‘పేట గోవుల వధ
ABN, First Publish Date - 2023-11-27T00:47:51+05:30
పట్టణంలో ఎటువంటి అనుమతుల్లేకుండా పశువుల కబేళా నిర్వహిస్తున్నారు. ఆవులను వధించి, యథేచ్ఛగా మాంసం విక్రయిస్తున్నారు. యానిమల్ రిస్క్యూ ఆర్గనేషన్, గో రక్షక్ ఫోర్స్ ఇచ్చిన సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు నాగరాజుపేట రైల్వే గేటు సమీపంలో కబేళాపై దాడులు చేశారు.
యథేచ్ఛగా మాంసం విక్రయాలు
యానిమల్ రిస్క్యూ ఆర్గనేషన్, గో రక్షక్ ఫోర్స్ సమాచారం
పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడులు
870 కిలోల పశుమాంసం పట్టివేత
పోలీసుల అదుపులో 11 మంది నిందితులు
14 ఆవులు, ఒక ఎద్దు స్వాధీనం
అనుమతుల్లేకుండా కబేళా నిర్వహణ
పాయకరావుపేట, నవంబరు 26 : పట్టణంలో ఎటువంటి అనుమతుల్లేకుండా పశువుల కబేళా నిర్వహిస్తున్నారు. ఆవులను వధించి, యథేచ్ఛగా మాంసం విక్రయిస్తున్నారు. యానిమల్ రిస్క్యూ ఆర్గనేషన్, గో రక్షక్ ఫోర్స్ ఇచ్చిన సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు నాగరాజుపేట రైల్వే గేటు సమీపంలో కబేళాపై దాడులు చేశారు. పశువులను వధించి, మాంసం విక్రయిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 870 కేజీల పశుమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఉన్న 14 గోవులు, ఒక ఎద్దును స్వాధీనం చేసుకుని పీఎల్.పురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకి తరలించారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ రమేశ్ తెలిపిన వివరాలిలా వున్నాయి.
పాయకరావుపేట పంచాయతీలో ఆర్టీసీ బస్టాండ్‌ను వెనుక, రైల్వే ట్రాక్‌కు సమీపంలో గత కొంతకాలంగా అక్రమంగా పశువులను వధించి, మాంసం విక్రయిస్తున్నారు. ఇది బహిరంగ రహస్యమే అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు తమకేమీ పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పాయకరావుపేట అక్రమ కబేళాలో గోవులను వధించి, మాంసం విక్రయిస్తున్నట్టు రాజమహేంద్రవరానికి చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనేషన్‌కు, గో రక్షక ఫోర్స్‌కు సమాచారం అందింది. ఈ విషయాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజాము యానిమల్ రెస్క్యూ ఆర్గనేషన్ చైర్మన్ గోపాల్ ఆధ్వర్యంలో ఎస్‌పీసీఏ (సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్) ప్రతినిధి విజయ్‌కిశోర్, గో రక్షక ఫోర్స్ ప్రతినిధి దినేశ్ వైష్ణవ్, బజరంగ్‌దళ్ ప్రతినిధి ప్రదీప్ యాదవ్ తదితరులు, ఎస్‌ఐ రమేశ్ రెవెన్యూ సిబ్బంది సాయంతో అక్రమ పశువుల కబేళా వద్దకు వెళ్లారు. అక్కడ అప్పటికే పలు పశువులను వధించి, మాంసాన్ని వేలాడదీసి వుండడాన్ని గుర్తించారు. మాసం విక్రయిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 870 కేజీల పశు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమీపంలో మరో 14 ఆవులు, ఒక ఎద్దు కట్టివేసి వున్నాయి. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకుని పీఎల్.పురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించారు. పశుమాంసాన్ని పట్టణ శివార్లకు తరలించి పశువైద్యాధికారి డాక్టర్ శరణ్య, డీటీ కె.నూకరాజు సమయంలో పంచనామా నిర్వహించారు. వధించిన పశువుల్లో ఆవులు కూడా వుండవచ్చని పశువైద్యాధికారి చెప్పారే తప్ప, కచ్చితంగా ఎన్ని పశువులను వధించారో వెల్లడించలేదు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు
గోపాల్, యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ చైర్మన్ (26పీఏపీ 6)
పాయకరావుపేటలో చాలా కాలం నుంచి అనధికార పశువుల కబేళా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదు. ఏపీలో గోవధ నిషేధ చట్టం అమలు వుందన్న విషయాన్ని అధికారులు విస్మరించడం శోచనీయం. ఆదివారం ఇక్కడ పట్టుబడిన పశుమాంసాన్ని పరిశీలిస్తే ఆరు గోవులను వధించినట్టు అర్థమవుతున్నది. దీనిపై నిష్పక్షసాతంగా విచారణచేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రక్షించిన ఆవులను గో సంరక్షణకు గోశాలకు తరలించాలి.
Updated Date - 2023-11-27T00:47:52+05:30 IST