మా బతుకులపై ఇంత నిర్లక్ష్యమా?
ABN, First Publish Date - 2023-12-11T00:18:28+05:30
‘ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం. సమస్యలు పరిష్కరించరు. ఇచ్చిన హామీలు నెరవేర్చరు. అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చేలా చేయరు.
- సమస్యలు పరిష్కరించకుంటే తీవ్రంగా ఉద్యమిస్తాం
- ప్రభుత్వానికి సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల అల్టిమేటం
- ఈ నెల 20 నుంచి సమ్మెకు సన్నద్ధం
జియ్యమ్మవలస, డిసెంబరు 10: ‘ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం. సమస్యలు పరిష్కరించరు. ఇచ్చిన హామీలు నెరవేర్చరు. అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చేలా చేయరు. వెరసి మేము నిలువునా మోసపోయాం. మా బతుకులపై నిర్లక్ష్యమా?. ఇది సరైనది కాదు. అందుకే సమస్యలు పరిష్కారం, హామీల అమలు సాధనకు ఉద్యమానికి సిద్ధపడ్డాం.’ ఇదీ ప్రభుత్వ పరిపలనా తీరుపై సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల ఆగ్రహ జ్వాలలు. సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె చేసేందుకు నిర్ణయించుకున్నాం అంటూ సమ్మె నోటీసులను ఆయా మండలాల మండల విద్యాశాఖాధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఇప్పటికే అందజేసేశారు.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలో 110 మంది క్లస్టర్ రిసోర్స్‌పర్సన్లు (సీఆర్‌పీ), 15 మంది మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) కోఆర్డినేటర్లు, 15 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవో), 87 మంది పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు (పీటీఐ), 15 మంది కేర్ గివింగ్ వలంటీర్లు (సీజీవీ), 30 మంది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్‌పర్సన్ టీచర్లు (ఐఈఆర్‌టీ), 15 మంది మెసెంజర్లు, 247 మంది కేజీబీవీ సిబ్బంది సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలోనే విధులు నిర్వహిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వీరు ఆరోపిస్తున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మినిమం టైం స్కేల్‌పై జీవోలు ఇచ్చినా ఇంతవరకు అమలు కాలేదని మండిపడుతున్నారు. దీనిపైనే ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి శాసనమండలిలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చి మూడేళ్లు గడిచి పోయినా ఇంతవరకు అతీగతీలేదన్నన్నారు. కేవలం కొన్ని విభాగాల ఉద్యోగులు, కేజీబీవీ ఉపా ధ్యాయులకు అరకొర జీతాలు పెంచి చేతులు దులుపుకున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల మధ్య విబేధాలు సృష్టించి ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టడం తగదని ఆక్షేపిస్తున్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమావే వేతనం అమలు చేస్తామని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేకపోయారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు హైస్కూల్, యూపీ స్కూళ్లలో పనిచేస్తున్న ఆర్ట్, క్రాప్ట్, పీఈటీలు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆవేదన దీక్ష పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇవీ డిమాండ్లు
- సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. - అందరికీ మినిమం టైం స్కేల్, హెచ్‌ఆర్‌ఏ, డీఏ అమలు చేసి వేతనాలు పెంచాలి. - సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. - ప్రస్తుతం ఉన్న పార్ట్ టైంను రద్దు చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయాలి. -పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. - రూ.10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ కల్పిస్తూ, సామాజిక భద్రత పథకాలు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలి. - వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలి. - సీఆర్‌పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, మండల లెవెల్ అకౌంటెంట్స్, మెసెంజర్స్, ఆర్ట్స్, క్రాప్ట్, పీఈటీ పోస్టులను భర్తీ చేసి వారి నిర్దిష్ట జాబ్ చార్ట్ ఇస్తూ పనిభారం తగ్గించాలి. - వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇవ్వాలి. - ఎక్స్‌గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచాలి. - మరణించిన ఉద్యోగుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. వారికి కారుణ్య నియామకాలు చేపట్టాలి. - మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలి. - వేతనాల కోసం సంవత్సరానికి సరిపడ బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలి. ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
ఇబ్బందులు పడుతున్నాం
ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు ఆకర్షితులై ఇప్పుడు మోసపోయాం. మాకు అనేక సమస్యలు వెంటాడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యలు, ఎన్నికల ముందు హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి.
-ఎ.పోలినాయుడు, రాష్ట్ర జేఏసీ సభ్యుడు, జిల్లా జేఏసీ అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం జిల్లా
వెంటనే పరిష్కరించాలి
మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అలాగే ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేదంటే ఈ నెల 20 నుంచి మెరుపు సమ్మెకు వెనుకాడబోం.
-పీహెచ్ భానుప్రసాద్, అధ్యక్షుడు, జిల్లా ఎంఐఎస్ యూనియన్, పార్వతీపురం మన్య జిల్లా
Updated Date - 2023-12-11T00:18:30+05:30 IST