ప్రభంజనం
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:10 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. శనివారం ఉదయం ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తిమ్మరాజుపేట నుంచి 224వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఎలమంచిలి, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రభం‘జనం’లా సాగింది. టీడీపీ, జనసేన శ్రేణులతోపాటు వివిధ వర్గాల ప్రజలు లోకేశ్‌కు సంఘీభావంగా ఆయన వెంట నడిచారు. ‘సైకో పోవాలి, సైకిల్ రావాలి’ ‘జయహో చంద్రన్న’...నినాదాలతో హోరెత్తించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన
యువనేతపై అడుగడుగునా పూల వర్షం
బెల్లం దిమ్మెలు, చెరకు గడల గజమాలలతో అపూర్వ స్వాగతం
హారతులు ఇచ్చి వీరతిలకం దిద్దిన ఆడపడుచులు
అందరికీ అప్యాయ పలకరింపు
సమస్యలు చెప్పుకున్న రైతులు, బీసీ సంఘాల నేతలు, అంగన్‌వాడీలు
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తామని భరోసా
అనకాపల్లి టౌన్/మునగపాక/కొత్తూరు/ అనకాపల్లి రూరల్,
డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. శనివారం ఉదయం ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తిమ్మరాజుపేట నుంచి 224వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఎలమంచిలి, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రభం‘జనం’లా సాగింది. టీడీపీ, జనసేన శ్రేణులతోపాటు వివిధ వర్గాల ప్రజలు లోకేశ్‌కు సంఘీభావంగా ఆయన వెంట నడిచారు. ‘సైకో పోవాలి, సైకిల్ రావాలి’ ‘జయహో చంద్రన్న’...నినాదాలతో హోరెత్తించారు. కర్షకులు, కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు అడుగడుగునా యువనేత లోకేశ్‌కు అపూర్వ స్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించారు. మహిళలు హారతులిచ్చి వీరతిలకం దిద్దారు. దారిపొడవునా బారులు తీరిన ప్రజలను లోకేశ్ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.
బెల్లం రైతుల సమస్యలు ఆలకింపు
మునగపాక పంచాయతీ పరిధిలో చెరకు క్రషర్ల వద్దకు లోకేశ్ వెళ్లి బెల్లం తయారుచేస్తున్న రైతులను పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నల్లబెల్లంపై ప్రభుత్వం ఆంక్షలు విధించి వ్యాపారులను వేధిస్తున్నదని, దీంతో నల్లం బెల్లం కొనుగోళ్లు తగ్గిపోయి ధరలు గణనీయంగా పడిపోయాయని వాపోయారు. మార్కెట్‌లో కిలో రూ.50 ధర పలికే బెల్లాన్ని రూ.30కే అమ్ముకోవాల్సి వస్తున్నదని చెప్పారు. లోకేశ్ స్పందిస్తూ టీడీపీ-జనసేన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లం బెల్లంపై ఆంక్షలను ఎత్తివేసి స్వేచ్ఛగా అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
సమస్యలు ఏకరువుపెట్టిన బీసీలు
మునగపాక మండలం అరబుపాలెంలో పలు బీసీ సంఘాల ప్రతినిధులు యువనేత లోకేశ్‌ను కలిశారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేయాలనికోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేతివృత్తిదారులను ప్రోత్సహించేందుకు ఆధునిక పనిముట్లు అందజేయాలని, వారు తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత వెనుబడిన బీసీ (ఎంబీసీ) కులాల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని, స్థానిక సంస్థల్లో మాదిరిగా చట్ట సభల్లో కూడా బీసీలకు ప్రత్యేకంగా ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, సాగు భూమి పంపిణీకి కృషి చేయాలని విన్నవించుకున్నారు.
అంగన్‌వాడీలకు భరోసా
మునగపాకలో సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల శిబిరాన్ని నారా లోకేశ్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో మూడు నెలల్లో టీడీపీ-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గోడు వెల్లబోసుకున్న అన్నదాతలు
మునగపాక మండలం గంగాదేవిపేట జంక్షన్‌లో చెరకు, వరి, కొబ్బరి రైతులు...యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, మరోవైపు ఎరువులు, పురుగుమందులు, కూలి రేట్లు పెరిగిపోయాయని వాపోయారు. శారదా నది నుంచి తమ పొలాలకు నీరు వచ్చే అనకాపల్లి పట్టణంలోని కాలువల్లో ఏళ్ల తరబడి పూడిక తీయడం లేదని, దీంతో పంటలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాలువల్లో పూడిక తీయించాలని కోరారు. నారా లోకేశ్ మాట్లాడుతూ..జగన్‌మోహన్‌రెడ్డి చేతగాని పాలన కారణంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి పనులను పూర్తిగా గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిందని, పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు ఊడిపోయాయని అన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శారదా నది గ్రోయిన్లకు మరమ్మతులు చేయించి, కాలువల్లో పూడికలు తీయిస్తామని భరోసా ఇచ్చారు.
