క్లీన్ ఘాటీ.. గ్రీన్ బ్యూటీ
ABN, Publish Date - Dec 27 , 2023 | 12:29 AM
మన్యంలోని ఘాట్ మార్గాలు ప్రస్తుతం అందంగా కనిపిస్తున్నాయి. ఈ మార్గాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు పచ్చదనం సైతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఏజెన్సీలో ప్రకృతి అందాల్లో భాగమైన ఘాట్ మార్గాల వద్ద ఫొటోలు దిగేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రతి ఏడాది పర్యాటక సీజన్‌లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
- సత్ఫలితాలిస్తున్న ఘాట్ మార్గాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం
- పాడేరు, అరకులోయ, జి.మాడుగుల ప్రాంతాల్లో అమలు
- గత ఏడాది డిసెంబరు 19న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
- ప్రతి ఏడాది పర్యాటక సీజన్‌లో అమలుకు అధికారుల నిర్ణయం
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
మన్యంలోని ఘాట్ మార్గాలు ప్రస్తుతం అందంగా కనిపిస్తున్నాయి. ఈ మార్గాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు పచ్చదనం సైతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఏజెన్సీలో ప్రకృతి అందాల్లో భాగమైన ఘాట్ మార్గాల వద్ద ఫొటోలు దిగేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రతి ఏడాది పర్యాటక సీజన్‌లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
పర్యాటక సీజన్‌లో మన్యంలోని ఘాట్ మార్గాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు ఘాట్ రోడ్డును సుందరంగా ఉంచాలనే లక్ష్యంతో గతేడాది డిసెంబరు 19న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఇది ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తోంది.
పర్యాటక సీజన్‌లో మన్యంలోని ఘాట్ రోడ్డు శుభ్రంగా ఉండడంతో పాటు గ్రీన్‌గా, మరింత సుందరంగా కనిపిస్తున్నది. దీంతో ఏజెన్సీకి వచ్చే వారిని ఘాట్ మార్గంలోని పచ్చని అందాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏడాది డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాలను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో వారి వెంట తీసుకువస్తున్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లేట్‌లు, ఇతర ఆహార పదార్థాలను ప్యాకింగ్‌తో వచ్చిన కవర్లు, తదితరాలను ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. ప్రధానంగా మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి వచ్చే క్రమంలో పాడేరు, అరకులోయ ఘాట్ మార్గాలతో పాటు కొత్తపల్లి జలపాతం ఉండడంతో జి.మాడుగుల ప్రాంతంలో అధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో ఎంతో అందంగా ఉండే ఏజెన్సీ రోడ్లు సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారంతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పైగా పారిశుధ్య లోపంతో పర్యావరణానికి సమస్యలు ఏర్పడుతున్నాయి.
సత్ఫలితాన్నిస్తున్న కలెక్టర్, డీఎఫ్‌వో నిర్ణయం
ఏజెన్సీలోని పాడేరు, అరకులోయ ఘాట్ మార్గాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్, డివిజన్ అటవీ అధికారి వినోద్‌కుమార్ భావించారు. దీంతో గత ఏడాది డిసెంబరు నెల 19న పైలట్ ప్రాజెక్టుగా ఘాట్‌మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాడేరు ఘాట్‌లో పాడేరు నుంచి గరికబంద వరకు, అలాగే అరకులోయ ఘాట్ మార్గంతో పాటు పాడేరు నుంచి జి.మాడుగుల వరకు మెయిన్‌రోడ్డుపై ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు పడి వున్న చెత్తాచెదారం సైతం సేకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు సుమారుగా 50 మంది కార్మికులు పాడేరు, అరకులోయ ఘాట్‌మార్గాలతోపాటు, పాడేరు నుంచి జి,మాడుగుల వరకు వున్న రోడ్డులో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కనిపించిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని సేకరించి కుప్పలుగా పోసి, వాటిని ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ తరహా కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత పర్యాటక సీజన్‌లో ఘాట్ రోడ్డు అందంగా కనిపిస్తుండడంతో సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు.
Updated Date - Dec 27 , 2023 | 12:29 AM