అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులకు అందని సరకులు
ABN, Publish Date - Dec 30 , 2023 | 01:24 AM
అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార (రేషన్ సరకులు) పంపిణీ నిలిచిపోయింది.
నిలిచిన డిసెంబరు నెల రెండో విడత రేషన్
సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నట్టు అధికారుల ప్రకటనలు
క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి
అనేక కేంద్రాలకు గుడ్లు, పోషకాహార కిట్లు చేరని వైనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార (రేషన్ సరకులు) పంపిణీ నిలిచిపోయింది. డిమాండ్ల సాధన కోసం గడిచిన 18 రోజులుగా అంగన్‌వాడీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. దీంతో లబ్ధిదారులకు డిసెంబరు నెలలో రెండో విడత పోషకాహార పంపిణీ కాలేదు.
జిల్లావ్యాప్తంగా 776 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వాటి పరిధిలో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 12,600 మంది, గర్భిణులు, బాలింతలు మరో 16 వేల మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రెండు విడతల్లో పోషకాలతో కూడిన ఆహారం తయారుచేసుకునేందుకు గాను రేషన్ సరకులు పంపిణీ చేస్తుంటారు. ఈ నెల మొదటి శుక్రవారం సరకులను అంగన్‌వాడీ సిబ్బంది పంపిణీ చేశారు. ఆ తరువాత (ఈ నెల 12 నుంచి) నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో లబ్ధిదారులకు ఈ నెల రెండో విడత (ఈ నెల 22న పంపిణీ చేయాల్సినవి) రేషన్ సరకులు అందలేదు. అంగన్‌వాడీలపై ఒత్తిడి పెంచేందుకు గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా కేంద్రాలను ప్రభుత్వం తెరిపించింది. వారితో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు పాఠాలు చెప్పించడంతోపాటు కేంద్రాల్లోనే ఆహారం వండి వడ్డించాలని, అలాగే లబ్ధిదారులకు రేషన్ సరకులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే, జిల్లావ్యాప్తంగా ఎక్కడా ప్రభుత్వ ఆదేశాలు ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. సచివాలయాల సిబ్బంది కేంద్రాలను తెరుస్తున్నారు గానీ చిన్నారులు ఎవరూ రావడం లేదు. ఇకపోతే, సరకులు పంపిణీకి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఒకటి, రెండుచోట్ల మాత్రమే బాలామృతాన్ని లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది అందించ గలిగారు. కానీ, అధికారులు మాత్రం లబ్ధిదారులందరికీ సరకులు అందిస్తున్నామని చెబుతున్నారు.
సరకులు లేకుండా పంపిణీ ఎలా..?
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించే చర్యల్లో భాగంగా కొన్నిరకాల వస్తువులను పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు గుడ్లు, పాలు, బాలామృతం, అలాగే, గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లుతోపాటు పోషకాహార కిట్ అందిస్తున్నారు. ఈ కిట్‌లో రెండు కిలోల రాగి పిండి, కేజీ అటుకులు, పావు కేజీ చొప్పున చిక్కీ, బెల్లం, ఎండు ఖర్జూరం ఉంటాయి. అయితే, జిల్లాలోని అనేక కేంద్రాలకు అసలు ఈ కిట్లు సరఫరా కాలేదు. కొన్ని కేంద్రాలకు గుడ్లు చేరలేదు. కానీ, అధికారులు మాత్రం లబ్ధిదారులకు వాటిని అందిస్తున్నట్టు చెబుతున్నారు. కొన్నిచోట్ల కేంద్రాల్లో ఉన్న బాలామృతాన్ని మాత్రమే లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది అందించారు. మరికొన్నిచోట్ల మిగిలిన స్టాక్‌కు సంబంధించిన రేషన్, పోషకాహార కిట్లు ఇచ్చి..మొత్తం లబ్ధిదారులకు పంపిణీ చేసేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, లబ్ధిదారులు మాత్రం తమకు ఏమీ ఇవ్వడం లేదని వాపోతున్నారు. అలాగే, జిల్లావ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, అనేకచోట్ల కేంద్రాలు మూసి ఉంటుండగా, కొన్నిచోట్ల సచివాలయ సిబ్బంది వెళ్లి కూర్చుంటున్నారు. కానీ, అధికారులు మాత్రం పిల్లలు వస్తున్నారని లెక్కలు చూపిస్తున్నారు.
Updated Date - Dec 30 , 2023 | 01:24 AM