శీతాకాల సెగ
ABN, First Publish Date - 2023-12-03T03:18:09+05:30
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
రేపటి నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు!
న్యూఢిల్లీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం మొదలై ఈ నెల 22 వరకు కొనసాగే సమావేశాల్లో న్యాయశిక్షాస్మృతికి సంబంధించిన మూడు కీలక బిల్లులతో పాటు మొత్తం 19 బిల్లులను ప్రవేశపెట్టి తమ ఎజెండాను పూర్తి చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధపడుతుండగా, అనేక అంశాలపై సర్కారును నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నాయి. ‘ప్రశ్నలకు డబ్బులు’ వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేసిన ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంటు సమావేశాల తొలి రోజే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జమ్ముకశ్మీర్ లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నాలుగు బిల్లులను సిద్ధం చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పాత్ర లేకుండా ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు మీద కూడా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆదివారం వెలువడే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా పార్లమెంటు సమావేశాలపై ప్రభావం చూపనున్నాయి. ఈ ఫలితాలు కాంగ్రె్‌సకు అనుకూలంగా ఉంటే ఉభయ సభల్లో వివిధ అంశాలపై సర్కారు మీద కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో దాడికి దిగే అవకాశం ఉంది.
Updated Date - 2023-12-03T03:18:10+05:30 IST