ఈ ఇక్కట్లు తప్పేదెప్పుడు?
ABN, First Publish Date - 2023-11-06T23:47:01+05:30
ఇది భామిని బస్టాప్ వద్ద పరిస్థితి.. రోజూ ఇలానే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సమయానికి బస్సులు రాకపోవడం.. ఆ రూట్‌లో పూర్తిస్థాయిలో సర్వీసులు నడపకపోవడంతో వారికి ఇక్కట్లు తప్పడం లేదు.
ఇది భామిని బస్టాప్ వద్ద పరిస్థితి.. రోజూ ఇలానే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సమయానికి బస్సులు రాకపోవడం.. ఆ రూట్‌లో పూర్తిస్థాయిలో సర్వీసులు నడపకపోవడంతో వారికి ఇక్కట్లు తప్పడం లేదు. గతేడాది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నడిపిన బస్సును ఈ ఏడాది తొలగించారు. దీంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. శీతాకాలం కావడం.. సాయంత్రం ఐదున్నర గంటలకే చీకటి పడడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా మండల కేంద్రానికి ఆదర్శ, జడ్పీ పాఠశాలలు, జూనియర్ కళాశాలకు చెందిన సుమారు 800 మంది వస్తుంటారు. వారంతా సాయంత్రం నాలుగు గంటల నుంచి బస్టాప్‌కు చేరుకుంటారు. అయితే ఆ సమయంలో బస్సులు రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు వారు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక బస్సు రాగా పోటీపడి ఎక్కారు. ఫుట్‌పాత్‌పై నిల్చొని ప్రమాదకర స్థితిలో ప్రయాణం చేశారు. ఇంకొందరు తర్వాత బస్సు కోసం వేచి చూడగా, మరికొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి స్వగ్రామాలకు చేరుకున్నారు. నిత్యం ఈ అవస్థలు పడుతున్నా.. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పాలకొండ, శ్రీకాకుళం ఆర్టీసీ డిపోల అధికారులు స్పందించి శ్రీకాకుళం-బత్తిలి రూట్‌లో ప్రత్యేకంగా బస్సు నడపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
- భామిని
Updated Date - 2023-11-06T23:47:02+05:30 IST