‘అన్నమయ్య’ను ముంచింది ఎవరు?
ABN, First Publish Date - 2023-11-18T02:20:55+05:30
అన్నమయ్య డ్యామ్ కొట్టుకొనిపోయి రేపటికి రెండేళ్ళవుతోంది. ఆ ఘోరవిపత్తులో అనేకగ్రామాలు సర్వనాశనమైనాయి, ముప్పైఏడుమంది మరణించారు.
అన్నమయ్య డ్యామ్ కొట్టుకొనిపోయి రేపటికి రెండేళ్ళవుతోంది. ఆ ఘోరవిపత్తులో అనేకగ్రామాలు సర్వనాశనమైనాయి, ముప్పైఏడుమంది మరణించారు. డ్యామ్‌ని పునర్నిర్మించి, ఏడాదిలోగానే ఆయకట్టుదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తానని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. హైలెవల్ కమిటీలు, బలమైన హామీలు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి నోటినుంచి రాష్ట్రప్రజలు విన్నారు. కానీ, చివరకు అన్నమయ్య అనాధగానే మిగిలిపోయింది.
భూ బకాసురుల కారణంగా బహుదా నదీ పరివాహక ప్రాంత ప్రజలకు 2021 నవంబర్ 19వ తేదీ ఒక కాళరాత్రిగా మిగిలిపోయింది. ముందు సంవత్సరం పింఛా కొట్టుకొనిపోయి, దాని ఉధృతికి అన్నమయ్య డ్యామ్ గేట్లు మెయింటెనెన్స్ లేకపోవడంతో కొట్టుకొనిపోయింది. ఆయినప్పటికి పింఛాడ్యామ్‌కు రింగుబండ వేసి నీళ్లు నిలబెట్టారు, అన్నమయ్యకు ఆటోమేటిక్ బదులు పర్మెనెంట్ గేటు బిగించి నిలబెట్టారు. 2021 నవంబర్ 1 తేదీన మొదలైన తుపాను బలమైనదని వాతావరణ శాఖ హెచ్చరికను పట్టించుకోని అధికారులు ఎగువనుండి వస్తున్న నీటిని వచ్చినది వచ్చినట్లుగా వదలకుండా కాలయాపనచేయడంతో తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి పింఛా, ఆ తరువాత అన్నమయ్య దెబ్బతిన్నాయి. అన్నమయ్య డ్యామ్ కుప్పకూలిన ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ అప్పట్లో కేంద్ర మంత్రి షెకావత్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు ఎవరూ విస్మరించలేనివి. ఈ జలప్రళయం తరువాత, ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు తమ పర్యటనల్లో ఇండ్లు కోల్పోయిన వారికి 90 రోజులలో ఇండ్లు నిర్మిస్తామని, మేట వేసిన భూములలో ఇసుకను ప్రభుత్వమే కొంటుందని పలు హామీలు గుప్పించారు. నేటికీ ఇండ్లు నిర్మించలేదు, పంటనష్టం, పశునష్టం మీద సమగ్ర సర్వే చెయ్యకుండా నామమాత్ర పరిహారంతో సరిపెట్టారు. జరిగిన దారుణంపై సమగ్ర విచారణ జరిపితే తప్పిదాలు బయటపడతాయని ప్రభుత్వంలోని పెద్దలు కాలయాపన చేస్తున్నారు. డ్యామ్ కొట్టుకుపోయిన కారణంగాను, వెంటాడుతున్న కరువువల్లా పింఛా, అన్నమయ్య దిగువ ప్రాంత మండలాల్లో రైతులు సాగు నిలిపివేసే పరిస్థితి దాపురించింది. అన్నమయ్య ప్రాజెక్టుకు 468 కోట్లుగా వేసిన అంచనాలను ఇప్పుడు మళ్ళీ 775 కోట్లకు పెంచారు. డాంబికాలు తప్ప ఇంతకాలం ఆచరణలో ఏమీ చేయకుండా, ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో మళ్ళీ డ్యామ్ గురించి మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారు?
– నాగోతు రమేశ్ నాయుడు
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి
Updated Date - 2023-11-18T02:20:56+05:30 IST