ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వడివడిగా... కలివిడిగా...

ABN, Publish Date - Dec 18 , 2023 | 01:02 AM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది.

ఉత్సాహంగా సాగుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర

ఎలమంచిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో సాగిన యువగళం

రహదారులకు ఇరువైపులా బారులుతీరి ఘనంగా స్వాగతం పలికిన జనం

గుమ్మడి కాయలతో దిష్టి తీసి, హారతులు పట్టిన మహిళలు

సమస్యలు చెప్పుకున్న పలు వర్గాల ప్రజలు

నిరుద్యోగుల సంఘీభావం

ఉక్కు టౌన్‌షిప్‌లో బెలూన్లతో మహిళలు ఘన స్వాగతం

226వ రోజు...17.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర

విశాఖపట్నం/మునగపాక/పరవాడ/స్టీల్ ప్లాంట్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు అడుగడుగునా అన్నివర్గాల ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఆదివారం ఉదయం పది గంటలకు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తోటాడ సమీపంలోని విడిది ప్రదేశం నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. టి.సిరసపల్లి, వెంకటాపురం మీదుగా భరిణికం వద్ద పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పరవాడ మండలంలోకి ప్రవేశించింది. పరవాడ, గొర్లివానిపాలెం, చింతల గొర్లివానిపాలెం, జాజులవానిపాలెం, దేశపాత్రునిపాలెం మీదుగా గాజువాక నియోజకవర్గలోకి సాగింది. దారిపొడవునా మహిళలను, యువతను పలుకరిస్తూ చిన్నారులను ముద్దాడుతూ ముందుకుసాగారు. ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఉక్కు టౌన్‌షిప్‌లో సాయి బాబా గుడి సమీపంలోని సీడబ్ల్యూసీ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరుకున్నారు. లోకేశ్‌ 226వ రోజు మొత్తం 17.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

మునగపాక మండలం తోటాడ వద్ద వైఎస్‌ఆర్‌ జగనన్న భూ రక్ష సర్వే రాళ్లు పరిశీలనతో ప్రారంభమైన పాదయాత్ర ఆద్యంతం ప్రజలతో మమేకమవుతూ ముందుకుసాగింది. అక్కడి నుంచి వెంకటాపురానికి చేరుకున్న లోకేశ్‌కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనకాపల్లి నుంచి తోటాడ మీదుగా పరవాడకు వెళ్లే రోడ్డు పూర్తిగా ఛిద్రమైందంటూ గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. లోకేశ్‌ స్పందిస్తూ..టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డును బాగుచేయిస్తానని హామీ ఇచ్చారు. తరువాత పరవాడ మండలం భరణికం వద్ద పెందుర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు సత్యనారాయణమూర్తి, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు, ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతలు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు లోకేశ్‌కు దిష్టి తీసి, హారతులు పట్టారు. రోడ్డుకు ఇరువైపులా బారులుతీరిన ప్రజలు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా లోకేశ్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. అనంతరం భరణికాంలో మధ్యాహ్న భోజన విరామ క్యాంపునకు చేరుకున్నారు. ఇక్కడ పంచగ్రామాల భూ సమస్య బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. మాజీ మంత్రులు గంటా, బండారు, ఎమ్మెల్యే గణబాబు తదితరులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవో 229ను అమలు చేసి సమస్య పరిష్కరిస్తామని లోకేశ్‌ వారికి హామీ ఇచ్చారు. భోజన విరామం తరువాత 3.30 గంటలకు పాదయాత్రను తిరిగి ప్రారంభించి పరవాడ చేరుకున్నారు. ఆయనతోపాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, బండారు, తదితరులు ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరవాడ సంతబయలు వద్దకు మహిళలు భారీగా తరలివచ్చారు. పెరుగుతున్న ధరలతో నిత్యావసర సరకులు కొనుగోలు చేయడం కష్టంగా వుందని పలువురు లోకేశ్‌కు వివరించి, ప్యాకింగ్‌ చేసిన పలురకాల నిత్యావసర వస్తువుల గజమాలను లోకేశ్‌కు వేశారు. ఏపీసీపీఎస్‌ ఉద్యోగులు లోకేశ్‌ను కలిసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ముదపాక భూ సమీకరణ బాధితులు కూడా వినతిపత్రాన్ని అందించారు. పరవాడ పెట్రోల్‌ బంక్‌ వద్ద కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్‌ విషయమై టీడీపీ హయాంలో అసెంబ్లీలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామన్నారు. తరువాత గొర్లివానిపాలెం జూనియర్‌ కాలేజీ వద్ద బోనంగి, లేమర్తి, తాడి, తానాం గ్రామాలకు చెందిన నిరుద్యోగులు లోకేశ్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఫార్మా సిటీకి భూములు ఇచ్చిన తమకు ఉద్యోగులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేశ్‌ స్పందిస్తూ..టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి దేశపాత్రునిపాలెం మీదుగా ఉక్కు టౌన్‌ షిప్‌కు పాదయాత్ర చేరింది. మహిళలు పెద్దఎత్తున బెలూన్లు పట్టుకుని లోకేశ్‌కు స్వాగతం పలికారు. అలాగే ఉక్కును కాపాడాలంటూ కొంతమంది కార్మికులు లోకేశ్‌కు వినతిపత్రం సమర్పించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుతో కూడిన బ్యానర్‌ ప్రదర్శించి నినాదాలు చేశారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులకు హెల్త్‌ కార్డులు ఇస్తాం

