పైరు కుళ్లిపోయి.. కంకులు మొలకెత్తి..
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:08 AM
సుమారు పక్షం రోజుల క్రితం మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి మండలంలోని పలు గ్రామాల రైతులు ఇంకా తేరుకోలేదు. ముఖ్యంగా ఆవ ప్రాంతంలోని గుంటపల్లి, మంగవరం గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీటమునిగి పోయింది. నీరు తగ్గడానికి దాదాపు పది రోజులుపట్టింది.
తుఫాన్‌కు తీవ్రంగా నష్టపోయిన ‘పేట రైతులు
పది రోజులపాటు నీటిలోనే వరి పైరు
ఎకరాకు రూ.20-25 వేలు నష్టం
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
పాయకరావుపేట రూరల్, డిసెంబరు 16: సుమారు పక్షం రోజుల క్రితం మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి మండలంలోని పలు గ్రామాల రైతులు ఇంకా తేరుకోలేదు. ముఖ్యంగా ఆవ ప్రాంతంలోని గుంటపల్లి, మంగవరం గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీటమునిగి పోయింది. నీరు తగ్గడానికి దాదాపు పది రోజులుపట్టింది. ఈలోగా వరి దుబ్బులు కుళ్లిపోయి, ధాన్యం కంకులు మొలకెత్తాయి. అదేవిధంగా గోపాలపట్నంలో కోనేటి అచ్చారావు, కోనేటి అప్పారావు, నాగేశ్వరరావు, గోవిందు, సత్యనారాయణ తదితరులకు చెందిన సుమారు పది ఎకరాల్లో వరి పంట నీటి మునిగి పాడైపోయింది. కంకుల నుంచి వడ్ల గింజలు నేలరాలి మొలకెత్తాయి. వరి గడ్డిగానీ, ధాన్యంగానీ పనికిరాకుండా పోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదని ఆరోపిస్తున్నారు. ఎకరాకు రూ.20-25 వేలు పెట్టుబడి అయ్యిందని, ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చే అవకాశం లేదన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.
రూ.60 వేలు నష్టపోయాను
కోనేటి సత్యనారాయణ, గోపాలపట్నం ( ఫొటో16పిఎపిరూరల్1)
రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేపట్టాను. సుమారు రూ.60 వేల వరకు పెట్టుబడి అయ్యింది. పైరు బాగానే పండింది. ఈ నెల మొదటి వారంలో పంట కోత మొదలుపెట్టాలనుకున్నాను. అయితే తుఫాన్ హెచ్చరికలతో వాయిదా వేశాను. ఊహించని విధంగా భారీ వర్షాలు కురిసి వరి పొలం మునిగిపోయింది. వారం రోజుల వరకు ముంపులోనే వుండడంతో పైరు మొత్తం కుళ్లిపోయి, వరి కంకులు మొలకెత్తాయి. ఒక్క గింజ కూడా చేతికి దక్కలేదు.
Updated Date - Dec 17 , 2023 | 01:08 AM