కార్డుదారులకు నాసిరకం కందిపప్పు
ABN, Publish Date - Dec 26 , 2023 | 01:11 AM
బియ్యం కార్డుదారులకు ప్రభుత్వం నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక లారీ పప్పు వెనక్కి పంపిన పౌర సరఫరాల సంస్థ
గత నెలలో రెండు లారీలు వెనక్కి...
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం...చర్యలకు అధికారుల వెనకడుగు
వచ్చే నెలలో కూడా అరకొరగానే సరఫరా
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
బియ్యం కార్డుదారులకు ప్రభుత్వం నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో జిల్లాకు రెండు లారీల నాసిరకం కందిపప్పు రాగా...పౌర సరఫరాల సంస్థ వెనక్కి తిప్పి పంపింది. అయినా వచ్చే నెలకు సంబంధించి రెండు రోజుల క్రితం మర్రిపాలెం గోదాముకు పంపిన కందిపప్పు కూడా నాణ్యత లేకపోవడంతో అధికారులు తీసుకోకుండా వెనక్కి పంపేశారు. రెండు పర్యాయాలు నాసిరకం పప్పు పంపిన కాంట్రాక్టర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.160 నుంచి రూ.180 వరకు పలుకుతుంది. మార్కెట్‌లో ధర పెరగడంతో బియ్యం కార్డుదారులకు కిలో వంతున పంపిణీ చేయాలని ప్రభుత్వం మూడు నెలల నుంచి ప్రణాళికలు వేసి చివరకు డిసెంబరు నుంచి సరఫరాకు శ్రీకారం చుట్టింది. కందిపప్పును సరఫరా చేసేందుకు పౌర సరఫరాల సంస్థ కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తుంది. కిలో కందిపప్పు రూ.67కు బియ్యం కార్డుదారుడికి విక్రయిస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌తో పోల్చితే కార్డుదారులకు ఇచ్చే కందిపప్పు తక్కువ గ్రేడ్ కలిగినదని పలువురు డీలర్లు చెబుతున్నారు. ప్రతి నెలా కందిపప్పు గోదాములకు చేరిన వెంటనే పౌరసరఫరాల సంస్థ అధికారులు నగరంలోని సంస్థ లేబొరేటరీలో సరకు నాణ్యతను పరీక్షిస్తారు. ఒకవేళ టెండర్‌లో పేర్కొన్న విధంగా కందిపప్పు ఉంటేనే లారీ నుంచి సరకు అన్‌లోడ్ చేస్తారు. లేకపోతే వెనక్కి పంపుతారు. గత నెలలో మర్రిపాలెం గోదాముకు వచ్చిన రెండు లారీల సరకు నాసిరకంగా ఉండడంతో వెనక్కి పంపారు. అయినా కాంట్రాక్టర్ పద్ధతి మారలేదు. వచ్చే నెలకు సంబంధించి రెండు రోజుల క్రితం వచ్చిన సరకు కూడా నాసిరకంగానే ఉందని అధికారులు గుర్తించి వెనక్కి పంపేశారు. గతనెలలో నాసిరకం సరుకు పంపిణీ చేసిన కాంట్రాక్టర్‌ను బ్లాకు లిస్టులో పెట్టకపోవడంతో...మరోమారు లోగ్రేడ్ క్వాలిటీ సరుకు పంపారని డీలర్లు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంలో పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారంటున్నారు.
పండుగకు అరకొర కందిపప్పే
డిసెంబరు నెలలో సుమారు 15 శాతం మంది కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేసిన పౌర సరఫరాల సంస్థ, జనవరి నెలకు సంబంధించి 30 శాతం మందికే అందజేసే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే నెలలో సంక్రాంతి పండుగ ఉంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ, ముస్లిం, క్ర్తైస్తవుల పండుగులకు సంబంధించి సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా పేరుతో పలు రకాల సరుకులు పంపిణీ చేసేవారు. అయితే జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కార్డుదారులకు ప్రతినెలా బియ్యం, పంచదార తప్ప ఇతర సరుకులు, పండుగ కానుకులు నిలిపివేశారు. ధరలు పెరిగినందున బియ్యం, పంచదార, గోధుమపిండితోపాటు కందిపప్పు ఇస్తే కొంత వరకు ఊరట లభిస్తోందని కార్డుదారులు కోరుతున్నారు. విశాఖ జిల్లాలో 5.27 లక్షల బియ్యం కార్డుదారులు ఉండగా ప్రతి కార్డుకు కిలో కందిపప్పు ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన 530 టన్నుల కందిపప్పు సరఫరాకావాలి. డిసెంబరు నెలకు సంబంధించి జిల్లాకు 240 టన్నుల సరుకు కేటాయిస్తారని అధికారులకు సమాచారం వచ్చింది. అయితే 140 టన్నులు పంపుతామని చెప్పిన ఉన్నతాధికారులు....కేవలం 60 టన్నులు మాత్రమే ఇచ్చారు. అరకొర పప్పు సరఫరాపై డీలర్లు అభ్యంతరం వ్యక్తంచేసినా పౌర సరఫరాల సంస్థ పట్టించుకోలేదు. సంక్రాంతి పండుగ కోసం ప్రతి కార్డుదారుడికి కందిపప్పు ఇస్తారని డీలర్లు ఆశిస్తున్నా ఇంతవరకు 50 టన్నుల వరకు మాత్రమే వచ్చిందని చెబుతున్నారు. మరో 50 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనిపై పౌర సరఫరాల సంస్థగానీ, పౌరసరఫరాల శాఖగానీ స్పష్టంగా ఏ విషయం చెప్పడం లేదు.
Updated Date - Dec 26 , 2023 | 01:11 AM