చి‘వరి’ ప్రయత్నం
ABN, First Publish Date - 2023-12-11T00:57:14+05:30
మిచౌంగ్ తుఫాన్ తెచ్చిన కష్టం నుంచి రైతులు తేరుకుంటున్నారు. తడిచిన పనలను ఆరబెడుతున్నారు. ముంపులో ఉన్న ధాన్యం కుప్పల నుంచి కంకిలను వేరు చేస్తున్నారు. ఇంకొందరు కోతలను వేగవంతం చేశారు.
చి‘వరి’ ప్రయత్నం
ముంపు నుంచి తేరుకుంటున్న రైతులు
తడిచిన పనలను ఆరబెడుతున్న వైనం
కొన్ని ప్రాంతాల్లో చురుగ్గా కోతలు
వర్షాలకు మొలకలు వచ్చి.. రంగుమారిన ధాన్యం
వాటినీ కొనుగోలు చేయాలని విన్నపం
మిచౌంగ్ తుఫాన్ తెచ్చిన కష్టం నుంచి రైతులు తేరుకుంటున్నారు. తడిచిన పనలను ఆరబెడుతున్నారు. ముంపులో ఉన్న ధాన్యం కుప్పల నుంచి కంకిలను వేరు చేస్తున్నారు. ఇంకొందరు కోతలను వేగవంతం చేశారు. ఈ ఏడాది ఏరువాక నుంచి కోతల వరకు ఎన్నో ఒడుదుడుకులకు ఓర్చి వరి సాగు చేసిన రైతులు చివరిలో వచ్చిన తుఫాన్‌కు చాలా భయపడ్డారు. కొంత నష్టపోయారు. కనీసం తిండిగింజలకైనా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఇప్పుడు తాపత్రయపడుతున్నారు. వర్షాలకు మొలకలు వచ్చి.. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
మిచౌంగ్ తుఫాన్ దాదాపు 10 రోజులకు పైగా రైతులను టెన్షన్ పెట్టింది. ఒక రోజు మబ్బులు.. మరో రోజు చిరు జల్లులతో అయోమయంలో పడేసింది. చివరి రెండు రోజులు తెరిపివ్వని వానలతో ముంచేసింది. వాతావరణ వేత్తలు హెచ్చరించినా చిరు జల్లులకే పరిమితమవుతుందని భావించారు. ఆఖరుకు ఎడతెగని వానతో పొలంలో వేసిన కుప్పలను కూడా దాదాపు ముంచింది. అదే సమయంలో తీవ్ర గాలులకు కోతకు వచ్చిన చేలు నేలవాలాయి. వాటిపై నుంచి వర్షం నీరు ప్రవహించడంతో కొన్నిచోట్ల ధాన్యం కుళ్లడం.. మొలకలు వచ్చేయడం జరిగింది. శని, ఆదివారాల్లో జిల్లాలోని ఏ ప్రాంతంలో చూసినా రైతులు తడిచిన పనలను ఆరబెడుతూ కన్పించారు. తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగించినా ఎంతో కొంత పంట చేతికి అందుతుందన్న ఆశతో రైతులు పరిశ్రమిస్తున్నారు. రంగు మారిన, మొక్కలు మొలిచిన ధాన్యాన్ని రైతులనుంచి కొనుగోలు చేస్తామని అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నారు కాని క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు మాత్రం జరగటం లేదు. చాలా చోట్ల రైతులు తడిచిన ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబెట్టి అమ్మకానికి సిద్ధం చేసుకుంటున్నారు. వరి పంట పండించాలంటే ఎకరానికి రూ.35వేలు నుంచి 40వేలు ఖర్చు అవుతోంది. ఏరువాక.. నారు కొనుగోలు.. నాట్లు.. ఎరువులు, పురుగు మందులు, కలుపుతీత, ఆయిల్ ఇంజిన్లతో నీటి తడి.. వరి చేల కోతలు, నూర్పిడి వరకు ప్రతి దశలోనూ ఖర్చు చేయాల్సిందే. కూలీల ఖర్చులూ తడిపిమోపెడవుతున్నాయి. దిగుబడి పెరగడం లేదు. ఈ పరిస్థితిలో వ్యవసాయం చేయడం చాలా కష్టంతో కూడుకుంటోంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన తరువాత వాతావరణం అనుకూలించక నష్టాలకు గురవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు ఏటా నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. 50వేల ఎకరాల వరకు వరి చేలు ముంపునకు గురయ్యాయి. కోసిన చేలే కాకుండా కోయని చేలకు కూడా నష్టం వాటిల్లింది. వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆదుకోవాల్సి ఉంది.
మొలకలు వచ్చేశాయి
వరి పంట మాకు జీవనాధారం. మేలో దుక్కులు వేసుకుని డిసెంబరు వరకు శ్రమించాం. తెగులు సోకినప్పుడు మందులు పిచికారీ చేశాం. ఎరువులు అందించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాం. తుపాను హెచ్చరికల నేపథ్యంలో కోతలను వాయిదా వేశాం. కొన్ని చోట్ల కోసిన చేలను కుప్పలు వేశాం. రెండు చోట్లా నష్టం వచ్చింది. తడిచిన ధాన్యం మొలకలు వచ్చేశాయి. అయినా ఎంతోకొంత పంట చేతికి అందుతుందన్న ఆశతో ఇప్పటికీ కష్టపడుతున్నాం. మా పంటనంతా ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
సిరిపురపు పైడినాయుడు, రైతు, రామవరం, గంట్యాడ మండలం
Updated Date - 2023-12-11T00:57:17+05:30 IST