ఉద్యమం ఉధృతం
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:18 AM
జిల్లాలో అంగన్‌వాడీలు కదంతొక్కారు. నిరసన స్వరం పెంచారు. మంత్రులతో జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో యూనియన్ నాయకులు బుధవారం ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు.
16వ రోజుకు సమ్మె
జిల్లాలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
(బెలగాం/సాలూరు/పాలకొండ/జియ్యమ్మవలస, డిసెంబరు27)
జిల్లాలో అంగన్‌వాడీలు కదంతొక్కారు. నిరసన స్వరం పెంచారు. మంత్రులతో జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో యూనియన్ నాయకులు బుధవారం ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీలు భారీ ర్యాలీలు చేపట్టారు. అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. గత 16 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడం తగదన్నారు. చిరుద్యోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్నారు. సీఎం జగన్‌కు తమ బాధలు, ఆకలి కేకలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని హామీ ఇచ్చి అధికాంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వెంటనే దాన్ని నెరవేర్చాలని నినదించారు. కోనసీమ జిల్లాలో నినాదాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఒక అంగన్‌వాడీ కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్‌వాడీల సంఘ నాయకులు స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ అంగన్‌వాడీలు స్థానిక సురేష్ స్కూల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇంటిని ముట్టడించారు. పనికి తగిన వేతనం ఇవ్వకపోతే ఎలా బతకాలని వారు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కనీస వేతనం అమలు చేయాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని, తమ సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి పండగ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు.
- సాలూరు పట్టణంలో అంగన్‌వాడీలు దీక్షా శిబిరం నుంచి పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయల్దేరి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఇంటికి చేరుకున్నారు. అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. అనంతరం డిప్యూటీ సీఎం పీఏ జలీల్ బేగ్‌కు వినతిపత్రం అందజేశారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాలకు చెందిన అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
- పాలకొండలో అంగన్‌వాడీలు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంటిని ముట్టడించారు. అంగన్‌వాడీ సెంటర్ తాళాలు పగలకొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జోక్యం చేసుకొని తమ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ వర్కర్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.
- జియ్యమ్మవలస మండలంలో చినమేరంగి గ్రామంలో అంగన్‌వాడీలు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఇంటిని ముట్టడించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివచ్చిన అంగన్ వాడీలు అక్కడ బైఠాయించి ధర్నా చేశారు. దాదాపు రెండు గంటల సేపు ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చొని తమ నిరసనలు తెలియజేశారు. ఆ తరువాత ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసి తమ డిమాండ్లు నెర వేర్చాలని కోరారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా గిరిజన సంఘం, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 12:18 AM