జలకళ..వెలవెల!
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:15 AM
వైసీపీ ప్రభుత్వం ఘనంగా పథకాలు ప్రారంభించడమే తప్ప క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. సన్న, చిన్న కారు రైతులకు సాగునీటి వసతి కల్పించే నిమిత్తం మెట్ట ప్రాంతాల్లో ఉచితంగా బోర్లు ఏర్పాటు చేస్తామంటూ గొప్పగా ప్రారంభించిన వైఎస్సార్ జలకళ పథకం పూర్తిగా చతికిల పడింది.
బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్
జిల్లాలో మంజూరైన బోర్లు 4,566
డ్రిల్ చేసినవి 2,130
ఇప్పటివరకు కేవలం 135కు మోటార్ల బిగింపు
మొత్తం వ్యయం రూ. 56.96 కోట్లు
ఏలూరు సిటీ, డిసెంబరు 16 :
వైసీపీ ప్రభుత్వం ఘనంగా పథకాలు ప్రారంభించడమే తప్ప క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. సన్న, చిన్న కారు రైతులకు సాగునీటి వసతి కల్పించే నిమిత్తం మెట్ట ప్రాంతాల్లో ఉచితంగా బోర్లు ఏర్పాటు చేస్తామంటూ గొప్పగా ప్రారంభించిన వైఎస్సార్ జలకళ పథకం పూర్తిగా చతికిల పడింది. తమ పొలాల్లో బోరు వచ్చి సాగు నీళ్లకు కరువు ఉండదని ఆశ పడిన రైతులకు అడియాసే మిగిలింది. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని జలసిరి పేరిట నిర్వహించగా , కొన్ని మార్గదర్శకాలు మార్పుచేసి సన్న, చిన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు వేసి ఉచితంగా విద్యుత్ సర్వీసులు ఇవ్వడానికి నవరత్నాలు పథకంలో భాగంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని 2021లో ప్రారం భించారు. అయితే దరఖాస్తు చేసుకున్నా బోర్లు వేయ డంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి నిధుల కొరతతో ఈ పథకం ముందుకు సాగడం లేదు. జిల్లాలో 27 మండలాలు ఉండగా 20 మండలాల్లో ఈ పథకం అమలుకు చర్యలు తీసుకున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో బోర్లు వేయడంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. 2.5 ఎకరాలు నుంచి ఐదు ఎకరాలు లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. ఒక్క రైతుకు కనీసం 2.5 ఎకరాలు లేకపోయినా గ్రూపుగా ఏర్పడినా బోరును ఏర్పాటు చేస్తారు. పంట పొలంలో ఉచితంగా బోరు వేసి, ఉచితంగానే విద్యుత్ కనెక్షన్ కల్పిస్తారు. జిల్లాలో ఈ ఏడాది 4,566 బోర్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,130 బోర్లకు సంబంధించి డ్రిల్లింగ్ పూర్తయింది. వీటికి సంబంధించి 460 సబ్ మెర్సిబుల్ పంపుసెట్లు మంజూరు చేయగా. 289 మోటార్లు ఇప్పటివరకు అందించారు. ఇందులో ఇప్పటి వరకు 135 మోటార్లు ఆయా బోర్లుకు బిగించినట్టు డ్వామా శాఖ నివేదికలు చెబుతున్నాయి. మొత్తం బోర్లకు సంబం ధించి రూ.56.96 కోట్లు వెచ్చించారు. కాగాడిల్లింగ్ పూర్తయిన మిగిలిన బోర్లకు ఎప్పుడు పంపుసెట్లు మంజూరవుతాయో, ఎప్పటికి మోటార్లు బిగించి సాగునీరు అందిస్తారో తెలియని పరిస్థితి.
