చల్లని తల్లికి నేడు తొలేళ్లు
ABN, First Publish Date - 2023-10-30T01:45:51+05:30
పైడిమాంబ సిరిమానోత్సవానికి సమయం ఆసన్నమవుతోంది. సిరిమాను తయారీ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పండుగ రోజుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడికి ఆదివారం విశేషంగా భక్తులు తరలివచ్చారు.
చల్లని తల్లికి నేడు తొలేళ్లు
పట్టువస్త్రాలు సమర్పించనున్న పూసపాటి వంశీయులు
(విజయనగరం రూరల్)
పైడిమాంబ సిరిమానోత్సవానికి సమయం ఆసన్నమవుతోంది. సిరిమాను తయారీ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పండుగ రోజుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడికి ఆదివారం విశేషంగా భక్తులు తరలివచ్చారు. సిరిమానోత్సవానికి ముందు జరిగే తొలేళ్ల ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ నదుల నుంచి తెప్పించిన జలాలతో పైడిమాంబకు ఆదివారం జలాభిషేకం నిర్వహించారు. అనంతరం సోమవారం జరిగే తొలేళ్ల ఉత్సవానికి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 3.30 గంటలకు సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నారు. వీఐపీ పాస్‌లు తీసేసిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో ప్రత్యేక దర్శనానికి కేటాయించిన టిక్కెట్లు విక్రయించారు. పూసపాటి వంశీయులు తొలేళ్ల రోజున పైడిమాంబకు పట్టువస్త్రాలు, సారె సమర్పించనున్నారు. కేంద్రమాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు సోమవారం ఉదయం 7.30 గంటలకు కుటుంబ సమేతంగా రానున్నారు. ఏర్పాట్లను ఉత్సవ ప్రత్యేకాధికారి సురేష్‌తో పాటు దేవస్థానం ఈవో సుధారాణి పర్యవేక్షిస్తున్నారు. తొలేళ్ల ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రాత్రి ఎనిమిది గంటలకు పూజారి బంటుపల్లి వెంకటరావు పూజలు నిర్వహించిన అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తారు. వాటిని ఆనందంగా స్వీకరించి తమ, తమ పొలాల్లో జల్లుకుంటారు. అమ్మవారి ఆశీస్సులతో ఇచ్చేవి కనుక ఎటువంటి చీడపీడలు దరిచేరవని రైతుల విశ్వాసం. తొలేళ్ల ఉత్సవంలో పులివేశాలది అగ్రస్థానం. సోమవారం రాత్రికి సందడి చేయనున్నాయి. కొన్నేళ్లుగా పులివేషదారులకు పోటీలను కూడా కోట ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. పైడిమాంబను ఆదివారం ఎస్పీ దీపిక దర్శించుకున్నారు.
నగరంలో కళావైభవం
విజయనగరం రూరల్ : విజయనగరం కళలకు కాణాచి.. సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతోంది. ఎంతో మంది కళాకారులు నడియాడిన విజయనగరంలో కళలకు, కళాకారులకు కొదవే లేదు.. అలాగే ఏడాది పొడవునా ఏదో చోట కళా ప్రదర్శనలు జరుగుతుంటాయి. అక్టోబరు నెలలో అయితే కళావైభ వమే.. పైడిమాంబ ఉత్సవాలు.. మరోవైపు విజయనగరం ఉత్సవాలు.. ఈ రెండింటిలో కూడా కళాకారులకు తమ, తమ కళా ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం కలుగుతుంది. గత ఐదు రోజులుగా చదురుగుడి, వనంగుడి వద్ద కళాప్రదర్శనలు జరుగుతున్నాయి. ఏకపాత్రాభినయాలు, సంగీత, సాహిత్య కార్యక్రమాలు, బుర్రకథలు, కూచిపూడి, భరతనాట్యం వంటి ప్రదర్శనలు జరుగుతున్నాయి. తాజాగా విజయనగరం ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో గురజాడ కళాభారతి వేదికగా ఆదివారం ఏకపాత్రాభినయం, నాటికలు, వివిధ కళారూపాలు ప్రదర్శితమయ్యాయి.
Updated Date - 2023-10-30T01:45:51+05:30 IST