బాధిత గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్లు.. నారా లోకేశ్‌

విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

నగరంలో 2020 మే 7వ తేదీన చోటుచేసుకున్న ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. వెంకటాపురం గ్రామ అభివృద్ధి సంఘం అధ్వర్యంలో ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులు ఆదివారం ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన విశాఖపట్నంలో జరిగిందన్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో 40 రోజులు మూతపడిన ఎల్‌జీ పాలిమర్స్‌ను ఎటువంటి తనిఖీలు లేకుండా నిత్యావసరాల వస్తువుల చట్టం కింద అనుమతులిచ్చి తెరిపించారని, అయితే ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, కాలుష్య నియంత్రణ చట్టాలు అమలు చేయకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందన్నారు. దుర్ఘటన జరిగాక జగన్మోహన్‌రెడ్డి చుట్టం చూపుగా వచ్చి వెళ్లారే తప్ప ఇప్పటివరకూ బాధితుల సమస్య పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. బాధిత గ్రామాలకు ఇచ్చిన హామీలను జగన్మోహన్‌రెడ్డి నిర్లక్ష్యం చేశారని లోకేష్‌ తప్పుబట్టారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్‌జీ పాలిమర్‌ ్స బాధిత గ్రామాల్లో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటుచేస్తామని, ప్రజలందరికీ హెల్త్‌ కార్డులు జారీచేస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణ హితమైన పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.

పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తాం

229 జీవో అమలు చేస్తాం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

పరవాడ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

లక్షా ఐరవై వేల కుటుంబాలకు సంబంధించిన సింహాచలం దేవస్థానం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి తెలుగుదేశం అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా కట్టుబడే ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా పరవాడ సంతబయలు వద్ద పంచ గ్రామాల ప్రజలతో లోకేష్‌ ముఖాముఖి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా మూడు నెలల పాటు ఓపిక పట్టి ఉండాలని, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు. పంచగ్రామాల సమస్యపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఇది 12 వేల ఎకరాలు, 18 వేల ఇళ్లకు సంబంధించిన సమస్య అన్నారు. ఈ సమస్య పెండింగ్‌లో ఉండడం వల్ల సుమారు లక్షా 20 వేల కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం, ఇతర అవసరాల కోసం ఆస్తులు అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 578 జీవో తీసుకొచ్చారని, అయితే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చి...సమస్యను మరింత జఠిలం చేశారన్నారు. 2014లో తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జీవో 229ను జారీచేసి దేవస్ధానానికి వేరే చోట భూమి కేటాయించి పంచగ్రామాల సమస్య పరిష్కారానికి యత్నించారన్నారు. అప్పుడు వైసీపీ లీగల్‌ సెల్‌లో పనిచేసే కొందరూ కోర్టుకు వెళ్లి జీవో 229 అమలు కాకుండా చేశారని ఆరోపించారు. జగన్‌ పాదయాత్ర చేసిన సమయంలో ఈ సమస్యను అధికారంలోకి వచ్చిన నెలలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ గడిచిన నాలుగున్నరేళ్లుగా కమిటీల పేరుతో కాలక్షేపం చేశారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 229 అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి నలుగుతున్న ఈ సమస్య....పంచగ్రామల ప్రజలంతా ఒకే మాటపై ఉంటే పరిష్కారం సులువవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాడు కాంగ్రెస్‌, నేడు వైసీపీ పంచగ్రామాల సమస్యను పెద్దది చేశాయని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే గణబాబు, భీమిలీ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, కార్పొరేటర్లు శ్రీనివాస్‌, రాపర్తి కన్నారావు, ఏవీ నరసింహం తదితరులు మాట్లాడుతూ పంచ గ్రామాలకు చెందిన 1,750 ఎకరాలు 22ఏ జాబితాలో ఉన్నాయని, అందులో నుంచి బయటకు తెచ్చి క్రమబద్ధీకరించాలన్నారు.

