చిన్నారుల తల్లిదండ్రులతో అంగన్‌వాడీల సమావేశం
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:19 AM
అంగన్‌వాడీలంతా తమ సమస్యల సాధన కోసం గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.
బొబ్బిలి: అంగన్‌వాడీలంతా తమ సమస్యల సాధన కోసం గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం అన్ని కేంద్రాల పరిధి లో అంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నారుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. తమ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరిని వారికి వివరించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఆర్పీలతో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది సరికాదని సీఐటీయూ నేత పి.శంకరరావు తెలిపారు. మధ్యా హ్నభోజన నిర్వాహకులకు ఇప్పటికే బిల్లులు చెల్లించక నానా అవస్థలు పడుతుంటే వారిపై మరో భారాన్ని మోపడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు.
నేడు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
రామభద్రపురం: అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె ఆరో రోజుకు చేరుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదని, ఈ సమ్మెను మరింత ఉధృతం చేయడానికి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఐటీయూ జిల్లా నాయకుడు బలసా శ్రీనివాసరావు తెలిపారు. అంగన్‌వాడీ ఉద్యోగులు ఆదివారం ఇంటింటికి వెళ్లి బాలింతలు, పిల్లల తల్లుల మద్దతు కోరారు. సోమవారం బొబ్బిలి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నామని, అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెకు వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతు తెలుపుతు న్నారని, అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు
రాజాం రూరల్: అంగన్‌వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ రామూర్తినాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం కాలేపు వీధిలో బి.ఉమాకుమారి అధ్యక్షతన జరిగిన లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బలవంతంగా తాళాలు పగలగొట్టించి కేంద్రాలను తెరవడం విడ్డురంగా ఉందన్నారు. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడితే సమ్మె విరమిస్తారని విశ్వప్రయత్నాలు చేస్తుందన్నారు. అవసరమైతే లబ్ధిదారుల మద్దతు కూడగడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో రమణమ్మ, లక్ష్మమ్మ, అప్పలనరసమ్మ, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:19 AM