బోర్లు వేశారు.. కనెక్షన్లు మరిచారు
గిరిజన రైతుల ఆవేదన..ఐటీడీఏ చుట్టూ ప్రదక్షిణలు
బుట్టాయగూడెం : జగనన్న జలకళ పథకంలో నూతనంగా ఏర్పాటు చేసే బోర్లతో తమ పంట పొలాలకు పుష్కలంగా సాగునీరందుతుందని తమ బతుకులు బాగుపడతాయని సంబరపడిన గిరిజన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. పొలాల్లోని బోర్లకు చెందిన కేసింగ్ పైపులను చూస్తూ గిరిజన సన్న, చిన్నకారు రైతులు నిరాశ చెందుతున్నారు. రెండేళ్లుగా బోర్ల నుంచి చుక్కనీరు వస్తే ఒట్టు. ఉచితంగా బోర్లు వేసిన అధికారులు, ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్లను అందించడంలో విఫలమైయ్యారని సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. మండలంలో గురుగుమిల్లి, కోర్సవారిగూడెం, గౌరంపేట, పెదజీడిపూడి, అలివేరు, కామవరం, గుళ్ళపూడి, ఏపులపాడు, కొమ్ముగూడెం తదితర గ్రామాల్లో 211 మంది గిరిజన రైతులకు బోర్లు వేశారు. 14 మందికి రైతులు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు తెచ్చుకోగలిగితే వారికి మోటార్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఏజెన్సీ మండలాల్లో 500 పైగా జగనన్న జలకళ పథకంలో చిన్నకారు రైతులకు వ్యవసాయ బోర్లు వేసిన ప్రభుత్వం కేవలం 45 మంది రైతులకు మాత్రమే మోటార్లు ఇచ్చిందంటే పథకం ఏ స్థాయిలో మూలన పడిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క బోరుకు రూ.30 వేల రూ.40 వేలు ఖర్చు అవ్వగా 500 బోర్లు వేసేందుకు సుమారు 10 నుంచి 20 కోట్లు రూపాయలు వ్యయం అయింది. అయితే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో బోర్లు వేసినా నిరుపయోగంగా మారాయి. పథకంలోని బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇప్పించి మోటార్లు మంజూరు చేయాలంటూ బోర్లు వేయించిన గిరిజన రైతులు ఐటీడీఏ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గతంలో టీడీపీ హయాంలో ఉండగా ఉచితంగా బోర్లు వేసి విద్యుత్ కనెక్షన్లు ఇప్పించారని, వైసీపీ ప్రభుత్వంలో ఇటువంటి పథకాలు నాయకుల జేబులు నింపుకోడానికి తప్పా గిరిజనులకు ఉపయోగపడడం లేదని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు కారం రాఘవ మండిపడ్డారు. ఐటీడీఏ ద్వారా తక్షనం విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలన్నారు.
విద్యుత్ కనెక్షన్ తెచ్చుకోవాలట..
వ్యవసాయ బోరుతో పాటు అన్ని సమకూర్చుతారని ఆశ పడ్డాం. బోర్లు వేసిన తర్వాత విద్యుత్ కనెక్షన్లు తెచ్చుకుంటే మోటార్లు ఇస్తామని చెస్పారు. విద్యుత్ కనెక్షన్లు తెచ్చుకునే స్థోమత ఉంటే సొంతంగానే బోరు, మోటారు పెట్టుకునేవారమే కదా.
– పాయం మూకరాజు, గురుగుమిల్లి
కాళ్లరిగేలా తిరుగుతున్నాం..
విద్యుత్ కనెక్షన్ల కోసం ఐటీడీఏతోపాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలకు కాళ్లరిగేలా నేటికి తిరుగుతూనే ఉన్నాం. బోర్లు ఉండి కూడా విద్యుత్ కనెక్షన్లు లేక వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయాలు చేస్తూ అప్పుల పాలవుతున్నాం. జలకళలో వేసిన బోర్ల వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు.
– ముల్లు జోగరావు, గౌరంపేట
Updated Date - Dec 17 , 2023 | 12:15 AM