నిర్వహణ ఎలా?
ABN, Publish Date - Dec 13 , 2023 | 11:39 PM
‘పల్లె పాలనలో సరికొత్త సంస్క రణలకు శ్రీకారం చుట్టాం. గ్రామ సచివాలయ వ్యవస్థతో దేశ చరిత్రలోనే పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నా’మని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్రామ సచివాలయాల నిర్వహణకు రూపాయి కూడా విదల్చడం లేదు.
- సచివాలయాలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం
- పంచాయతీలపై పడుతున్న భారం
- కొన్నిచోట్ల భరిస్తున్న సర్పంచ్‌లు, సిబ్బంది
కొమరాడ, డిసెంబరు 13: ‘పల్లె పాలనలో సరికొత్త సంస్క రణలకు శ్రీకారం చుట్టాం. గ్రామ సచివాలయ వ్యవస్థతో దేశ చరిత్రలోనే పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నా’మని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్రామ సచివాలయాల నిర్వహణకు రూపాయి కూడా విదల్చడం లేదు. సేవల రూపంలో వచ్చిన ఆదాయంలో కనీసం 10 శాతం కూడా విడుదల చేయడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో 312 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. గ్రామ సచివాలయాల నిర్వహణకు ప్రతీ నెల రూ.5వేలకు పైగా గ్రామ పంచా యతీలపై అదనపు భారం పడుతుంది. ఇంటి పన్నులు, భవన నిర్వాహణ ప్రణాళిక అనుమతి, స్థిరాస్తి, దుకాణాల లైసెన్సు, స్టాంపు డ్యూటీ, సీనరీజ్ రుసుం, తలసరి నిధి ద్వారా వస్తున్న సాధారణ నిధి (జనరల్ ఫండ్) ఆదాయాన్ని వినియోగిస్తున్నా సచివాలయాల నిర్వహణకు సరిపోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి పథకాలకు, విద్యుత్ బకాయిలకు పంచాయతీ తీర్మానం అనుమతి లేకుండా సర్దుబాటు చేస్తున్నారు. క్లాప్ మిత్రలు, కాపలాదారుల వేతనాలకు కొంతమేర ఇస్తున్నారు. ఆదాయ వనరులు లేని చోట కాసుల కష్టం వెంటాడుతుంది. కొన్ని చోట్ల ఆయా ప్రాంతంలో ఉన్న సర్పంచ్‌లు వ్యక్తిగత పరపతి కోసం భరిస్తున్నారు. సిబ్బంది కూడా ముందస్తుగా కొంత డబ్బును వెచ్చించవలసి వస్తుంది. అనుమతి వచ్చిన అనంతరం బిల్లులు పెట్టి తీసుకోవాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. ఇటీవల ప్రభుత్వం తరచూ పలు కార్యక్రమాలను నిర్వహించాలని చెబుతుంది. వీటికి అవసరమైన టెంట్లు, కుర్చీలు, బల్లలు, తాగునీరు, తేనీరు, భోజనాలకు నిధులు ఇస్తామని చెబుతూ కార్యక్రమం అయిన తరువాత కోత విధిస్తుంది. ఈ భారం కూడా గ్రామ పంచాయతీల నెత్తిన పడుతుంది. గ్రామ, వార్డు సచివాలయాలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రిని ప్రభుత్వం సమకూర్చింది. సచివాలయాల్లో వివిధ సేవలకు ప్రింట్లు తీయడానికి అవసరమైన స్టేషనరీకి రూ.3వేలు వరకు ఖర్చు అవుతుంది. ఇతర సామాగ్రి, స్టేషనరీ, విద్యుత్ బిల్లుల నిర్వహణకు సగటున ఒక్కొక్క పంచాయతీపై నెలకు మరో రూ.2వేల నుంచి రూ.3వేలు వరకు భారం పడుతుంది.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
సచివాలయాల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. క్షేత్రస్థాయి సమస్యలు ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
-మల్లికార్జునరావు, ఎంపీడీవో, కొమరాడ
Updated Date - Dec 13 , 2023 | 11:39 PM