయాన్ని, కశ్మీర్ ఆక్రమణ ప్రారంభమైన తొలిదశలోనే తమ ప్రభుత్వానికి తెలిపాడు.

కశ్మీర్‌లోని రెండు ప్రాంతాలు తిరిగి ఏకమయినప్పుడు రాజ్యాంగానికి గణనీయమైన సవరణలు చేయవలసిన అవసరముంటుందన్న విషయం రాజ్యాంగసభకు తెలుసు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిననాటికి కశ్మీర్ సరిహద్దులు అలా తాత్కాలికమైనవిగా ఉన్నాయి. ‘ఆజాద్’ కశ్మీర్‌ను ఇప్పుడు పాకిస్థాన్‌లో ఒక రాష్ట్రంగా చాలవరకు అంగీకరిస్తున్నందున కాల్పుల విరమణ రేఖే కశ్మీర్‌లో భారత్–పాకిస్థాన్ మధ్య వాస్తవ సరిహద్దుగా పరిగణింపబడుతుంది. ఈ దృష్ట్యా ‘తాత్కాలిక’ అనే పదం అర్థరహితమైపోయింది. అయినా దానికి సుప్రీంకోర్టు ఒక భిన్నమైన అర్థాన్ని ఇవ్వడం తెలివిగా మాయచేయడమే.


తన తీర్పును సమర్థించుకోవడానికి సుప్రీంకోర్టు చేసిన మరో వాదన కూడా లోపభూయిష్టమైనదే. విలీన ఒప్పందం ప్రకారం రక్షణ, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి. 1952లో జవహర్‌లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లా మధ్య కుదిరిన ‘ఢిల్లీ ఒప్పందం’తో భారత్‌తో కశ్మీర్ ఏకీకరణ ప్రారంభమయింది. ప్రభుత్వ వ్యవస్థలోని అన్ని రంగాలలోనూ ఈ ఏకీకరణ జరిగింది. ఢిల్లీ ఒప్పందం ఒక సమగ్ర ఒడంబడిక. రాష్ట్ర గవర్నర్ నియామకం, భారత పౌరులకు ఉండే సకల పౌర, ప్రాథమిక హక్కులన్నిటినీ జమ్మూకశ్మీర్‌లో నివాసముంటున్న వారందరికీ కల్పించడం, సుప్రీంకోర్టు అధికార పరిధిని అక్కడకు విస్తరించడం మొదలైనవన్నీ ఢిల్లీ ఒప్పందంలో ఉన్నాయి. విశాల భారత్‌లో కశ్మీర్ ఏకీకరణకు ఢిల్లీ ఒప్పందమే నాంది. దశాబ్దం అనంతరం 1963లో అధికరణ 370 హరించుకుపోతోందని, దాని క్రమక్షయం ప్రక్రియ కొనసాగుతూ ఉందని జవహర్‌లాల్ నెహ్రూ సైతం అన్నారు. అధికరణ 370 భారత రాజ్యాంగాన్ని జమ్ము–కశ్మీర్‌కు తీసుకువెళ్లే సొరంగమని 1964లో గుల్జారీలాల్ నందా అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1970లలో షేక్ అబ్దుల్లాను జైలు నుంచి విడుదల చేసిన అనంతరం ఆయన మళ్లీ కశ్మీర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అప్పటికే కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా చేసేందుకు 23 రాజ్యాంగ ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే 263 కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఆ రాష్ట్రానికి వర్తింపచేశారు. ఇదంతా ఆయా కాలాలలో అధికారంలో ఉన్న కశ్మీర్ ప్రభుత్వాల సమ్మతితోనే జరిగిందన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు విస్మరించింది. కశ్మీర్ రాజ్యాంగ సభ ఆమోదించిన తరువాతనే ఢిల్లీ ఒప్పందంపై షేక్ అబ్దుల్లా సంతకం చేశారు. దరిమిలా మరిన్ని అఖిల భారతచట్టాలను కశ్మీర్ ప్రభుత్వాల అనుమతితో ఆ రాష్ట్రంలో అమలుపరచడం జరిగింది. తరచు కశ్మీర్ ప్రభుత్వాల అభ్యర్థనపైనే కేంద్ర చట్టాలను ఆ రాష్ట్రానికి పొడిగించడం జరిగింది. మళ్లీ అధికారాన్ని చేపట్టకముందు ఇందిరాగాంధీ ప్రత్యేక ప్రతినిధి జి. పార్థసారథితో జరిపిన చర్చల్లో తాను కోరే విషయాలు మరేవీ లేవని కూడా షేక్ అబ్దుల్లా అన్నారు. భారత్‌తో కశ్మీర్ ఏకీకరణకు 2019లో మోదీ ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియకు, అదే లక్ష్యసాధనకోసం అంతకుముందు నెహ్రూ, ఇందిర ప్రభుత్వాలు అనుసరించిన ప్రక్రియకు చాలా తేడా ఉంది. నెహ్రూ, ఇందిర హయాంలో కశ్మీర్ ప్రభుత్వాల అంగీకారంతో అధికరణ 370 హరించుకుపోగా, 2019లో ‘పాశవిక బలం ద్వారా’ జరిగింది. ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న తేడా ఏమిటో 2019లో నెలల తరబడి జమ్ము కశ్మీర్ అంతటా అమలు జరిగిన తీవ్ర నిర్బంధం, కర్ఫ్యూలు, ఇంటర్నెట్ సహా పలు సేవల నిలిపివేత మొదలైనవి స్పష్టం చేశాయి. ఈ అవమానకరమైన, కఠినమైన తేడాను సుప్రీంకోర్టు గ్రహించకపోవడం అత్యంత విచారకరం.

ప్రేమ్ శంకర్ ఝా

సీనియర్ పాత్రికేయుడు

(ది వైర్)

Updated Date - Dec 17 , 2023 | 12:45 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising