A waning craze for Chinese tapas : చైనా టపాసులపై తగ్గిన మోజు
ABN, First Publish Date - 2023-11-10T02:16:15+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానిక వస్తువులే కొనండి) నినాదం బాగానే పనిచేస్తోంది. నిన్నమొన్నటి వరకు చౌకగా వస్తున్నాయని దేశ ప్రజలు దీపావళికి కూడా చైనా టపాసులు...
రూ.లక్ష కోట్లు నష్టపోనున్న డ్రాగన్.. స్థానిక వస్తువులకే గిరాకీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానిక వస్తువులే కొనండి) నినాదం బాగానే పనిచేస్తోంది. నిన్నమొన్నటి వరకు చౌకగా వస్తున్నాయని దేశ ప్రజలు దీపావళికి కూడా చైనా టపాసులు ఎడాపెడా కొనేవారు. అవి వెదజల్లే కాలుష్యాన్ని, రసాయనాల్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. నియంత్రణ లేకపోవడంతో చైనా కూడా తన టపాసుల్ని భారత మార్కెట్లోకి చౌకగా కుమ్మరించేంది. దీంతో ఒక దశలో శివకాశి వంటి బాణసంచా తయారీ కేంద్రాల్లో దుకాణాలు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గల్వాన్‌తో సీన్ రివర్స్: గల్వాన్ ఘర్షణతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరిహద్దుల్లో మనపై కాలుదువ్వుతూ మన భూభాగాల్ని కబ్జా చేస్తున్న చైనా వస్తువులు ఎందుకు కొనాలనే స్పృహ ప్రజల్లో పెరిగింది. ఇదే సమయంలో చైనా యాప్స్‌పై ప్రభుత్వం విధించిన నిషేధమూ మధ్య తరగతి యువతను ఆలోచించేలా చేసింది. ఇప్పుడు ఈ ప్రభావం చైనా నుంచి దిగుమతయ్యే బాణా సంచాపైనా పడింది. ఎంత చౌకగా వచ్చినా చైనా బాణా సంచా కొనేందుకు జనం పెద్దగా ఇష్టపడడం లేదు. దీంతో ఈ సంవత్సరం దీపావళికి మన దేశం నుంచి చైనా రూ.లక్ష కోట్ల వ్యాపారం నష్టపోతుందని ఒక అంచనా.
వ్యాపారులూ వ్యతిరేకమే: స్థానిక వ్యాపార సంఘాలూ చైనా బాణా సంచాకు వ్యతిరేకంగా నోరు విప్పుతున్నాయి. బాణా సంచా మొదలుకొని, దీపావళి ప్రమిదల వరకు స్థానికంగా తయారైనవే కొనమని ప్రచారం మొదలుపెట్టాయి. స్థానికంగా తయారైన బాణా సంచా, ప్రమిదలు కొంటే స్థానిక పరిశ్రమలు, మహిళా స్వయం సహాయ గ్రూప్ (డ్వాక్రా)లకు చేయూత ఇచ్చినట్టవుతుందని ప్రచారం చేశాయి. దీంతో ఈ సంవత్సరం దీపావళికి నగరాల్లోని ప్రధాన రోడ్లలోనూ వ్యాపారులు స్థానికంగా తయారైన బాణా సంచా, ప్రమిదలే అమ్ముతున్నారు. మొత్తం మీద వోకల్ ఫర్ లోకల్ నినాదం, ఆత్మ నిర్భర్ భారత్.. చైనా టపాసుల దిగుమతులకు బాగానే చెక్ పెట్టాయి.
Updated Date - 2023-11-11T13:12:17+05:30 IST