మళ్లీ కరోనా కలకలం
ABN, Publish Date - Dec 23 , 2023 | 01:03 AM
కరోనా వైరస్ మళ్లీ అలజడి సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
నగరంలో మూడు కేసులు నమోదు
అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
రోజుకు వంద మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం
కేజీహెచ్, విమ్స్‌లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు
వైరస్ బారినపడకుండా తగిన జాగ్రత్తలు
తీసుకోవాలని వైద్యులు సూచన
మాస్క్ తప్పనిసరి
విశాఖపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
కరోనా వైరస్ మళ్లీ అలజడి సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అందాయి. అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతుండగానే శుక్రవారం జిల్లాలో మూడు కరోనా కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ముగ్గురు ల్యాబ్‌కు వెళ్లి పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. వీరు మధురవాడ, మాధవధార, దసపల్లా హిల్స్ ప్రాంతాలకు చెందినవారిగా అధికారులు చెబుతున్నారు. కొత్తగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంటా?, కాదా?...అనే విషయం నిర్ధారించేందుకు బాధితుల నుంచి మరోసారి నమూనాలు సేకరించి విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. వీరిలో ఒకరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో అపోలో ఆస్పత్రిలో చేరారు. మిగిలిన ఇద్దరూ హోమ్ ఐసోలేషన్‌లోనే ఉన్నారు. వీరిని ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొత్త కేసుల పట్ల ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కొవిడ్ బాధితుల కోసం కేజీహెచ్, విమ్స్‌లో కొవిడ్ వార్డులను సిద్ధం చేస్తున్నారు.
ఇవీ లక్షణాలు
కొవిడ్ వైరస్ బారినపడిన వారిలో పొడి దగ్గు, తుమ్ములు, ఒళ్లు నొప్పులు, బలహీనత, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ తరహా లక్షణాలతో మూడు నుంచి ఐదు రోజులపాటు బాధపడుతూ మందులు వాడుతున్నా ప్రయోజనం లేకపోతే కరోనా నిర్ధారిత పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వైరస్‌కు సంబంధించిన వేరియంట్ ఏదైనా తీసుకునే జాగ్రత్తల్లో మార్పు లేదని వైద్యులు చెబుతున్నారు. జన సమర్థంగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, మాస్క్ ధరించడం, చేతులు తరచూ శుభ్రపరుచుకోవడం, వ్యాధి లక్షణాలు ఉంటే సకాలంలో పరీక్ష చేయించుకుని వైద్య సేవలు పొందడం చేయాలంటున్నారు. కొత్త వేరియంట్ కొంత ఇబ్బందికరమైనది అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు, చిన్నారులు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తత అవసరమని ఆయన పేర్కొన్నారు.
రోజుకు వంద మందికి పరీక్షలు
రోజుకు కొవిడ్ తరహా లక్షణాలతో బాధపడుతున్న వంద మందికి పరీక్షలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నుంచి మరోసారి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం నమోదైన పాజిటివ్ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి కుటుంబ సభ్యులు నుంచి కూడా నమూనాలు సేకరించినట్టు ఆయన వెల్లడించారు.
Updated Date - Dec 23 , 2023 | 01:03 AM