నేడు...చివరిరోజు పాదయాత్ర సాగుతుందిలా...

విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం సాయంత్రం ముగియనుంది. చివరిరోజు పాదయాత్ర ఉదయం ఎనిమిది గంటలకు సీడబ్ల్యూసీ-1 క్యాంపు సైట్‌ నుంచి ప్రారంభమవుతుంది. 8.45 గంటలకు నెహ్రూ పార్కు వద్ద ఆర్మీ ఉద్యోగులతో, 9.00 గంటలకు తెలుగుతల్లి విగ్రహం వద్ద స్టీల్‌ప్లాంటు నిర్వాసితులతో, 10.00 గంటలకు దుర్గానగర్‌ బస్టాప్‌ వద్ద పద్మశాలి సామాజిక వర్గీయులతో సమావేశం అవుతారు. 10.15 గంటలకు వై.జంక్షన్‌లో యువనేతతో కలిసి శ్రామికులు అడుగు వేయనున్నారు. 10.30 గంటలకు లయన్స్‌ క్లబ్‌ వద్ద గంగవరం పోర్టు డీపీ ఉద్యోగులతో, 10.35 గంటలకు ఆంజనేయస్వామి గుడి వద్ద స్థానికులతో మాటామంతీ, 10.40 గంటలకు జగ్గూ జంక్షన్‌ వద్ద టూ వీలర్‌ మెకానిక్‌లతో సమావేశాలు ఉంటాయి. 10.45 గంటలతో కెనరా బ్యాంకు వద్ద స్థానికులతో, 10.50 గంటలకు చినగంట్యాడలో రైతులతో, 11.05 గంటలకు ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ వద్ద హమాలీ వర్కర్లతో, 11.15 గంటలకు హనుమాన్‌ కమ్యూనిటీ హాలు వద్ద జంగమ సామాజికవర్గ నాయకులతో, 11.20 గంటలకు వంటిల్లు జంక్షన్‌ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశం కానున్నారు. 11.30 గంటలకు పాత గాజువాక జంక్షన్‌లో యువతతో కలిసి అడుగులు నడవనున్నారు. 11.45 గంటలకు సీఎంఆర్‌ జంక్షన్‌లో స్వర్ణకారులతో, 12 గంటలకు ఆర్కే హాస్పిటల్‌ వద్ద స్థానికులతో మాట్లాడనున్న లోకేష్‌...12.10 గంటలకు పోలీస్‌ స్టేషన్‌ జంక్షన్‌లో తలసేమియా రోగులతో, 12.25 గంటలకు టీఎస్‌ఆర్‌ అండ్‌ టీబీకే కాలేజీ వద్ద న్యాయవాదులతో, 12.30 గంటలకు శ్రీనగర్‌లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో సమావేశమవుతారు. 1.15 గంటలకు వడ్లమూడి జంక్షన్‌లో భోజన విరామం తీసుకుంటారు. రెండు గంటలకు విరామ స్థలంలోనే అగ్రిగోల్డ్‌ బాధితులు, మీ-సేవా కేంద్రాల నిర్వాహకులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం 4 గంటలకు వడ్లమూడి జంక్షన్‌ వద్ద నుంచి పాదయాత్ర ముందుకు సాగుతుంది. 4.15 గంటలకు కూర్మన్నపాలెం జంక్షన్‌లో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ కానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు అగనంపూడి టోల్‌గేటు సమీపాన గల శివాజీనగర్‌లో యువగళం పాదయాత్ర ముగించనున్నారు. అక్కడే పైలాన్‌ను లోకేష్‌ ఆవిష్కరించనున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 01:02 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising