ఉడ్‌పేటలో విషాదం
ABN, Publish Date - Dec 30 , 2023 | 01:26 AM
అనకాపల్లి పట్టణంలోని ఉడ్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖ కార్యాలయం సమీపంలో వున్న ఒక అపార్టుమెంట్‌లో నివాసం వుంటున్న ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో భర్త, భార్య, ఇద్దరు కుమార్తెలు మృతిచెందగా, మరో కుమార్తె ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నది. ఈమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యా యత్నం
భార్యాభర్తలతోపాటు ఇద్దరు కుమార్తెలు మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కుమార్తె
అనకాపల్లి టౌన్, డిసెంబరు 29: అనకాపల్లి పట్టణంలోని ఉడ్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖ కార్యాలయం సమీపంలో వున్న ఒక అపార్టుమెంట్‌లో నివాసం వుంటున్న ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో భర్త, భార్య, ఇద్దరు కుమార్తెలు మృతిచెందగా, మరో కుమార్తె ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నది. ఈమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రగడ కోటయ్య నగర్‌కు చెందిన కొడవలి శివరామకృష్ణ (40) బంగారం వస్తువులు తయారీ పనులు చేస్తుంటాడు. బతుకుతెరువు కోసం గత ఏడాది సెప్టెంబరులో భార్య మాధవిదేవి(38), కుమార్తెలు వేదవైష్ణవి(15), జాహ్నవి లక్ష్మి (13), కుసుమప్రియ(9)లతో కలిసి అనకాపల్లి వచ్చాడు. ఉడ్‌పేటలోని ఒక అపార్టుమెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివాసం వుంటున్నారు. శివరామకృష్ణ స్థానిక చిననాలుగురోడ్ల జంక్షన్‌లోని ఒక బంగారం దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంచుకుంటున్నాడు. కారణం ఏమిటో తెలియదుగానీ గురువారం రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో చిన్నకుమార్తె కుసుమప్రియకు వాంతులయ్యాయి. దీంతో ఆమె తల్లిదండ్రులను పిలవగా వారు స్పందించలేదు. ఇతర ఫ్లాట్లలో వుంటున్న వారికి చెప్పగా, వారు వచ్చి పరిశీలించారు. భార్యాభర్తలు, ఇద్దరు కుమార్తెలు చలనం లేకుండా నిర్జీవంగా పడివున్నారు. అనంతరం 108కు సమాచారమివ్వగా సిబ్బంది వచ్చి పరిశీలించి, నలుగురూ మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ సీఐ దాడి మోహనరావు, సిబ్బందితో వచ్చారు. కుసుమప్రియను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తరువాత మృతుడు శివరామకృష్ణ సోదరుడు వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న విషయం శుక్రవారం తెల్లవారేసరికి ఉడ్‌పేట, చుట్టుపక్కల ప్రాంతాలకు దావనంలా వ్యాపించింది. స్థానికులతోపాటు బంగారం వ్యాపారులు, పనివారు అపార్ట్‌మెంట్‌కు చేరుకుని మృతదేహాలను చూసి విచారం వ్యక్తం చేశారు. శివరామకృష్ణ ఉదయం ఇంటి నుంచి పనిలోకి వెళ్లి, మళ్లీ రాత్రికి తిరిగి వచ్చేవాడని, ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఇతని భార్య మాధవిదేవి కూడా ఇంటికే పరిమితమయ్యేవారని, ఇరుగుపొరుగు వారితో కలివిడిగా ఉండేవారు కాదని తెలుస్తోంది. అనకాపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను దిగ్ర్భాంతికి గురి చేసింది. కాగా వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైన కుసుమప్రియను పోలీసులు తొలుత చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
Updated Date - Dec 30 , 2023 | 01:26 AM