పెద్దేరు గట్లపై నిర్లక్ష్యం
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:37 AM
తుఫాన్ సమయంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కోతకు గురై గండ్లు పడిన నదుల గట్లకు మరమ్మతులు చేపట్టడంలో జలవనరుల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. నదుల్లో వరద తగ్గుముఖం పట్టి పది రోజులు దాటినప్పటికీ ఇంతవరకు ఒక్కరు కూడా అటువైపు కన్నెత్తి అయినా చూడలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
తుఫాన్, భారీ వర్షాలతో పలుచోట్ల గండ్లు
రైతులు పొలాలకు వెళ్లడానికి వీలుకాని పరిస్థితి
పక్షంరోజులైనప్పటికీ కన్నెత్తి అయినా చూడని జలవనరుల శాఖ అధికారులు
నాలుగేళ్ల నుంచి ఇదే తీరు అని రైతులు ఆవేదన
చోడవరం, డిసెంబరు 17: తుఫాన్ సమయంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కోతకు గురై గండ్లు పడిన నదుల గట్లకు మరమ్మతులు చేపట్టడంలో జలవనరుల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. నదుల్లో వరద తగ్గుముఖం పట్టి పది రోజులు దాటినప్పటికీ ఇంతవరకు ఒక్కరు కూడా అటువైపు కన్నెత్తి అయినా చూడలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు పెద్దేరు రిజర్వాయర్ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పెద్దేరు నది ఉధృతంగా ప్రవహించింది. చోడవరం మండలం పరిధిలో జన్నవరం, బెన్నవోలు, చాకిపల్లి, రామజోగిపాలెం, పీఎస్ పేట తదితర ప్రాంతాల్లో ఏటిగట్లు పలుచోట్ల కోతకు గురయ్యాయి. కొన్నిచోట్ల గండ్లు కూడా పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల రైతులు పంటపొలాలకు రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. పంట పొలాల్లో చెరకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నది గట్ల మీదుగా బళ్లతో రోడ్డుపైకి తీసుకు వస్తుంటారు. పొలాలకు వెళ్లివచ్చేందుకు ఏటిగట్టునే రహదారిగా ఉపయోగించుకుంటారు. వరద ధాటికి ఏటిగట్లు చాలా చోట్ల కోతకు గురికావడంతో రాకపోకలకు వీలులేకుండా పోయింది. ఏటి గట్టు అవతల చాకిపల్లి, రామజోగిపాలెం, కన్నంపాలెం, పీఎస్‌పేట, బెన్నవోలు, జన్నవరం గ్రామాల రైతులకు సుమారు 500 ఎకరాల పంట భూములు ఉన్నాయి. భారీ వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతినగా, చెరకు తోటలు నీట మునిగాయి. కొద్ది రోజుల్లో చెరకును నరికి ఫ్యాక్టరీకి తరలించాలి. ఇందుకోసం తొలుత రోడ్డుపైకి చేర్చాలి. ఏటిగట్లు కోతకు గురవడంతో చెరకును ఎలా తరలించాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు.
జలవనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యం
పెద్దేరు నదీలో వరద ఉధృతికి పలుచోట్ల ఏటిగట్లు కోతకు గురైనప్పటికీ జలవనరుల శాఖ అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డు పక్కన మునిగిన పంటపొలాలు చూసి వెళ్లిపోయారు తప్ప నదుల గట్లను చూడలేదని అంటున్నారు. పెద్దేరు, శారదా నదుల్లో వరద ఉధృతి అధికంగా వుంటే ఏటిగట్లకు గండ్లు పడే ప్రమాదం వుందని, అందువల్ల గట్లను పటిష్ఠం చేయాలని నాలుగేళ్ల నుంచి కోరుతున్నా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవంటున్నారు. ఏడేళ్ల క్రితం తెలుగుదేశం హయాంలో పెద్దేరు ఏటిగట్లను ఉపాధి పథకం నిధులు రూ.30 లక్షలతో అభివృద్ధి చేశారు. జన్నవరం వంతెనకు రెండు వైపులా ఏటిగట్లను పటిష్ఠం చేశారు. తరువాత ఏటిగట్ల నిర్వహణను జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో గట్లు క్రమంగా బలహీనపడ్డాయి. రెండేళ్ల క్రితం పీఎస్‌పేట వద్ద గండి పడడంతో 200 ఎకరాల్లో పంట పూర్తిగా పాడైపోయింది. తరువాత జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో గండిని స్థానికులు పూడ్చుకున్నారు. ఏటిగట్లు పలుచోట్ల పూర్తిగా బలహీనపడ్డాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసి గట్లకు గండ్లు పడితే గ్రామాలు మునిగిపోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పెద్దేరు నది గట్లకు పడిన గండ్లను పూడ్చాలని, కోతకు గురైన చోట పటిష్ఠ చేయాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:37 AM