మీ- సేవ కేంద్రాల నిర్వాహకుల వినతిపత్రం
మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు మునగపాకలో లోకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో మీ-సేవ కేంద్రాలకు పనుల కోసం ఎవరూ రావడం లేదని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని రామాంజనేయులు, భాస్కరరావు, తదితరులు వాపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో మాదిరిగా మీ-సేవలో పనులను పునరుద్ధరించాలని కోరారు.
224వ రోజు 13.7 కి.మీ.లు నడక
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 224వ రోజైన శనివారం 13.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. దీంతో 3,101 కిలో మీటర్లు పూర్తయ్యింది. అంతకుముందు శనివారం ఉదయం ఎలమంచిలి నియెజకవర్గం మునగపాక మండలం తిమ్మరాజుపేట విడిది కేంద్రం నుంచి బయలుదేరింది. మునగపాక, నాగులాపల్లి మీదుగా పూడిమడక రోడ్డు జంక్షన్ సమీపంలో అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా సాగిన పాదయాత్ర రాత్రికి మునగపాక మండలం తోటాడ సమీపంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరింది. ఆదివారం పెందుర్తి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యువగళం పాదయాత్ర కొనసాగనున్నది.
అనకాపల్లి జనసంద్రం
యువనేతకు బ్రహ్మరథం పట్టిన పట్టణవాసులు
కిక్కిరిసిన రహదారులు
వినతిపత్రాలు అందించిన పలు సంఘాల నేతలు
అనకాపల్లి టౌన్/తుమ్మపాల/అనకాపల్లి రూరల్, కొత్తూరు, డిసెంబరు 16:
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనకాపల్లి పట్టణంలో జాతరను తలపించింది. పూడిమడక రోడ్డు జంక్షన్ వద్ద అనకాపల్లిలోకి ప్రవేశించినప్పటి నుంచి, తోటాడ హైవే జంక్షన్ వద్ద మునగపాక మండలంలోకి వెళ్లేంత వరకూ రహదారులు ఇసుక వేస్తే రాలదన్నట్టు జనసంద్రంగా మారాయి. అంతకుముందు మునగపాక మండలం నుంచి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేశ్ పాదయాత్రకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ, జనసేన ఇన్‌చార్జి పరుచూరి భాస్కరరావు, తదితర నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి బైపాస్ రోడ్డు జంక్షన్, నెహ్రూ చౌక్, వేల్పుల వీధి, రింగ్‌రోడ్డు, పరమేశ్వరి పార్కు, సంతోషిమాత కోవెల, నూకాంబిక అమ్మవారి ఆర్చి మీదుగా పాదయాత్ర సాగింది. అడుగడుగునా గజమాలలు, బాణసంచా కాల్పులతో కార్యకర్తలు స్వాగతం పలికారు. పూడిమడక రోడ్డు జంక్షన్‌లో ఫ్లై ఓవర్ వంతెన మీద నుంచి యువకులు పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడి నుంచి నెహ్రూ చౌక్ వరకు ప్రధాన రహదారి మొత్తం జనంతో నిండిపోయింది. తెలుగు మహిళలు హారతులు ఇచ్చి, బూడిద గుమ్మడికాయలతో యువనేతకు దిష్టి తీశారు. యాత, శెట్టిబలిజ, గీత కార్మికులు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల అసోసియేషన్ ప్రతినిధులు, విశ్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సమస్యలతో కూడిన వినతిపత్రాలను లోకేశ్‌కు అందించారు. నెహ్రూచౌక్‌కు అన్ని వైపులా రహదారులన్నీ జనంతో కిటకిటలాడాయి. లోకేశ్ ఇక్కడ ప్లాస్టిక్ స్టూలుపై నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. వేల్పులవీధి, కన్యకాపరమేశ్వరి జంక్షన్ తదితర ప్రాంతాల్లో పలువురు వినతిపత్రాలను అందజేశారు.
Updated Date - Dec 17 , 2023 | 01:10 AM