Volunteers : వలంటీర్ల వంతు
ABN, Publish Date - Dec 26 , 2023 | 02:41 AM
పూర్తిగా నిరాదరణకు గురవుతున్నామన్న ఆగ్రహంతో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రమంతా కదం తొక్కుతున్నారు.
అంగన్వాడీల దారిలోనే ఉద్యమం
ఈ నెల 29 నుంచి సమ్మె సైరన్ !
ఉద్యమాంధ్ర
రాష్ట్రమంతా ఆశాల ర్యాలీలు
నేడు నిరసనలు ఉధృతం
మండల కేంద్రాల్లో
పెద్దఎత్తున ర్యాలీలు..
పింఛన్ల పంపిణీ నిలిపివేత యోచన
ప్రశంసలు తప్పిస్తే పైసా లబ్ధి లేదని ఆవేదన
వేతనాలు రూ.18 వేలు చేయాలని డిమాండ్
కృష్ణా, చిత్తూరులో అధికారులకు సమ్మె నోటీసు
పలుచోట్ల ఇప్పటికే మొదలైన నిరసనలు
సంఘాలు లేకపోవడంతో ఎక్కడికక్కడే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పూర్తిగా నిరాదరణకు గురవుతున్నామన్న ఆగ్రహంతో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రమంతా కదం తొక్కుతున్నారు. ఆశా కార్యకర్తలు మంగళవారం నుంచి ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. జగన్ నోటివెంట పదేపదే ప్రశంసలు అందుకుంటున్న వలంటీర్లు కూడా వేతనాల పెంపు కోరుతూ సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 29 నుంచి సమ్మెలోకి వెళ్లి... పెన్షన్ల పంపిణీలో పాలుపంచుకోరాదని గట్టి పట్టుదలతో ఉన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వలంటీరు వ్యవస్థలో ఎక్కువభాగం అధికార పార్టీ కార్యకర్తలే ఉన్నారు. ఈ విషయం పలు వేదికలపై వైసీపీ నాయకులు బహిరంగంగా సెలవిచ్చారు కూడా. అయినా, వలంటీర్లు సైతం ఇప్పుడు ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉండటం, వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో ఆందోళనలకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చాకిరీ చేయిస్తుందే తప్ప తమ సంక్షేమ పట్టించుకోవడం లేదని చాలామంది వలంటీర్లు వాపోతున్నారు. నవరత్నాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే తమకు సంక్షేమం లేదని వాపోతున్నారు. అధికార పార్టీ పనుల కోసం కూలీల్లాగా తమను వాడుకుంటున్న సర్కారు, కేవలం మాటల ఆదరింపులు తప్ప తమ కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనాలూ కల్పించడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కృష్ణా జిల్లా గుడివాడలో పలువురు వలంటీర్లు అల్టిమేటం ఇచ్చారు. వలంటీర్లకు సంఘాలు లేకపోవడంతో ఎక్కడిక క్కడ ఉద్యమిస్తున్నారు. కొందరు వలంటీర్లు ఎంపీడీవో ఆఫీసు వద్దకు, మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లి తమ డిమాండ్లు వినిపిస్తున్నారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆళ్లమడుగు సచివాలయం పరిధిలో పనిచేసే వలంటీర్లు సమ్మె నోటీసు ఇచ్చారు.
నమ్మించారు..మొహం చాటేస్తున్నారు...
సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పార్టీ కోసం విస్తృతంగా తమను వాడుకున్నారని, ప్రభుత్వంలో భాగస్వాముల్ని చేస్తామని నమ్మించి, వంచించారన్న భావన వలంటీర్లలో బలపడుతోంది. పేరుకు అధికారపార్టీలో ప్రభుత్వ పథకంలో పనిచేస్తున్నామే తప్ప ప్రతి నెలా అప్పులు తెచ్చుకుని కుటుంబాలు నిర్వహించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పావులుగా వాడుకునేందుకు అడ్డమైన చాకిరీ చేయించుకుని గౌరవవేతనం అందిస్తున్నారని, ఉన్నత చదువులు చదువుకున్న తాము ఎందుకూ పనికిరాకుండా పోయామని పేర్కొంటున్నారు. ప్రారంభంలో వలంటీర్లు అంటే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ వాళ్ల ఆధ్వర్యంలో నడుస్తాయనే భ్రమలు కల్పించారని, ఇప్పుడు అన్నీ డీబీటీ ద్వారా అందుతుండటంతో వలంటీర్ల పరిస్థితి పోస్టుమ్యాన్ మాదిరిగా తయారైందని పేర్కొంటున్నారు. యువతను ఎంచుకుని వారికి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించినప్పుడు వారి భవిష్యత్తు ఏమవుతుందనే విషయం ప్రభుత్వం ఆలోచన చేయలేదని, ప్రభుత్వం మారిపోతే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు.
అసంఘటితంగానే...
వలంటీర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా యూనియన్లు లేవు. అందులో 80 శాతం మంది వైసీపీ కార్యకర్తలే కావడంతో వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం రాలేదు. వలంటీర్లకు సంబంధించి ముఖ్యమంత్రినే నిర్ణయం తీసుకోవాలి. ఏటా ఉగాది పురస్కారాలు అందిస్తున్న సర్కారు, ఈ దఫా అవి కూడా వాయిదా వేసి సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. గ్రామాల్లోను, వార్డుల్లోను తమ సొంత పనులు చేసుకుంటూ పార్ట్‌టైం జాబ్ మాదిరి చేస్తామనుకుంటే, పని పెరిగి పుల్‌టైం జాబ్ అయిందని వలంటీర్లు వాపోతున్నారు. ఇటీవల మొబైల్ రేషన్ వాహనాల వెంబడి వలంటీర్లును వెళ్లాలని కొత్తగా బాధ్యతలు పెట్టారు. దీనికోసం అదనంగా రూ.750 వేతనం ప్రకటించారు. వైసీపీ కోసం పుల్‌టైం చేస్తున్న తమకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని పేర్కొంటున్నారు. వలంటీర్లకు యూనియన్లు లేకపోవడంతో ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. అయితే, తాము ఏమీ చేయలేమని, ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వలంటీర్లు వాట్సాప్ గ్రూపుల్లో సంఘటితమై సమ్మెకు సిద్దమవుతున్నారు.
‘‘ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రతిపనీ మాతోనే చేయించారు. జగన్ ప్లెక్సీలు కట్టేందుకు మమ్మల్ని వాడుకున్నారు. గ్రామాల్లో వైసీపీకి అన్నిరకాలుగా సహకరించాల్సిన తప్పని పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ అయ్యాం. ప్రతిసారీ సీఎం మమ్మల్ని ప్రశంసిస్తారు. కానీ, కింది స్థాయి వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఛీత్కరిస్తున్నారు. మా ఉనికే వారిఇ నచ్చడం లేదు. దీంతో మా సమస్యలేవీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. సీఎం వద్ద కనీసంగా కూడా ప్రస్తావించడం లేదు’’
- వలంటీర్ల మనోభావం
ఇవీ డిమాండ్లు..
వలంటీర్లను స్వచ్ఛంద సేవకులుగా కాదు.. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆప్కో్‌సలో నమోదు చేయాలి.
సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
వలంటీర్లకు గౌరవ వేతనం రూ. ఐదు వేలు ఇస్తున్నారు. దానిని రూ.18 వేలకు పెంచాలి.
అర్హతలను బట్టి సచివాలయ వ్యవస్థలో వలంటీర్లను విలీనం చేసి క్రమబద్ధీకరించాలి.
ఎన్నికల ముందైతేనే సఫలం...
ముఖ్యమంత్రి జగన్ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల ముందు పలు పథకాలకు సంబంధించి బటన్ నొక్కుడు ఉధృతం చేయనున్నారని, ఈ నేపధ్యంలో ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను బలంగా వినిపిస్తే సాధించుకోవచ్చన్న యోచనలో పలు జిల్లాల్లో వలంటీర్లు ఉన్నారు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ వలంటీర్ల ద్వారానే చేపడుతున్నారు. సమ్మె తొలిదశలో పెన్షన్లు పంపిణీ నిలిపివేయాలని భావిస్తున్నారు. కొన్ని చోట్ల ఓటర్ల జాబితాలకు సంబంధించి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. దీంతో ఇటీవల కొంతమంది వలంటీర్లు ప్రభుత్వానికి సహకరించడం లేదంటూ స్థానిక వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పలువురు వలంటీర్లను తొలగించి వారి స్థానంలో కొత్తగా పార్టీ కార్యకర్తలను నియమించుకున్నారు. ఈ పరిణామం పలు చోట్ల వలంటీర్లకు ఆగ్రహం కలిగించింది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం పట్ల గుర్రుమంటున్నారు. ఇప్పుడు వలంటీర్లు కూడా సహాయ నిరాకరణ చేపడితే ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేసినట్లవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 03:44 AM