సమాచార వ్యవస్థను మెరుగు పర్చుకోవాలి
ABN, Publish Date - Dec 29 , 2023 | 11:57 PM
జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది సమాచార వ్యవస్థను మెరుగు పర్చుకోవాలని ఎస్పీ దీపిక అన్నారు.
- ఎన్నికల దృష్ట్యా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి
- నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ దీపిక
విజయనగరం క్రైం, డిసెంబరు 29: జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది సమాచార వ్యవస్థను మెరుగు పర్చుకోవాలని ఎస్పీ దీపిక అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా క్షేత్ర స్థాయిలో చెక్ పోస్టుల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. పేకాట, కోడి పందాలు, బెల్టు షాపులు, గంజాయి, మద్యం, సారా అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రవాణాకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. పోక్సో కేసుల్లో అధికారుల దర్యాప్తు సాక్ష్యాలు సేకరణ, సాంకేతికనైపుణ్యం ప్రాసిక్యూషన్ విచారణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చెడు నడతపై ఉన్న హిస్టరీ షీట్లను పరిశీలించి అవసరమైన వ్యక్తులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మంచి ప్రవర్తనతో జీవించే వ్యక్తులపై హిస్టరీ షీట్లు మూసివేసేందుకు ప్రతిపాదనలను సంబంధిత డీఎస్పీలకు పంపించాలన్నారు. విధి నిర్వాహణలో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని అభినందించి ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ఎస్.వెంకట్రావు, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, పి.శ్రీధర్, ఏఎస్ చక్రవర్తి, ఆర్.శ్రీనివాసరావు, విశ్వనాథ్, వరకుమార్, యూనివర్స్ న్యాయసలహాదారు పరశురామ్‌తో పాటు సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది పాలొన్నారు.
Updated Date - Dec 29 , 2023 | 11:57 PM