ముంచుకొస్తున్న మిచౌంగ్
ABN, First Publish Date - 2023-12-03T00:07:06+05:30
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో వాతావరణం మారింది. శనివారం ఈదురు గాలులతో పాటు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి.
ఈదురు గాలులతో నేలకొరుగుతున్న వరి చేలు
ఒబ్బిడి పనుల్లో రైతులు
అన్నదాతల్లో ఆందోళన
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో వాతావరణం మారింది. శనివారం ఈదురు గాలులతో పాటు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఈదురుగాలుల ప్రభావం పెరగడంతో పలుచోట్ల వరిచేలు నేలకొరిగాయి. వరి కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి దక్కుతుందో లేదోనన్న ఆందోళన రైతులు వ్యక్తం చేస్తున్నారు.
యలమంచిలి, డిసెంబరు 2: మండలంలో 4,886 ఎకరాల్లో వరిసాగు చేయగా సుమారు వంద ఎకరాల్లో మాత్రమే కోతలు పూర్తయ్యాయి. అన్ని గ్రామాల్లో సుమారు 7 నుంచి 10 రోజుల్లో వరిచేలు కోతకు వస్తాయన్న తరుణంలో తుఫాన్ ప్రభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏవో సీహెచ్ దేవి మాట్లాడుతూ తుఫాను కారణంగా ఈనెల 5వ తేదీ వరకు రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని ఏవో సూచించారు.
గణపవరం : ఖరీఫ్‌లో 11,694 ఎకరాలు సాగు చేయగా 5,500 ఎకరాల్లో వరి కోతలు పూర్తి చేశారని తాడేపల్లిగూడెం ఏడీఏ మురళీకృష్ణ తెలిపారు. 17 శాతం నుంచి 20 శాతం వరకు తేమ ఉన్నా కేజీ నుంచి మూడు కేజీల వరకు ధాన్యాన్ని కట్ చేసుకుని మిల్లు యాజమాన్యం తీసుకుంటున్నారన్నారు.
ఆకివీడు/పాలకోడేరు : కాపవరంరోడ్‌లోని స్థానిక మాదివాడలో యంత్రాలతో వరి పంటను కోత కోయించి ఆరబెట్టుతున్న రైతులను శనివారం ఏవో ప్రియాంక కలిసి మాట్లాడారు. మండలంలో 4 వేల ఎకరాలకు 800 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన రైతులు తుఫాన్ ప్రభావం తరువాత కోతలు కోయించుకోవాలన్నారు. ప్రభుత్వం పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయించి మేలు చేయించాలని కౌలు రైతులు కోరుతున్నారు. పాలకోడేరు మండలంలో రైతులు ధాన్యం ఒబ్బిడి చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు.
భీమవరం అర్బన్/వీరవాసరం : రైతాంగం పంట నష్టపోకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. ఇప్పటికే 45 శాతం ధాన్యం మాత్రమే కళ్లాల నుంచి సురక్షితంగా తెచ్చుకోగలిగారన్నారు. ధాన్యం తడవకుండా అవసరమైన బరకాలు, టార్పలిన్‌లు సంచులు సరఫరా చేయాలని కోరారు. వీరవాసరం మండలంలో రెండు రోజులుగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. తేమ శాతం కోసం ధాన్యాన్ని రైతులు ఆరబెడుతున్నారు.
ఆచంట/పోడూరు : ఆచంట మండలంలో 400 ఎకరాల్లో మాసూళ్ళు పూర్తికాగా ధాన్యం ఎండ బెట్టే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఏఈవో బి.నాగరాజు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ ఎం.రాజ్‌కుమార్ సూచించారు. పోడూరు మండలంలో తుఫాన్ వల్ల పంట నష్టం జరగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని పోడూరు తహసీల్దార్ ఆర్‌వీ కృష్ణారావు, వ్యవసాయశాఖ అధికారి జి.సత్యనారాయణ సూచించారు. రెవె న్యూ, వ్యవసాయశాఖ సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి ఆదివారం సాయంత్రం లోపు మాసూళ్లు చేసుకుని ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవాలని సూచించారు. మండలంలో 13 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని, శనివారానికి 2356 ఎకరాల్లో పంట మాసూళ్లు జరిగి ధాన్యం ఒబ్బిడి అయిందన్నారు. 2,556 టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించినట్టు తెలిపారు. ఆర్‌ఐ కందుల రాంబాబు, వీఏఏ దారబోయిన షాలిని ఉన్నారు.
నరసాపురం రూరల్/మొగల్తూరు : ఇప్పుడిప్పుడే కోతలు మొదలై పంట చివరి దశకు చేరిన సమయంలో తుఫాన్ ఏ నష్టాన్ని మిగుల్చిపోతుందోనన్న భయం రైతుల్లో నెలకొంది. మరోవైపు కోతలు ముమ్మరం చేశారు. ఇటు వ్యవసాయశాఖ ఏడీఈ డాక్టర్ అనిల్‌కుమారి, ఏవో శేఖర్ గ్రామాల్లో పర్యటించి రైతులకు సూచనలు అందించారు. తుఫాన్ తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా చినలంక, పీఎంలంక, తూర్పుతాళ్ళు, వేములదీవి తుఫాన్ భవనాలను సిద్ధం చేశారు. జనరేటర్, తాగునీరు, కరెంట్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. తుఫాన్ తీరం దాటే వరకు ప్రభుత్వ సిబ్బంది అంతా గ్రామాల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ వీడే వరకు నరసాపురం సబ్ కలెక్టర్ 93911 85874, తహసీల్దార్ కార్యాలయాల్లో 08812–75048 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తహసీల్దార్ ఫాజిల్ తెలిపారు. మొగల్తూరు మండలంలో సార్వా సాగు దిగుబడి వర్షానికి తడవకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏవో రహీమ్ సూచించారు. మండలంలోని వరి పొలాలు, ధాన్యం రాశులను సందర్శించారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో
ఫపెంటపాడు : తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో చిన్నియ్య అన్నారు. శుక్రవారం పెంటపాడు, దర్శిపర్రు, రాచర్ల గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం వరికోతలు పూర్తి చేసుకున్న రైతులు ఆర్‌బీకే అధికారుల నిర్ధారణ అయిన తరువాత ఆఫ్‌లైన్ పద్ధతిలో సమీపంలోని ఏ మిల్లులోనైనా ధాన్యం అమ్మకాలు చేసుకోవచ్చునన్నారు. తహసీల్దార్ జీవీ శేషగిరి, ఏవో పార్థసారథి, ఏడీఏ మురళీకృష్ణ పాల్గొన్నారు
Updated Date - 2023-12-03T00:07:08+05:30 IST