YS Jagan : వాయిదాల ‘దీవెన’
ABN, Publish Date - Dec 17 , 2023 | 04:52 AM
జగనన్న విద్యాదీవెన వాయిదాల దీవెనగా మారిపోయింది. సకాలంలో విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా వైసీపీ సర్కారు నిలువునా ముంచేసింది.
నవంబరు 28న వేయాల్సిన
విద్యాదీవెన నాలుగో విడత
బటన్ నొక్కుడు 4 సార్లు వాయిదా
గతేడు ఫీజులకూ లభించని మోక్షం
అప్పులు చేసి చెల్లించిన తల్లిదండ్రులు
విద్యార్థులను ముంచిన ప్రభుత్వం
వైసీపీ సర్కార్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా కళాశాలలకు చెల్లించకుండా తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయించింది. తమ పిల్లల ఫీజును జగన్ చెల్లిస్తున్నారన్న కృతజ్ఞతతో ప్రజలు ఓటు వేస్తారని వైసీపీ భావించింది. ఫీజు సకాలంలో చెల్లిస్తే ఆ లక్ష్యం నెరవేరేదేమో?.. కానీ, బకాయిలు పెట్టడంతో ఒత్తిడి పెరిగి ప్రభుత్వంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సవ్యంగా సాగుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లేనిపోని ప్రయోగాలు చేసి తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల ఒత్తిడితో తాము అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది ఫీజులకూ ఇంకా లభించని మోక్షం
బకాయి చెల్లిస్తేనే పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతి
విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాల అల్టిమేటం
అప్పులు చేసి కాలేజీలకు చెల్లించిన తల్లిదండ్రులు
వసతి దీవెన కూడా ఏటా ఒక విడత ఎగవేతే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగనన్న విద్యాదీవెన వాయిదాల దీవెనగా మారిపోయింది. సకాలంలో విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా వైసీపీ సర్కారు నిలువునా ముంచేసింది. ప్రతి దఫా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తల్లుల ఖాతాల్లో వేయడం తీవ్ర జాప్యమవుతోంది. గతేడాది చివరి విడత చెల్లించాల్సిన ఫీజును ఇంకా జమ చేయకపోవడంతో విదార్థులు గగ్గోలు పెడుతున్నారు. నవంబరు 28న బటన్ నొక్కుతానన్న జగన్.. దానిని డిసెంబరు 5కు వాయిదా వేశారు. దాన్ని మళ్లీ డిసెంబరు 12కు, ఆ తర్వాత డిసెంబరు 19కి వాయిదా వేశారు. ఇప్పుడు 19న కూడా జరిగేట్లు లేదంటున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకనే వాయిదాలు వేస్తున్నారని, ప్రక్రియను ఆలస్యం చేసేందుకే తల్లితో విద్యార్థి జాయింట్ అకౌంట్ తీసుకోవాలని మెలిక పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సజావుగా సాగుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని జగన్ సర్కారు అస్తవ్యస్తంగా మార్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాదికి సంబంధించిన ఫీజులు సైతం చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతించడం లేదు. దీంతో అప్పులు చేసి కళాశాలలకు ఫీజులు చెల్లించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.
రీయింబర్స్‌మెంట్‌పై ప్రయోగం..
గతంలో కళాశాలల ఖాతాల్లోనే ప్రభుత్వం నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేది. వైసీపీ సర్కార్ వచ్చాక తల్లుల ఖాతాల్లో వేస్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. విద్యార్థి చెల్లించాల్సిన ఫీజును ఏడాదికి నాలుగు విడతలుగా విభజించారు. ప్రతి విడత తల్లి ఖాతాలో ప్రభుత్వం వేసే ఫీజును కళాశాలకు తీసుకెళ్లి చెల్లించాలి. ప్రభుత్వం ఏ విడత అయినా జమచేయకపోతే, తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి కచ్చితంగా కళాశాలలకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. జగన్ సర్కార్ గత నాలుగేళ్లలో నాలుగు విడతల ఫీజును తల్లుల ఖాతాల్లో జమచేయలేదు. దీంతో ఆ భారం తల్లిదండ్రులపై పడింది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు సైతం ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే అనుమతిస్తామని కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెబుతుండటంతో తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి కళాశాలల్లో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ప్రయోగం చేసి పేద విద్యార్థుల జీవితాలతో సర్కారు ఆడుకుంటోంది.
బకాయిలు చెల్లిస్తేనే పరీక్ష ఫీజు చెల్లించండి..
విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే గతేడాది వరకు ఫీజు బకాయిలు లేకుండా చెల్లించాల్సిందేనని ఇంజనీరింగ్ కళాశాలలు అల్టిమేటం ఇచ్చాయి. కళాశాలలు ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు ఫీజు చెల్లించే గడువు నవంబరు 10వ తేదీగా ఖరారు చేయడంతో థర్డ్ ఇయర్‌లో ఉన్న ఒక విడత బకాయితో పాటు ఫస్ట్ ఇయర్‌లో ప్రభుత్వం చెల్లించకుండా నిలిపేసిన ఒక విడత ఫీజు రీయింబర్స్‌మెంట్ కలిపి తల్లిదండ్రులు చెల్లించాల్సి వచ్చింది. గత సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కళాశాలల ను ఇబ్బందులు పెట్టినా..విద్యార్థుల ను ఇబ్బందులకు గురిచేయలేదని, ఈ సర్కార్ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్సు పూర్తయినా పడని ఫీజులు...
నాలుగేళ్లలో నాలుగు విడతల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుండటంతో ముఖ్యంగా ఫైనలియర్ విద్యార్థులు కచ్చితంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వారికి కోర్సు పూర్తయి ఈ ఏడాది మే నెలలో బయటకు వెళ్లే సమయానికి రెండు విడతల ఫీజు బకాయిలున్నాయి. వాటిలో ఒక విడత విడుదల చేసిన సర్కార్ మరో విడతను వాయిదాలు వేస్తూనే ఉంది. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు దగ్గరపడ్డాయి. ఈ సెమిస్టర్ నాటికి రెండు విడతలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉండగా ఒక్కటి కూడా జమచేయలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వారికి కోర్సు పూర్తవుతుంది. అప్పటికి మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పుడు బటన్ నొక్కినా.. అది గతేడాది బకాయికి సంబంధించినది అవుతుంది కనుక ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిస్థితి ఏంటన్న ఆందోళన విద్యార్థుల్లో ఏర్పడింది. ఈ ఏడాది మిగిలిన మూడు విడతలు, గతంలో బకాయి పెట్టిన ఒక విడత కలిపి ఒక ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తల్లిదండ్రులే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా మార్చిలో ఎన్నికల హడావుడితో అసలు ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారాన్ని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. దీనివల్ల తమ పరిస్థితి మరింత జటిలమవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - Dec 17 , 2023 | 04:53 AM