రహదారిపై ఏనుగులు
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:29 AM
ఏనుగుల గుంపు రహదారిపైకి రావడంతో వాహన చోదకులు, ప్రజలు హడలిపోయారు. శనివారం కొమరాడ మండలం విక్రంపురం నుంచి డంగభద్ర వైపు రోడ్డుపైకి ఏడు ఏనుగులు వచ్చాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు.
కొమరాడ/భామిని, డిసెంబరు 30 : ఏనుగుల గుంపు రహదారిపైకి రావడంతో వాహన చోదకులు, ప్రజలు హడలిపోయారు. శనివారం కొమరాడ మండలం విక్రంపురం నుంచి డంగభద్ర వైపు రోడ్డుపైకి ఏడు ఏనుగులు వచ్చాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. గజరాజులు ఎవరిపై దాడి చేస్తాయోనని ఆందోళన చెందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని సమీప ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లోకి ఏనుగుల గుంపును తరలించారు. దీంతో ఆ రహదారి గుండా ప్రయాణాలు యథావిధిగా సాగాయి. మరోవైపు భామిని మండలం తివ్వకొండ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా ఏనుగులు సంచిస్తుండడందో కాజీపురం, మూలగూడ, సన్నాయికాలనీ, యాతంగూడ, బూర్జి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పగలంతా తోటల్లో ఉంటూ రాత్రి సమయాల్లో ఏనుగులు బయటకు రావడంతో ఆయా గ్రామస్థులు సాయంత్రం ఐదు గంటలకే ఇంటికి చేరుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Updated Date - Dec 31 , 2023 | 12:29 AM