హర హర మహాదేవ..
ABN, First Publish Date - 2023-11-28T00:38:44+05:30
హరహర మహాదేవ.. శంభో శంకరా.., ఓం నమశ్శివాయ నామస్మరణతో కార్తీక మాసం రెండో సోమవారం పలు ప్రాంతాల్లోని శివాలయాలు మార్మోగాయి.
కార్తీక రెండో సోమవారం భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
గాజువాక, నవంబరు 27: హరహర మహాదేవ.. శంభో శంకరా.., ఓం నమశ్శివాయ నామస్మరణతో కార్తీక మాసం రెండో సోమవారం పలు ప్రాంతాల్లోని శివాలయాలు మార్మోగాయి. పరమశివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక సోమవారం రోజున స్వామివారిని పుష్పాలతో పూజించినా, అభిషేకించినా, దర్శించినా సకల పాపాలు హరించుకపోవడంతో పాటు మనసులోని కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో గాజువాకలోని సనత్‌నగర్ శివాలయం, కణితి రోడ్డు, వుడా రోడ్డులోని శివాలయాలకు వేకువ జాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. ఆలయాలకు భక్తులు పోటెత్తడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఉదయం, సాయంత్రం ఆలయాల ధ్వజ స్తంభాలు, ప్రాంగణంలోని చెట్ల వద్ద మహిళలు, యువతులు దీపారాధనలో పాల్గొన్నారు. సనత్‌నగర్ శివాలయంలో సాయంత్రం నిర్వహించిన జ్వాలాతోరణ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కూర్మన్నపాలెం: జీవీఎంసీ 86వ వార్డు మాతృశ్రీ నగర్ శివాలయంలో ఆలయ ధర్మకర్త దామా సుబ్బారావు పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. 71వ వార్డు శ్రీనగర్ శివాలయంలో, ఆటోనగర్, కుంచుమాంబకాలనీ శివాలయంలో, రాజీవ్ నగర్‌లో సోడ సోమన్న ఈశ్వరాలయంలో, 87వ వార్డు సంతమామిడితోట శివాలయంలో పూజలు చేశారు. రాజీవ్ నగర్‌లో ఏర్పాటు చేసిన 18 అడుగుల ఏకశిల శివలింగానికి పంచామృత అభిషేకాలు, సహస్ర దీపార్చన చేపట్టారు. వడ్లపూడి పద్మశాలివీధి ఉమా మార్కండేయస్వామి ఆలయంలో హోమాలు, సామూహిక కుంకుమ పూజలు జరిపారు. గ్రీన్‌సిటీ శ్రీవారి ఆలయంలోనూ పూజలు నిర్వహించారు.
పెదగంట్యాడ: కార్తీక సోమవారం సంద ర్భంగా నెల్లిముక్కు శివాలయం, బాలచెరువు ఉమారామలింగేశ్వరాలయం, దుర్గవానిపాలెం భీమేశ్వరాలయం, వికాస్‌నగర్, ప్రియదర్శినీకాలనీ, వెంకన్నపాలెం, నడుపూరులలోని శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు.
అగనంపూడి: అగనంపూడి, పరిసర ప్రాంతాల్లోని శివాలయాలకు వేకువజాము నుంచే భక్తులు చేరుకుని పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. పెదమడక ఉమామహేశ్వర ఆలయం, పాత అగనంపూడి లింగాల తిరుగుడి, కర్రివానిపాలెం శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం పలు ఆలయాల వద్ద అన్న సమారాధనలు చేపట్టారు.
అక్కిరెడ్డిపాలెం: జీవీఎంసీ 68, 69 వార్డుల పరిధిలోని శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి. షీలానగర్‌లోని కాశీవిశ్వేశ్వర ఆలయంలో, నాతయ్యపాలెం, అక్కిరెడ్డిపాలెంలోని సాయి సహిత శివ మందిరంలో భక్తులు పూజలు, అభిషేకాలు చేశారు. అలాగే ఎస్టీబీఎల్‌లోని తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో ఊరేగించాక ఊంజల సేవ చేపట్టారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన సహస్ర దీపాలను భక్తులు వెలిగించడంతో దివ్యక్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది.
Updated Date - 2023-11-28T00:38:46+05:30 IST