రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:20 AM
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అతివేగం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. నెల రోజుల కిందట సచివాలయం ఉద్యోగిని రోడ్డు ప్రమాదంలో మరణించింది.
శ్రీకాకుళం క్రైం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అతివేగం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. నెల రోజుల కిందట సచివాలయం ఉద్యోగిని రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ఘటన మరువకముందే మరో యువకుడు మృతి చెందడంతో నగరం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. స్నేహితునితో కలిసి చర్చికి వెళ్లి ప్రార్థ నలు ముగించుకుని తిరిగి బైక్‌పై వెళ్తుండగా స్కిడ్ అవ్వడంతో డివైడర్‌ను ఢీ కొట్టి ఆ యువకుడు దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామానికి చెందిన బలగ రాంబాబు (20) అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసుకుని తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. రాంబాబు పరీక్షల కోసం వారం రోజుల కిందట తన స్వగ్రామానికి వచ్చాడు. అక్కడి నుంచి శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కళాశాల సమీపంలోని భీమ్ భవన్ హాస్టల్‌లో ఉన్న తన స్నేహితుడు అంపిలి చంద్రశేఖర్ దగ్గరకి నాలుగు రోజుల కిందట వచ్చాడు. అప్పటి నుంచి హాస్టల్‌లోనే ఉంటూ ఆది వారం చంద్రశేఖర్‌తో కలిసి ఉమెన్స్ కళాశాల ఎదురుగా ఉన్న చర్చిలో ప్రార్థనలు ముగించుకుని స్నేహితుడు నడుపుతున్న ఆర్15 ద్విచక్రవాహనంపై 80 ఫీట్ రోడ్డు వెపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉమెన్స్ కళాశాల సమీపంలో బైక్ స్కిడ్ అవ్వడంతో వెనుక కూర్చున్న రాంబాబు కిందపడి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చంద్రశేఖర్‌కు కొద్దిపాటి గాయాలు కాగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాంబాబును రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాంబాబు మృతి చెందాడు. దీంతో చంద్రశేఖర్ జరిగిన విషయాన్ని మృ తుడి బందువులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై రిమ్స్ ఔట్‌పోస్టు పోలీసుల సమాచారం మేరకు ట్రాఫిక్ ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి తరలివస్తుండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా నాలుగు రోజులుగా అనాధికా రికంగా ఆ యువకుడు ప్రభుత్వ హాస్టల్‌లో ఉన్నా వార్డెన్ దృష్టి సారింకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Updated Date - Dec 18 , 2023 | 12:20 AM