వివాహానికని బయలుదేరి మృత్యుఒడిలోకి..
ABN, First Publish Date - 2023-11-10T00:59:51+05:30
వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు...ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు...గురువారం సాయంత్రం స్నేహితుడి వివాహానికి బయలుదేరిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. వివరాలిలా ఉన్నాయి.
స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్‌లో రోడ్డు ప్రమాదం
ముగ్గురు యువకుల మృతి
గంగవరంలో విషాద ఛాయలు
ఉక్కుటౌన్‌షిప్, నవంబరు 9:
వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు...ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు...గురువారం సాయంత్రం స్నేహితుడి వివాహానికి బయలుదేరిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా గంగవరం ప్రాంతానికి చెందిన అర్జిల్లి సోమేశ్ (19), కదిరి వాసు (19), కొవిరి రాజులు స్నేహితులు. ఐటీఐ చదువుకున్నారు. స్థానికంగా ప్లంబింగ్, ఎలక్రిక్టల్ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలకు అండగా ఉంటున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఉంటున్న స్నేహితుడి విహహానికి హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం వీరు ముగ్గురు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ సెక్టార్-10 ప్రాంతానికి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకువెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది ఈ ప్రమాదంలో సోమేశ్, వాసు అక్కడికక్కడే మృతిచెందారు. కొవిరి రాజుకు తీవ్ర గాయాలు కావడంతో తొలుత ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ రాజు చనిపోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
గంగవరంలో విషాద ఛాయలు
అప్పటివరకు తమ కళ్ల ముందే తిరిగిన ముగ్గురు యువకులు ఇక లేరన్న విషయాన్ని గంగవరం ప్రజలు జీర్ణించుకులేకపోతున్నారు. ఎక్కడకు వెళ్లినా ముగ్గురు స్నేహితులు కలిసే వెళ్లేవారని, అందరితో కలిసి మెలిసి ఉండేవారని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సోమేశ్ తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి ఎల్లమ్మ ఎంతో అల్లారుముద్దుగా పెంచింది. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడైన సోమేశ్ మృతిచెందడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అలాగే వాసు తండ్రి కూడా చనిపోవడంతో తల్లి మంగమ్మ ముగ్గురు ఆడపిల్లలతో పాటు ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకునేది.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ
ప్రమాద స్థలాన్ని గురువారం రాత్రి నగర పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్ అయ్యన్నార్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అతి వేగంగా బైక్‌ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు అధికారులు సీపీకి వివరించారు. మలుపు వద్ద వాహన వేగాన్ని నియంత్రించలేక రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొన్నారని తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న సోమేశ్ హెల్మెట్ ధరించినప్పటికీ వేగంగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో మృతిచెందాడని చెప్పారు. సీపీ వెంట డీసీపీ-2 ఆనంద్‌రెడ్డి, ట్రాఫిక్ ఏడీసీపీ, సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, స్టీల్‌ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-11-10T00:59:53+05:30 IST