అక్రమ రవాణా జోరు.. ఆపేదెవరు?
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:29 AM
జిల్లా పరిధిలో 26వ నెంబరు జాతీయ రహదారి అక్రమ రవాణాకు రాజమార్గంగా మారింది. ఈ హైవే విజయనగరం జిల్లా రాజాపులోవ వద్ద 16వ నెంబరు జాతీయరహదారితో అనుసంధానమవుతుండడంతో ఒడిశా నుంచి గంజాయి, రంగురాళ్లు, ఖైనీ, గుట్కా ప్యాకెట్లు, పీడీఎస్ బియ్యం, సారా వంటివి యథేచ్ఛగా ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు తరలిపోతున్నాయి.
గంజాయి, రంగురాళ్లు, ఖైనీ, గుట్కా ప్యాకెట్లు, పీడీఎస్ బియ్యం, సారా తరలింపు
పట్టుబడుతున్నా మారని అక్రమార్కులు
కట్టడికి కానరాని పటిష్ఠ చర్యలు
(సాలూరు రూరల్, డిసెంబరు 17)
జిల్లా పరిధిలో 26వ నెంబరు జాతీయ రహదారి అక్రమ రవాణాకు రాజమార్గంగా మారింది. ఈ హైవే విజయనగరం జిల్లా రాజాపులోవ వద్ద 16వ నెంబరు జాతీయరహదారితో అనుసంధానమవుతుండడంతో ఒడిశా నుంచి గంజాయి, రంగురాళ్లు, ఖైనీ, గుట్కా ప్యాకెట్లు, పీడీఎస్ బియ్యం, సారా వంటివి యథేచ్ఛగా ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు తరలిపోతున్నాయి. వాస్తవంగా సాలూరు పరిధిలోని కొఠియా వివాదాస్పద గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం పక్కా రహదారులు నిర్మించింది. ఈ మార్గంలో పెద్దగా తనిఖీలు ఉండకపోవడంతో అక్రమార్కులు సాలూరు హైవే మీదుగా ఈ దందా కొనసాగిస్తున్నారు. ఈ రోడ్డు గుండా జిల్లా పరిధిలోని ఏవోబీ ఒడిశా నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌కు ఆటోలో దుస్తుల మూటల రూపంలో తరలిస్తున్న గంజాయిని ఇటీవల సాలూరు రూరల్ పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. ఈ దారిలో ఎప్పటికప్పుడు సాలూరు పట్టణ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకుంటున్నారు. గతంలో రెండు రోజుల వ్యవధిలో సాలూరు నుంచి రాజస్థాన్‌ను తరలించే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలోని విజయనగరం జిల్లా రామభద్రపురం జంక్షన్‌లో రంగురాళ్లను పట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తరచూ భారీగా వాటిని స్వాధీనం చేసుకుని.. నిందితులపై కేసులు నమోదు చేస్తున్నా.. అక్రమార్కుల తీరు మాత్రం మారడం లేదు.
రవాణా ఇలా..
ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నుంచి పార్వతీపురం మన్యం పరిధిలో సాలూరు, విజయనగరం జిల్లాలోని ఆండ్ర, మెంటాడ, గజపతినగరం, గంట్యాడ, ఎస్.కోట మీదుగా 26 నెంబరు జాతీయరహదారి మీదగా గంజాయి, గుట్కా వాహనాలు చేరుకుంటాయి. అయితే ఒడిశా పరిధిలోని సుంకి ఘాట్‌రోడ్డు మీదుగా వచ్చే వాహనాలకు మాత్రం పాచిపెంట మండలం పి.కోనవలస వద్ద ఉన్న ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్ద పెద్దగా తనిఖీలుండడం లేదు. సమాచారం ఉంటే తప్ప అక్కడ పోలీసులు పట్టుకోలేని పరిస్థితి ఉంది. మరోవైపు ఒడిశా రాష్ట్రం పొట్టంగి, కొఠియా వివాదాస్పద గ్రామం సాలూరు మండల పరిధిలో ఉన్న నేరేళ్లవలస, ఘాట్‌రోడ్డు గుండా సాలూరు హైవే మీదుగా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఆయా గ్రాయాల్లో ఒడిశా అధికారులు రహదారులు నిర్మించడంతో అక్రమార్కులు తమ దందాను సాఫీగా కొనసాగిస్తున్నారు. దొరికితేనే దొంగ.. లేకుంటే దొర అన్న చందంగా వారు తీరు ఉంది.
- జిల్లాలో 26 నెంబరు జాతీయ రహదారి నుంచి కోల్‌కతా-చెన్నై హైవే-16 మీదుగా కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌కు ఒడిశా రాష్ట్రం కోరాపుట్, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి గంజాయి రవాణా జరుగుతుండడం విశేషం. రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన గంజాయి ఈ ప్రాంతాలనుంచే వస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
- ఒడిశాలో కిలో గంజాయి రూ.వేయికి కొనుగోలు చేసి మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో రూ.4000కు విక్రయించడానికి ఈ మార్గాలను వాడుకుంటున్నారు.
- ఏవోబీ పరిధిలోని ఒడిశా నుంచి సాలూరు మీదుగా గంజాయి వ్యాపారులు బొబ్బిలి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి రైలులో గమ్యస్థానాలకు చేరుకుని గంజాయిని విక్రయిస్తున్నారు.
- నిషేధిత ఖైనీ, గుట్కా ప్యాకెట్లను ఒడిశా నుంచి అక్రమార్కులు దిగుమతి చేసుకుని.. ఏపీలోని పల్లె, పట్టణాల్లో వివిధ షాపులకు చేరుస్తున్నారు. హోల్‌సేల్‌గానూ వాటిని విక్రయించి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
- పీడీఎస్ బియ్యాన్ని కూడా ఏవోబీ సరిహద్దు కొఠియా రోడ్డు, పాచిపెంట మండలం కోనవలస జాతీయ రహదారి మీదుగా ఏపీ-ఒడిశాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. పలుమార్లు ఇదే మార్గంలో పోలీసులు పీడీఎస్ రైస్‌ను పట్టుకున్న సంఘట నలున్నాయి.
- ఏపీ నుంచి ఒడిశాలో సుంకి, పొట్టంగి, కుందిలి ప్రాంతాలకు ఏపీ ఐసీడీఎస్‌కు చెందిన పాలు అక్రమంగా రవాణా జరుతున్నట్టు గతంలో పొట్టంగిలో ఒడిశా మీడియా వెలుగులోకి తెచ్చింది.
- ఏదేమైనా జిల్లా మీదుగా జరిగే అక్రమ రవాణాను ఆరికట్టడానికి పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
చెక్‌పోస్టు పటిష్ఠం
పాచిపెంట మండలం పి.కోనవలసలో వద్ద ఉన్న చెక్‌పోస్టును పటిష్ఠం చేశాం. గంజాయి కేసులు అధికమతున్నాయి. ఏఎస్‌ఐతో సహా సిబ్బంది నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. దీంతో అక్రమార్కులు వేరే దారుల గుండా రవాణాకు ప్రయత్ని స్తున్నారు. అన్ని మార్గాల్లో నిఘా పెంచుతాం. పేదల బియ్యం సారా, గుట్కా, ఖైనీ ప్యాకెట్ల అక్రమ రవాణా ఆరికట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఏవోబీ సరిహద్దు ఒడిశా నుంచి ఏపీ మీదుగా తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం.
- ఎస్.ధనంజయరావు, సీఐ, సాలూరు రూరల్
Updated Date - Dec 18 , 2023 | 12:29 AM