ఆ ఐదు లక్షలు ఏమయ్యాయి..?
ABN, Publish Date - Dec 14 , 2023 | 11:18 PM
గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ చేసి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు గోపాల మిత్రల ద్వారా పాల సేకరణ చేసి ఉపాధి కల్పించేందుకు గత 14 ఏళ్ల క్రితం సుమారు కోటిన్నర రూపాయలకు పైగా వ్యయంతో డీఆర్‌డీఏ నిధులతో నిర్మించిన గోదావరి పాల శీతలీకరణ కేంద్రం శిథిలావస్థకు చేరి నిరుపయోగం మారింది.
ఏళ్లు గడుస్తున్నా తేలని వైనం
పోలవరంలో నిరుపయోగంగా ప్రభుత్వ పాల శీతలీకరణ కేంద్రం
కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, పాల క్యాన్లు, యంత్ర సామగ్రి మాయం
పోలవరం, డిసెంబరు 14 : గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ చేసి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు గోపాల మిత్రల ద్వారా పాల సేకరణ చేసి ఉపాధి కల్పించేందుకు గత 14 ఏళ్ల క్రితం సుమారు కోటిన్నర రూపాయలకు పైగా వ్యయంతో డీఆర్‌డీఏ నిధులతో నిర్మించిన గోదావరి పాల శీతలీకరణ కేంద్రం శిథిలావస్థకు చేరి నిరుపయోగం మారింది. డెయిరీలో ఉండాల్సిన కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, పాల క్యాన్లు, ఇతర యంత్ర సామగ్రి ఏమయ్యాయో తెలియని పరిస్థితి. గతంలో ఈ డెయిరీ డ్వాక్రా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడేది. ఒక ఏడాది గడిచిన తర్వాత డెయిరీ నిర్వహణకు సంబంధించిన లక్షలాది రూపాయలు పక్కదారి పట్టడంతో మూతపడింది. కొంత మంది గోపాలమిత్రలకు పాల బకాయిలు చెల్లించకపోవడంతో వారికి డీఆర్‌డీఏ ద్వారా పంపిణీ చేసిన ఇన్వర్టర్లు, పాల నాణ్యతా పరిశీలన పరికరాలు వారి వద్దనే పెట్టుకుని వారే పాల సేకరణ చేసి ప్రైవేటు పాల సేకరణ కేంద్రాలకు అమ్ముకుంటున్నారు. పాల కేంద్రానికి డీఆర్‌డీఏ అందించిన నిధులు అప్పట్లో డీఆర్పీగా పని చేసిన ఉద్యోగిని సహకారంతో కొందరు డ్వాక్రా మహిళా సంఘాల నాయకులు బినామీ పేర్లతో పక్కదోవ పట్టించినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. ఐదు లక్షల రూపాయల నిధులు పాలశీత లీకరణ కేంద్రానికి ఏ సంబంధం లేని వ్యక్తి స్టేట్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేంద్రంలో ఉండాల్సిన సామగ్రి మాయం కావడం, డెయిరీలో ప్రస్తుతం ఉన్న విలువైన జనరేటర్, ఇతర సామగ్రి శిథిలావస్థకు చేరి పనికిరాకుండా పోతున్నాయని అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని, డెయిరీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవా లని పాడి రైతులు, గోపాల మిత్రలు కోరుతున్నారు.
Updated Date - Dec 14 , 2023 | 11:18 PM