తిరిగొచ్చాయ్!
ABN, First Publish Date - 2023-11-06T23:46:36+05:30
మండలాన్ని గజరాజులు వీడడం లేదు. గత ఐదు రోజులకు పైగా దళాయివలస, తులసిరామినాయుడువలసలో సంచరించిన ఏడు ఏనుగులు సోమవారం మళ్లీ గొట్టివలసకు చేరుకున్నాయి.
ఆందోళనలో రైతులు
గరుగుబిల్లి, నవంబరు 6 : మండలాన్ని గజరాజులు వీడడం లేదు. గత ఐదు రోజులకు పైగా దళాయివలస, తులసిరామినాయుడువలసలో సంచరించిన ఏడు ఏనుగులు సోమవారం మళ్లీ గొట్టివలసకు చేరుకున్నాయి. ఆ గ్రామంలోని కొండ దిగువ ప్రాంతంలో అవి కనిపించడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. గత పది రోజుల కిందట గొట్టివలసలో హల్‌చల్ చేసిన ఏనుగులు వరితో పాటు కాయగూరలు, గోగు పంటలు, సోలార్ పరికరాలు, మోటార్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. అయితే మళ్లీ గజరాజులు దళాయివలస నుంచి గొట్టివలసకు రావడంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు. ఉన్న పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. పొలాల్లోకి వెళ్లలేక.. ఇళ్లలో ఉండలేక తీవ్రంగా మథనపడుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తరలింపునకు చర్యలు
ఏనుగుల గుంపును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని అటవీశాఖ సెక్షన్ అధికారి మీసాల మనోజ్‌కుమార్, బీట్ అధికారి బి.కృష్ణమూర్తి సోమవారం స్థానిక విలేఖర్లకు తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపించిన చోట కవ్వింపు చర్యలకు పాల్పడరాదని కోరారు. మందుగుండు సామగ్రితో పాటు మంటలను ఏర్పాటు చేయడం వంటి వాటివి చేయరాదన్నారు.
Updated Date - 2023-11-06T23:46:38+05:30 IST