వంతెనల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:10 AM
మండల పరిధిలోని మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో పలు చోట్ల వంతెనలు, కల్వర్టులు, కాజ్‌వేల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో గిరిజనులు నాటు పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నారు.
మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతవాసులకు నాటు పడవలే దిక్కు
తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని పాలకులు
ముంచంగిపుట్టు, డిసెంబరు 30: మండల పరిధిలోని మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో పలు చోట్ల వంతెనలు, కల్వర్టులు, కాజ్‌వేల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో గిరిజనులు నాటు పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నారు.
మండలంలోని రంగబయలు, పనసపుట్టు, సుజనకోట, పెదగూడ, దారెల, జోలాపుట్టు, బూసిపుట్టు తదితర పంచాయతీల్లో పలు గ్రామాలు మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతవాసులు రాకపోకలు సాగించాలంటే తప్పనిసరిగా గెడ్డ దాటాల్సిందే. మత్స్యగెడ్డ పాయలు దాటేందుకు నాటు పడవలను ఉపయోగిస్తుండడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. పదేళ్ల క్రితం కుమ్మరిపుట్టు ప్రాంతీయులకు అందించిన రెండు ఫైబర్ బోట్లు మూలకు చేరాయి. దీంతో ఆ ప్రాంతవాసులు కూడా నాటు పడవలపైనే ఆధారపడుతున్నారు. వర్షాకాలంలో ఆయా పంచాయతీల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మత్స్యగెడ్డ పాయలపై వంతెనలు, కాజ్‌వేలు, కల్వర్టులు నిర్మించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
Updated Date - Dec 31 , 2023 | 12:10 AM