ఆ నాయకుడితో పని చేయించడం ఎలా?
ABN, First Publish Date - 2023-12-03T00:15:11+05:30
నరసాపురం స్టీమర్ రోడ్ ప్రధాన రహదారి. దీనిపై నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వ్యాపార సముదాయాలు ఈ మార్గంలోనే ఎక్కువ. అయితే పల్లపు ప్రాంతం కావడంతో వర్షం వస్తే ఈ రోడ్డు చెరువును తలపిస్తోంది.
ప్రభుత్వం నుంచి బిల్లులు రాక చాలా మంది కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు వెనుకాడినా.. అధికారులు వెంటబడి, వేధించి మరీ పనులు చేయించారు. కాని అధికార పార్టీ నేతతో కాంట్రాక్టు పనిని పూర్తి చేయించడంలో మాత్రం చుక్కలు చూస్తున్నారు. ఎన్నికలకు కొద్ది నెలలే సమయం ఉండడంతో ఆ పార్టీ నేతకు టెన్షన్ పట్టుకుంది.
నరసాపురం, డిసెంబరు 2 : నరసాపురం స్టీమర్ రోడ్ ప్రధాన రహదారి. దీనిపై నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వ్యాపార సముదాయాలు ఈ మార్గంలోనే ఎక్కువ. అయితే పల్లపు ప్రాంతం కావడంతో వర్షం వస్తే ఈ రోడ్డు చెరువును తలపిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు మునిసిపల్ అధికారులు డ్రైనేజీని ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఇందుకు రోడ్డుకు ఇరు వైపులా వున్న ఆక్రమణలను తొలగించి డ్రెయిన్ల విస్తరణకు రూ.55 లక్షలు కేటాయించారు. ఓ వైపు డ్రెయిన్ పనులు ఇటీవల పూర్తిచేశారు. రెండో వైపు పనిని ఒక కాంట్రాక్టు పేరు మీద అధికార పార్టీ ముఖ్య నాయకుడు టెండర్ వేసి దక్కించుకున్నాడు. ఆయన పేరు మీద ఇప్పటి వరకు వైఎస్‌ఆర్ విగ్రహం నుంచి కనకదుర్గా ఆర్చ్ ఎదురుగా వున్న మెడికల్ షాపు వరకు డ్రెయిన్ పనులను పూర్తి చేశారు. ఇంకా సబ్ జైలు వరకు అంటే సుమారు 450 మీటర్ల మేర కట్టాలి. దీని అంచనా విలువ సుమారు రూ.20 లక్షలు. కోవిడ్‌కు ముందు ఈ పనిని పూర్తి చేయాలి. 40 శాతం పని పూర్తి చేసినా ఆయన పెండింగ్ పని చేయడం లేదు. దీనికి కారణం నాలుగేళ్ళల్లో నిర్మాణ మెటీరియల్ ధరలు బాగా పెరగడమే అన్న వాదనలు
వినిపిస్తున్నాయి. ఆ రేట్లతో పెండింగ్ పనిని పూర్తి చేస్తే చేతులు కాలడం ఖాయమని భావించిన ఈ నేత అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు రోడ్డు నీట మునుగుతోంది. దీనికితోడు ఇప్పటి వరకు చేపట్టిన పనులకు ప్రయోజనం లేకపోయింది. దీనిని గుర్తించిన అఽధికారులు పెండింగ్ పనిని పూర్తి చేయించాలని ఏడాది నుంచి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సంబంధింత కాంట్రాక్టర్‌కు ఇప్పటి వరకు మూడు నోటీసులు ఇచ్చారు. పని చేయకపోతే తలెత్తే ఇబ్బందుల్ని సంబంధిత కాంట్రాక్టర్ ఈ ఆధికారి పార్టీ నాయకుడి దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ పనిని పూర్తి చేయాలని కోరారు. అయినా స్పందించలేదు. దీంతో ఈ పెండింగ్ పని పూర్తవుతుందా? లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈలోపు పనిని ఎలాగైనా పూర్తి చేయించాలని మునిసిపల్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మునిసిపల్ ఏఈ సునీల్ వివరిస్తూ ఇప్పటి వరకు మూడుసార్లు నోటీసులు ఇచ్చాం. పెండింగ్ పని పూర్తి చేయమని ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఈ నెలాఖరులోపు డ్రైయిన్ పనులు మొదలుపెట్టిస్తాం అని చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-12-03T00:15:12+05:30 IST