‘దీవెన’ ఎప్పుడో?
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:50 PM
విద్యా దీవెన నిధుల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. గడిచిన విద్యా సంవత్స రానికి సంబంధించి నాల్గో విడత నిధులు ఇప్పటి వరకూ ప్రభుత్వం మంజూరు చేయలేదు.
- నిధులు విడుదల చేయని ప్రభుత్వం
- విద్యార్థుల ఎదురు చూపులు
‘విద్యా దీవెన నిధులను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదు. దీంతో విద్యార్థులు ఫీజులు చెల్లించలేకపోతున్నారు. మేము కూడా ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయలేని పరిస్థితి. ఫలితంగా అధ్యాపకుల జీతాలకు, కాలేజీ నిర్వహణకు చాలా కష్టం అవుతుంది.’ ఇదీ ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీ డైరక్టర్ ఆవేదన.
కలెక్టరేట్, డిసెంబరు 17: విద్యా దీవెన నిధుల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. గడిచిన విద్యా సంవత్స రానికి సంబంధించి నాల్గో విడత నిధులు ఇప్పటి వరకూ ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 45 వేల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నా రు. ప్రభుత్వం నుంచి నిధులు జమకాకపోవడంతో ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. విద్యా, వసతి దీవెన నిధులు మంజూరు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు అనేకమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించ లేదు. రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల ప్రతినిధులు శనివారం అనకాపల్లి జిల్లాలో యువగళం పాదయాత్ర నిర్వహించిన టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ను కలసి సమస్యను విన్నవించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ నుంచి పైచదువులు చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రతి ఏడాది మంజూరు చేసేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి పేర్లను మార్పు చేసి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలుగా నామకరణం చేసింది. విద్యా దీవెనకు సంబంధించి నిధులను ఒక విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా ప్రభుత్వం విడుదల చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 45 వేల మంది విద్యార్థులకు ఒక విడతకు సుమారు రూ.31 కోట్లు విడుదల కావల్సి ఉంది. 2019-20 సంవత్సరంలో 30 శాతం, 2020-21 సంవత్సరంలో 50 శాతం, 2021-22 సంవత్సరంలో 50 శాతం, 2022- 2023 విద్యా సంవత్సరానికి నాల్గో విడత నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. గత నెల 28న విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ రోజు విడుదల కాలేదు. ఈ నెల 7న మంజూరు చేస్తామని మరోసారి ప్రకటన వచ్చింది. అయితే అప్పుడు కూడా నిరాశే. ఈనెల 12న కచ్ఛితంగా విడుదల చేస్తామని ప్రకటించి మరోసారి మోసం చేసింది. చివరికి ఈనెల 28న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ రోజు అయినా విడుదల అవుతాయా? లేదా? అనేది చూడాల్సి ఉంది. ఈ విషయాన్ని జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.సందీప్‌కుమార్ వద్ద ప్రస్తావించగా.. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన నాల్గో విడత విద్యా దీవెన నిధులను ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 11:50 PM